అందరి కళ్లూ సుప్రీం పైనే!

Sakshi Editorial On Supreme Court Of India About Homos

దేశంలో సంప్రదాయం ఒకటి ఉండవచ్చు. రాజ్యాంగమిచ్చే హక్కు వేరొకటి కావచ్చు. రెంటి మధ్య ఘర్షణలో త్రాసు ఎటు మొగ్గాలి? ధర్మసందేహమే! విభిన్న ప్రకృతులైన స్త్రీ పురుషుల సంపర్కం, వివాహమే భారతీయ సమాజ సంప్రదాయం, చట్టబద్ధం. సంప్రదాయం కాకపోగా, బ్రిటీషు కాలపు చట్టం కింద నిన్నటి దాకా శిక్షార్హమైన స్వలింగ సంపర్కం మారుతున్న కాలానుగుణంగా శిక్షార్హం కాదని కొన్నేళ్ళ క్రితమే తీర్పిచ్చిన మన సుప్రీమ్‌ కోర్ట్‌ ఇక స్వలింగ వివాహమూ చట్టబద్ధమేనని తేలుస్తుందా అన్నది చర్చనీయాంశం.

భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధతను కేంద్రం తన అఫిడవిట్‌లో మార్చి 13న వ్యతిరేకించింది. ‘ఎంతో ప్రభావశీలమైన’ ఈ కేసులో తుది వాదనలు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విని, నిర్ణయిస్తుందని సుప్రీమ్‌ తేల్చింది. ఈ కేసు, ఏప్రిల్‌18 నుంచి ప్రత్యక్షప్రసారంలో జరగనున్న వాదనలు భారత సమాజంలో కీలకం కానున్నాయి. 

పౌరులందరూ సమానులేనన్నది రాజ్యాంగ మౌలిక సూత్రం. వ్యక్తిగత ఇష్టానిష్టాలు, అభిప్రా యాలు, అలవాట్లు, నమ్మకాలను బట్టి దాన్ని మార్చలేం. మార్చకూడదు. కాబట్టి స్వలింగ సంపర్కు లకూ అందరితో సమానంగా హక్కులు రాజ్యాంగ విహితమే. అయితే, సంప్రదాయవాద భారతీయ సమాజంలో స్వలింగ వివాహం సున్నిత అంశం.

అన్ని వర్గాల నుంచి అన్ని రకాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోకుండా చటుక్కున తేల్చే వ్యవహారం కాదు. ఆధునిక అమెరికాలోనూ దీర్ఘ కాలం దీనిపై చర్చోపచర్చలు నడిచాయి. అక్కడ డజనుకు పైగా రాష్ట్రాల్లో ఈ పెళ్ళిళ్ళు నిషిద్ధం. 2008లో తొలిసారి అధ్యక్షపదవికి పోటీకి దిగినప్పుడు ఒబామా సైతం ఈ వివాహాల్ని వ్యతిరేకించారు. దీర్ఘపోరు తర్వాత 2015లో అమెరికా సుప్రీమ్‌ తీర్పుతో 50 రాష్ట్రాల్లోనూ పరిస్థితి మారింది. 

నిజానికి, 2018 సెప్టెంబర్‌లో భారత సర్వోన్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కం శిక్షార్హం కాదని తేల్చింది. పాతకాలపు చట్టాన్ని పక్కనపెట్టి ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై అప్పట్లోనే గగ్గోలు పుట్టింది. సాంస్కృతిక విలువలకు తిలోదకాలిచ్చి, పాశ్చాత్య సంస్కృతిని అలవరుచుకుంటున్నామంటూ విమర్శలు రేగాయి. తీరా స్వలింగ సంపర్కం తప్పు కాదని కోర్టు చెప్పినా తమకు సామాజిక అంగీకారం లభించడం లేదనీ, తమపై దుర్విచక్షణ సాగుతూనే ఉందనీ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్ల (ఎల్జీబీటీక్యూ) వర్గం ఫిర్యాదు చేస్తోంది.

కథ చకచకా ముందుకు సాగి, స్వలింగ సంపర్కం నేరం కాదనే దశ నుంచి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోరడం దాకా ఇప్పుడు వచ్చింది. హోమో సెక్సువల్‌ పెళ్ళిళ్ళను చట్టబద్ధమైనవని గుర్తించాలని కోరుతూ, 2020లోనే ఢిల్లీ, కేరళ హైకోర్టుల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తర్వాత సుప్రీమ్‌కు పిటిషన్లు చేరాయి. కోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. 

