
డబ్బూ పలుకుబడీ జతగూడితే ఎన్ని నేరాలకు కారణమవుతుందో, ఎన్ని వికారాలకు ఆస్కార మిస్తుందో దాదాపు ఇరవయ్యేళ్లక్రితం అమెరికాలో ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టిన్ ఉదంతం రుజువు చేసింది. ఈ రెండింటికీ రాజకీయాధికారం తోడైతే ఏమవుతుందో కర్ణాటక జేడీఎస్ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ నిరూపించారు. ఒక మహిళపై అత్యా చారం చేసిన కేసులో ప్రజ్వల్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రజ్వల్ ఒక రాజకీయ నాయకుడే కాక మాజీ ప్రధాని దేవె గౌడకు మనుమడు కావటం, తండ్రి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవడం, అతని బాబాయ్ కుమార స్వామి లోగడ ముఖ్యమంత్రిగా పనిచేయటంతోపాటు ప్రస్తుతం కేంద్రమంత్రిగా వుండటం, తమ్ముడు ఎమ్మెల్సీ కావటం వంటివి ఈ సంచలనానికి కారణమైతే కావొచ్చు గానీ... అంతకన్నా ఎక్కువగా ప్రజ్వల్ దురంతాలు ప్రజల్ని దిగ్భ్రాంతిపరచటం అసలు కారణం. ఒకరు కాదు... ఇద్దరు కాదు, పదులకొద్దీ మంది ప్రజ్వల్ అఘాయిత్యాలకు బలైపోయారు. అతని ఘోరాలకు సంబంధించి 3,000 వీడియోలు ప్రచారంలోకొచ్చాయంటే అతని దుర్మార్గం ఎంతటిదో ఊహించవచ్చు.
తమనేమీ చేయొద్దని, కనికరించి వదిలేయాలని బాధిత మహిళలు వేడు కోవటం వంటి హృదయవిదారక దృశ్యాలు ఈ వీడియోల్లో ఉన్నాయంటున్నారు. తన ఘన కార్యాన్ని తానే వీడియో తీసి బాధితుల్ని బ్లాక్‌మెయిల్ చేయటం ప్రజ్వల్‌కు అలవాటు. ఆ వీడియోలు, ఫొటోలు చూసి 70 మంది బాధిత మహిళలను గుర్తించగలిగినా వారిలో కేవలం అయిదుగురు మాత్రమే ఫిర్యాదులీయటానికి ముందుకొచ్చారు. అందులో ఒక కేసులో ప్రస్తుతం ప్రజ్వల్‌కు శిక్షపడింది.
ఈ నేరాలు గుట్టుచప్పుడు కాకుండా జరగలేదు. కుటుంబంలో వీటికి సంబంధించి తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధాలవుతున్నాయని మీడియాలో కథనాలొచ్చాయి. కానీ ప్రజ్వల్‌ను చట్టానికి అప్పగించాలని కుటుంబంలో ఏ ఒక్కరూ భావించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతే కాదు... ప్రజ్వల్ తల్లిదండ్రులు బాధితుల్ని బెదిరించిన వైనం వెల్లడైంది. శిక్ష తప్పదనుకున్న ప్రజ్వల్ కొన్నాళ్లు విదేశాలకు పరారయ్యాడు.
చిత్రమేమంటే ఇతర పార్టీలకు సైతం ఉప్పందినా అవి సైతం మౌనంగానే ఉన్నాయి. చివరకు ఒక మహిళా సంఘం ఫిర్యాదు చేయాల్సివచ్చింది. మరి పార్టీలున్నది దేనికి? ఆ ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ వేగంగా స్పందించి, డీజీపీకి ఆదేశాల్విటంతో అంతా బయటికొచ్చింది. రాజకీయంగా శక్తిమంతమైన కుటుంబంతో ఢీకొట్టి నట్టవుతుందని భయపడి బాధితుల్లో అత్యధికులు ఫిర్యాదు చేయటానికి ముందుకు రాలేదు సరి కదా... వారిలో చాలామంది ఏకంగా హసన్ నగరం నుంచి మకాం మార్చేశారు.
ప్రఖ్యాత అమెరికన్ క్రిమినాలజిస్టు ఫ్రెదా అడ్లర్ ఒక సందర్భంలో బాధితులే దోషులుగా మారే ఏకైక నేరం అత్యాచారమేనన్నారు. బాధితులు ఎందుకంత భయపడ్డారో ఈ వ్యాఖ్యే చెబుతుంది. విచారణ పేరిట నిండు న్యాయస్థానంలో అవమానాలు పొంది, న్యాయమూర్తి నుంచే దుర్వా్యఖ్యానాలు ఎదురైన మహిళలు తక్కువేమీ కాదు. ఇందుకు మన దేశం కూడా మినహాయింపు కాదు.
ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించి డీఎన్‌ఏ ఆధారాలతో సహా పకడ్బందీ సాక్ష్యాధా రాలు సేకరించినందుకు, త్వరితగతిన విచారణ పూర్తికావటానికి దోహదపడినందుకు కర్ణాటక పోలీసు విభాగాన్ని అభినందించాలి. ప్రజ్వల్ ఉదంతంలో వీడియోలను ప్రచారంలో పెట్టి బాధితుల్ని మరింతగా వేధించిన ఇతరులను సైతం బోనెక్కించాలి. డబ్బూ, పలుకుబడి గల నిందితు లకు శిక్ష పడేలా చేస్తే, సమాజంలో ఇతరులూ భయపడతారు.
కర్ణాటకలో గతంలో కూడా కొందరు నాయకుల ఉదంతాలు వెల్లడైనా అవి పోలీసుల వరకూ రాలేదు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో అభ్యంతరకర వీడియోలు వీక్షిస్తూ ఎమ్మెల్యేలు లైవ్ కెమెరాలకు చిక్కిన సందర్భాలు న్నాయి. బలహీనులపై అధికారం చలాయించటం, వారిని కనీసం మనుషులుగా గుర్తించక పోవటం స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మన దేశంలో యథేచ్ఛగా సాగిపోతోంది. ఆ బలహీనులు మహిళలైతే ఇక చెప్పేదేముంది?
వందలమంది బాలికలపైనా, మహిళలపైనా లైంగిక నేరాలకు పాల్పడిన ఎపిస్టిన్ 2019లో న్యాయ విచారణ మొదలుకావడానికి ముందే నిర్బంధంలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతగాడికి ఒకప్పుడు సన్నిహితులైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటిష్ రాజవంశీకుడు ప్రిన్స్ ఆండ్రూ తదితరుల్ని ఆ పాపం ఇప్పటికీ వెన్నాడుతోంది. ట్రంప్ అయితే తరచూ సంజాయిషీ ఇచ్చుకోక తప్పడం లేదు. మన దేశంలో కూడా మహిళలపై నేరాలు చేసే బడాబాబులు కటకటాల వెనక్కిపోయినప్పుడే నిజమైన న్యాయం, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్టు లెక్క!