డ్రగ్స్‌ మాఫియా అరాచకం | Sakshi Editorial On Drugs Mafia | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ మాఫియా అరాచకం

Mar 18 2026 12:58 AM | Updated on Mar 18 2026 5:43 AM

Sakshi Editorial On Drugs Mafia

హైదరాబాద్‌ శివారులో ఒక పెద్ద ఫాంహౌస్‌... అక్కడొక ఈత కొలను...దాని పక్కనే ఆశీనులైన బడాబాబులు... ముందున్న టేబుళ్లపై ఖరీదైన మద్యం సీసాలు, మాదక ద్రవ్యాలు... జర్మన్‌ తయారీ రివాల్వర్‌తో పోలీసులపై కాల్పులు, బెదిరింపులు, వాగ్వాదాలు– క్రైమ్‌ కథాచిత్రాన్ని తలదన్నే శనివారం నాటి ఈ దృశ్యం మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయంటే కించిత్తు ఆశ్చర్యం కలుగుతుంది. మొన్న జనవరిలో కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్‌ రెడ్డి పట్టుబడితే, తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌తోపాటు మరికొందరు దొరికిన వైనం దీన్ని రుజువు చేస్తోంది. 

వేయి తలల విషనాగు లాంటి మాదక ద్రవ్య మహమ్మారి ఆనుపానులు రాబట్టడానికి, దాన్ని అంతమొందించటానికి పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు. కానీ బడి పిల్లలు మొదలుకొని ఆడ మగ తేడా లేకుండా అందరినీ కాటేస్తున్న ఈ విషనాగు వెనక రాజకీయ పలుకుబడి గల కుటుంబాలున్నాయనీ, కనుకనే దాని అదుపు అసాధ్యమవుతున్నదనీ ఈ పరిణామాలు తెలియజెబుతున్నాయి. ఒకరా ఇద్దరా... తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి, రాజస్థాన్‌ మాజీ ఎమ్మెల్యే నితీశ్‌ శర్మ, ఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నమిత్‌ శర్మ వగైరా 11 మంది ఈ డ్రగ్స్‌ దందాలో దొరికారు. 

రెండేళ్ల నాడు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల ప్రసంగాలను గుర్తుంచుకుని ఇప్పుడు వెల్లడవుతున్న పరిణామాలతో బేరీజు వేసుకుంటే ఆ నేతల వంచన ఏపాటిదో అర్థమవుతుంది. మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిందంటూ వారు పెడబొబ్బలు పెట్టారు. ‘మేం వస్తే వంద రోజుల్లో అరికడతామ’ంటూ ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకొచ్చాక అంతవరకూ సాధించిన విజయాలను గుల్లచేశారు. 

అది మళ్లీ తలెత్తి విస్తరించటానికి అవకాశమిచ్చారు. అప్పటి దుష్ప్రచారమంతా గెలుపు కోసం మాత్రమే కాదు... మాదక ద్రవ్యాలను అరికట్టడం వల్ల కలుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం కోసమని ఆ కూటమి పీఠం ఎక్కింది మొదలు జరుగుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్‌ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నాయి. 

‘గంజాయి వద్దు బ్రో...’ అంటూనే మాదక ద్రవ్యాలకు తలుపులు బార్లా తెరిచారు. ఏపీలో మాదక ద్రవ్య చీడను అంతమొందించటానికి గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆపరేషన్‌ పరివర్తన్‌ను రెండు దశల్లో విజయవంతంగా అమలు చేసింది. దానికితోడు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌)ను ఏర్పాటు చేసింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఉండే 11,500 ఎకరాల్లోని గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు, గిరిజనులు ఇతర పంటల వైపు మళ్లేలా రూ. 500 కోట్లతో ప్రోత్సాహకాలందించింది. విస్తృత తనిఖీలు చేపట్టింది. 

ఈ కృషినంతా కూటమి పాలన నీరుగార్చింది. పర్యవసానంగా విద్యాసంస్థల్లో చిల్లరగా... ఫామ్‌హౌస్‌ పార్టీలకు టోకుగా గంజాయి, కొకైన్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వగైరాలు చేరిపోతున్నాయి. ఏడాదికి రూ.5,000 కోట్లు వెనకేసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాకు మూలవిరాట్టులు చంద్రబాబు చుట్టూ ఉండే సీనియర్‌ నేతల కుటుంబాలవారు కావటంతో ఏపీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. 

మాదక ద్రవ్యాల వ్యాప్తిపై వెల్లడవుతున్న గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా భద్రతా విభాగాలకు రూ. 25,330 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. అంతక్రితంతో పోలిస్తే ఇది 55 శాతం కన్నా అధికం. ఏపీలో వీటికి అలవాటుపడిన వారిలో 10–17 ఏళ్ల మధ్య గలవారి సంఖ్య 3.19 లక్షలు ఉన్నట్టు చెబుతున్నారు. వీటి వెనక డబ్బాశ మాత్రమే కాదు, దాని ఆసరాతో రాజకీయాలను శాసించటం అసలు లక్ష్యం. 

మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో తెలంగాణ పోలీసులకు అంతో ఇంతో మంచి పేరుంది. కానీ తాజా కేసు తీవ్రత తెలిసి కూడా, నిందితుడిగా ఉండాల్సిన వ్యక్తికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి ఆ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వ్యవహరిస్తేనే ఉగ్రవాదాన్ని మించిన ఈ మహమ్మారి దుంపనాశనం సాధ్యం. 

Advertisement
 
Advertisement
Advertisement