
చట్టాలు కాగితాలకూ... ఆదర్శాలు ఉపన్యాసాలకూ పరిమితమవుతూ రాజ్యాంగ విలువలకు గ్రహణం పడుతున్న వేళ సర్వోన్నత న్యాయస్థానం ఒక విలువైన తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను ఆదేశించింది. అదే సమయంలో అటువంటి ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉంటుందని తెలియజేసింది.
పదో షెడ్యూల్ 6(1) పేరా చెప్తున్నదాని ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకునేటప్పుడు స్పీకర్ ఒక ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నట్టేనని, అందువల్ల రాజ్యాంగ అధికరణలు 226, 227 ప్రకారం హైకోర్టులూ, 136 అధికరణ ప్రకారం సుప్రీంకోర్టూ స్పీకర్ చర్యల్ని సమీక్షించవచ్చని ధర్మాసనం చెప్పటం విశేషం. ఈ విషయంలో 122, 212 అధికరణల కింద స్పీకర్లకు రాజ్యాంగపరమైన రక్షణ ఉండబోదని కూడా తేల్చింది.
అసెంబ్లీలు మొదలుకొని పార్లమెంటు వరకూ ఫిరాయింపుల జాడ్యం ఇటీవలి కాలంలో బాగా ముదిరింది. కమ్యూనిస్టులు, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి ఒకటి రెండు పక్షాలూ తప్ప ఈ జాడ్యానికి దూరంగా ఉన్న పార్టీలు అతి స్వల్పం. స్వల్ప మెజారిటీతో గద్దెకెక్కినా, సంఖ్యాబలానికి అంతో ఇంతో తక్కువున్నా ఫిరాయింపుల్ని ప్రోత్సహించటం అలవాటైపోయింది.
రాజీవ్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకొచ్చింది. అయితే ఆచరణలో అది ప్రభావవంతంగా లేదని గ్రహించి 2003లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉండగా 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని పటిష్ఠపరిచారు. చిత్రమేమంటే దేశంలో మూడొంతుల ముప్పాతిక ఫిరాయింపులకు ఈ రెండు పార్టీలే కారణం.
అందుకు మణిపుర్ మొదలుకొని కర్ణాటక, మహారాష్ట్రల వరకూ ఎన్నయినా ఉదాహరణలు చూపించొచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన కేసు తెలంగాణలో బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యే లకు సంబంధించింది. ఆ ఫిరాయింపుల్ని సవాలు చేసిన బీఆర్‌ఎస్, అధికారంలో ఉండగా తానూ అదే పని చేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిగజారుడు తనాన్ని ప్రోత్సహించటంలో ఆరితేరినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణలో తన పార్టీ తరఫున నెగ్గినవారిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులిచ్చా రని ఆవేశంతో రెచ్చిపోయి మాట్లాడిన బాబు... ఒకటి రెండు నెలలయ్యేసరికి ఏపీలో తానూ అదే పని నిస్సిగ్గుగా చేశారు.
అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున నెగ్గిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఈమధ్య వైఎస్సార్ కాంగ్రె స్‌కు చెందిన రాజ్యసభ, శాసనమండలి సభ్యులు కొందరిని లోబర్చుకుని పార్టీకీ, చట్ట సభల సభ్యత్వానికీ రాజీనామా చేయించారు.
విలువల గురించి అతిగా మాట్లాడే అలవాటున్న బీజేపీ ఇందుకు తోడ్పడటమేకాక... తానూ లాభపడింది. ఏపీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థల్లో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతున్నదో అందరూ గమనిస్తూనే ఉన్నారు.
చట్టసభలను కేవలం శాసనాలు చేసే వేదికలుగా మాత్రమే పరిగణించటం సరికాదు. అయి దేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు, వారి ఆకాంక్షలు ఆ చట్టసభల పనితీరులో ప్రతిఫలించాలి. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శప్రాయులుగా ఉండాలి.
అధికారం వచ్చింది మొదలు ప్రతిపక్షాన్ని బలహీనపరచటం ఎలా, కక్ష తీర్చుకోవటం ఎలా అనే అంశాలే నిత్యకృత్యమైతే అందువల్ల అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ విషయంలో సభాధ్య క్షుల పాత్ర ఎంతో కీలకమైనది. వారు తటస్థంగా, సమర్థంగా వ్యవహరిస్తే చాలావరకూ ఈ జాడ్యం పోతుంది.
చట్టసభల ఔన్నత్యం పెరుగుతుంది. చాలా సందర్భాల్లో వారు పాలకపక్షాలకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు మొదలుకొని అసెంబ్లీల వరకూ సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో కొచ్చాయి గనుక ఇప్పుడేదీ రహస్యం కాదు. అధ్యక్ష స్థానంలో ఉన్నవారి వ్యవహార శైలి ఎలా ఉంటున్నదో అందరూ ఆ క్షణంలోనే పసిగడుతున్నారు.
సభాధ్యక్షులు తలుచుకుంటే ఫిరాయింపుల సమస్య పరిష్కారం పెద్ద కష్టం కాదు. కానీ అది సజావుగా సాగటం లేదు. 2014లో తమ పార్టీ నుంచి ఫిరాయించినవారిపై అటు లోక్‌సభ లోనూ, ఇటు అసెంబ్లీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే రెండు చోట్లా స్పందన ఒకేలా ఉంది. ఆ చట్టసభల గడువు ముగిసే సమయానికి కూడా స్పీకర్లు నిర్ణయం ప్రకటించలేక పోయారు.
ఇలాంటి పరిస్థితులున్నప్పుడు రాజ్యాంగ న్యాయస్థానాలు కళ్లు మూసుకుని ఉండ గలవా? ఫిరాయింపుదార్లపై చర్య తీసుకునే విషయంలో స్పీకర్లకున్న నిర్ణయాధికారాన్ని పార్లమెంటు సమీక్షిస్తే మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ ఆ చట్టంలోని లొసుగులతో అందరూ లాభపడుతున్నప్పుడు దీన్ని ఆశించటం అత్యాశేనేమో!