కేంద్రం మార్చి 13న సుప్రీమ్‌లో తన అఫిడవిట్‌ దాఖలు చేస్తూ, స్వలింగ వివాహాల చట్టబద్ధతకు ససేమిరా అంది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని భారత శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్‌ మాట. ఆ సెక్షన్‌ కింద స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని అయిదేళ్ళ క్రితం తీర్పునిచ్చినంత మాత్రాన ఏకంగా స్వలింగ వివాహాన్ని వివిధ చట్టాల కింద తమ ప్రాథమిక హక్కని పిటిషనర్లు అనుకోరాదన్నది ప్రభుత్వ వాదన.

భారతీయ కుటుంబ వ్యవస్థకూ, ఈ స్వలింగ వివాహాలకూ పొంతన కుదరదని సర్కారీ అఫిడవిట్‌. 2018లో కోర్ట్‌ వల్ల రాజ్యాంగ హక్కులు లభించాయి కానీ, స్వలింగ వివాహాల్ని చట్టప్రకారం గుర్తించనిదే వైద్యచికిత్సకు సమ్మతి పత్రంపై సంతకాలు, పింఛన్లు, దత్తత స్వీకారాలు, చివరకు స్వలింగ దంపతులకు క్లబ్‌ సభ్యత్వాల లాంటి ప్రాథమిక హక్కులూ కరవేనని ఎల్జీబీటీ ఉద్యమకారుల వేదన. ఈ పరిస్థితుల్లో మార్చి 18 నుంచి రాజ్యాంగ ధర్మాసనం జరిపే విచారణకై వేచిచూడాలి.

1989లో ప్రపంచంలోనే తొలిసారిగా డెన్మార్క్‌ స్వలింగ భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ చట్టం చేసింది. ఇక బ్రిటన్‌లో ఈ పెళ్ళిళ్ళను అంగీకరించడానికి 32 ఏళ్ళు పట్టింది. అమెరికాలో పుష్కర కాలమైంది. ఫ్రాన్స్‌లో ఏకంగా 220 ఏళ్ళు పట్టింది. స్వలింగ సంపర్కం ఎన్నడూ నేరమే కాని తైవాన్‌లో సైతం మొన్న 2019లో కానీ వీటికి ప్రభుత్వ గుర్తింపు దక్కలేదు.

భారత్‌ మరి గత అయిదేళ్ళలోనే ఈ సంప్రదాయ విరుద్ధ, సాహసోపేత నిర్ణయం తీసుకొనే దశకు చేరుకుందా? ఆధునిక సమాజంలో ఎల్జీబీటీ హక్కుల్ని కాదనలేం. కానీ ఇప్పటికీ పెళ్ళంటే ఒకే కులం, మతం, సంప్రదాయాలకే మొగ్గే మెజారిటీ జనమున్న దేశంలో ఈ మార్పు భావోద్వేగభరిత అంశం.

ధార్మిక, అంగీకృత సామాజిక విలువలు ముడిపడ్డ ఈ అంశంలో తొందరపడితే పర్సనల్‌ చట్టాల తేనెతుట్టె కదులుతుంది. పర్యవసానాలు సామాజికంగా, రాజకీయంగా తప్పవు. మెజారిటీ మనోభీ ష్టానికి వ్యతిరేకంగా లైంగిక సంబంధాలు, పెళ్ళి, లైంగిక సమ్మతి వయసు, దత్తత, వారసత్వహక్కు లాంటివి పాలకులు ముట్టనిదీ అందుకే. కడకు ఇలాంటివి కోర్టు గుమ్మం తొక్కడమూ సహజమే.

ప్రస్తుతం ఆస్ట్రేలియా, జర్మనీ సహా 32 దేశాల్లో ఈ పెళ్ళిళ్ళు చట్టబద్ధమే. కానీ, లైంగిక మైనారిటీ దంపతుల పెంపకంలోని పిల్లల చదువు, ఆరోగ్యం, సామాజిక – ఆర్థిక పురోగతిపై వివిధ పరిశోధ నలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

అది అటుంచినా, ఆ భావిపౌరులపై సమాజంలో పడే ముద్రకూ, ఎదురయ్యే సహాయ నిరాకరణకూ పరిష్కారమేంటి? స్వలింగ వివాహాలకు చట్టబద్ధత నిస్తే, అనేక చట్టాలను పునర్నిర్వచించక తప్పదు. అది మరో సవాలు. అన్నిటికీ సిద్ధమై, సమాజంలో అందరినీ సిద్ధం చేయకుండా తొందరపడితే కష్టం. అందుకే, ఇప్పుడు అందరి కళ్ళూ సుప్రీమ్‌ పైనే! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top