ఈసారి ఏప్రిల్ అధిక ఉష్ణోగ్రతలతోపాటు ఎన్నికల వేడిని కూడా చవిచూడబోతోంది. నాలుగు రాష్ట్రాలు– తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ప్రకటించింది. బెంగాల్‌లో రెండు దఫాలుగా ఏప్రిల్ 23, 29ల్లో పోలింగ్ జరగనుండగా, మిగిలినచోట్ల 9న ఒకే దఫాతో ముగుస్తుంది. అన్నింటి ఫలితాలూ మే 4న వెలువడతాయి.
2006 నుంచి చూస్తే వేలంపాట మాదిరి అయిదు నుంచి ఎనిమిది దఫాలుగా పోలింగ్ సాగిన చరిత్రగల బెంగాల్‌లో ఈసారి కేవలం రెండు దఫాలతో సరిపెట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరిపి 60.06 లక్షల మంది ఓటర్లను త్రిశంకు స్వర్గంలో ఉంచిన ఈసీ... ఆ విషయం తేలకుండానే బెంగాల్ ఎన్నికలు నిర్వహించబోతోంది. ఆ విషయంలో వచ్చిన ఫిర్యాదులను హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఏర్పడే అప్పిలేట్ ట్రిబ్యునళ్లు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇప్పటికే 705 మంది ఆ పనిలో ఉన్నారు. రోజుకు లక్ష ఫిర్యాదుల్ని పరిష్కరిస్తున్నారు. అలా చూసుకుంటే నామినేషన్ల ఘట్టం ముగిసే ఏప్రిల్ 9 నాటికి 39 లక్షలమంది వినతులు పరిష్కారమవుతాయి. వారిలో ఎందరికి ఓటేసే భాగ్యం దక్కుతుందోగానీ... ఎటూ తేలకుండా 20 లక్షల మందికిపైగా మిగిలిపోతారు. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం 23(3) ప్రకారం నామినేషన్ల గడువు ముగిశాక ఎన్నికల జాబితా మారకూడదు.
అధికారంలో ఉండగా ఏం చేసినా, ఎన్నికల సీజన్ వచ్చేసరికి వాగ్దానాలు వరదలై పారటం మనకు రివాజైంది. అధికారంలో ఉన్న వెసులుబాటు ఉపయోగించుకుని ఏదో పథకం పేరిట మహిళా ఓటర్ల ఖాతాలకు డబ్బు పంపిణీ సంప్రదాయం నిరుడు నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ ఎన్డీయే కూటమి మొదలెట్టింది. దానికింద 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున పంపిణీ అయ్యాయి. దీనికి మలి దశ కూడా ఉంటుందని చెప్పడం మరింత లాభించింది.
మహిళలంతా ఎన్డీయేకు నీరాజనాలు పట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ఆ బాటలోనే 1.31 కోట్లమంది మహిళల ఖాతాలకు రూ. 5,000 చొప్పున గత నెలలో బదిలీ చేశారు. ఇవిగాక రాబోయే రోజుల్లో పార్టీలు విడుదల చేయబోయే మేనిఫెస్టోల నిండా ఎటూ ఉచితాల మోత మోగుతుంది.
ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఒక్క అస్సాంలో తప్ప మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. పుదుచ్చేరిలో మాత్రం ప్రాంతీయ పక్షం ఎన్నార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. ఓట్ల శాతం క్రమేపీ పెరుగుతూ వస్తున్న బెంగాల్‌లో ఈసారి నిర్ణయాత్మక పాత్ర పోషించగలమని ఆ పార్టీ విశ్వసిస్తోంది. కానీ వచ్చిన ఏ అవకాశాన్నయినా అంత తేలిగ్గా వదలని తృణమూల్ అధినేత, సీఎం మమతా బెనర్జీ ముందు ఎవరి ఎత్తుగడలైనా ఫలించటం అంత తేలిక కాదు.
సినీ నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన టీవీకే పార్టీతో పొత్తు ఖరారైతే తమిళనాడు తమ జోలెలో పడుతుందని బీజేపీ ఆశిస్తోంది. మిత్రపక్షం అన్నా డీఎంకేపై పెద్దగా ఆశలేమీ లేవు. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను ఢీకొనడం కష్టమే. కేరళలో వరసగా పదేళ్లు సీపీఎం నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్ ఏలుబడి సాగింది గనుక అక్కడ కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్‌లో బాగా ఆశలున్నాయి.
2014 నుంచి వరసగా అధికారంలోకొస్తున్న అస్సాంలో బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. 2023 నాటి నియోజకవర్గాల పునర్విభజనతో ముస్లిం ప్రాతినిధ్యం ఉండే స్థానాలు 23కి పడిపోవడం, మొన్నటి బడ్జెట్‌లో మహిళలకూ, యువతకూ ప్రకటించిన రూ. 5,000 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలు ఆ ఆత్మవిశ్వాసానికి మూలం. కాంగ్రెస్ సంస్థాగత బలహీనతలు సరేసరి.
ఈ ఎన్నికలు ఈసీ విశ్వసనీయతకు కూడా పరీక్ష. లోక్‌సభలో అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోతున్న తరుణంలో ఈసారైనా తటస్థత పాటిస్తుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ, హోం కార్యదర్శినీ మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై రెండేళ్లు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ఆ సంస్థ వైఖరి ఈ ఎన్నికల విషయంలో మారకపోతే మరిన్ని ఛీత్కారాలు తప్పవు. మొత్తానికి ఏ పార్టీ జాతకం ఏమిటో తెలియడానికి మే నాలుగో తేదీ వరకూ ఆగక తప్పదు.


