మళ్లీ వివాదంలో ‘ఫేస్‌బుక్‌’  | Sakshi Editorial On Facebook Controversy | Sakshi
Sakshi News home page

మళ్లీ వివాదంలో ‘ఫేస్‌బుక్‌’ 

Aug 19 2020 12:27 AM | Updated on Aug 19 2020 9:12 AM

Sakshi Editorial On Facebook Controversy

ఫేస్‌బుక్‌ వివాదం చూస్తుండగానే ముదిరింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లమంది  వినియోగ దారులతో అగ్రస్థానంలో వున్న ఆ సంస్థ భారత్‌ కార్యకలాపాల గురించి ఆరోపణలు వచ్చిన వెంటనే దాని నిర్వాహకులు తగిన వివరణ ఇచ్చివుంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు. తనకు, తన కుటుంబసభ్యులకు ప్రాణహాని వుందంటూ ఫేస్‌బుక్‌ దక్షిణ, మధ్య ఆసియా ప్రాంతాల పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంఖిదాస్‌ ఫిర్యాదు ఇచ్చేవరకూ ఈ వివాదం వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్‌లతోసహా చాలా దేశాల్లో ఫేస్‌బుక్‌ నిర్వహణ తీరుపై ఆరోపణలు రావడం రివాజే. ఫేస్‌బుక్‌ బాధ్యతారాహిత్యం కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయన్నదే వీటన్నిటి సారాంశం. తాజాగా ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ పత్రిక భారత్‌లో ఫేస్‌బుక్‌ వ్యవహారశైలిపై ప్రచురించిన కథనం పెద్ద దుమారం రేపింది. నాలుగు రోజులనాడు వచ్చిన ఆ కథనం అంఖిదాస్, మరికొందరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపించింది.

హింసను రెచ్చగొట్టేలా, విద్వేషాలు రగిలించేలా ఫేస్‌బుక్‌లో బీజేపీ అనుకూలురు సందేశాలు పెడుతున్నా వీరు తొలగించడానికి అడ్డుపడుతున్నారని ఆ కథనం తెలిపింది. ఏ రకమైన సందేశాలు ప్రమాదకరమైనవిగా భావించాలన్న అంశంలో ఫేస్‌బుక్‌కు కొన్ని నిబంధనలున్నాయి. అంఖిదాస్, మరికొందరు ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, భారత్‌లో వ్యాపారం దెబ్బతింటుందన్న భయమే ఇందుకు కారణమని ఆ కథనం వివరించింది. మొన్న మే నెలలో సైతం ఫేస్‌బుక్‌పై ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ఈ మాదిరి వ్యాసం ఒకటి ప్రచురించింది. విచ్ఛిన్నకరమైన, పాక్షిక దృక్పథంతో కూడిన సందేశాలను తొలగిద్దామని ప్రతిపాదన వచ్చినప్పుడు అమెరికాకు చెందిన ఫేస్‌బుక్‌ నిర్వాహకులు దాన్ని అడ్డుకున్న సందర్భాలున్నాయని అప్పట్లో తెలి పింది. ఆ వ్యాసం వచ్చాక బడా వ్యాపారసంస్థలు సైతం ఫేస్‌బుక్‌లో తమ వ్యాపార ప్రకటనలు నిలిపేశాయి. హింసను, విద్వేషాలను రెచ్చగొట్టే అంశాలను అంగీకరించబోమని, తమ వేదికను దుర్వినియోగం చేసేందుకు అనుమతించబోమని ప్రకటనకర్తలకు, సంస్థ సిబ్బందికి ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ హామీ ఇచ్చారు. కానీ మూడు నెలలు గడవకముందే భారత్‌లోనూ ఆ మాదిరి ఆరోపణలే వచ్చాయి. 

 ఫేస్‌బుక్‌కు దాని పుట్టిల్లయిన అమెరికాలో కంటే భారత్‌లోనే అత్యధిక సంఖ్యలో ఖాతా దార్లున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా వున్న చైనా ఎటూ ఆ సంస్థ కార్యకలాపాలను అనుమతించడం లేదు. మన దేశంలో ఫేస్‌బుక్‌ ఖాతాదార్ల సంఖ్య 33.60 కోట్లు. నాలుగేళ్లక్రితం 21.5 కోట్లున్న ఖాతాదార్లు ఇప్పుడు ఈ స్థాయిలో పెరిగారంటే ఫేస్‌బుక్‌ ప్రభావం మన దేశంలో ఏమేరకు వున్నదో అంచనా వేసుకోవచ్చు. కనుక అమెరికాలో సంస్థ తీరుతెన్నులపై ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో మరింత అప్రమత్తంగా వుండాల్సింది. అది లేకపోవడం వల్ల తాజా వివాదం తలెత్తింది. ఇంతకూ ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ కథనం పూర్తిగా విశ్వసనీయమైనదేనా కాదా అన్నది కూడా చూడాలి. హైదరాబాద్‌లోని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్, ఆ పార్టీకే చెందిన మరో ముగ్గురు పెట్టిన సందేశాలు హింసను రెచ్చగొట్టేలా వున్నాయని సంస్థలో కొందరు అభ్యంతరం తెలిపారని ఆ కథనం చెబుతోంది. వారిపై చర్య తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సమస్యలొస్తాయని, పర్యవసానంగా సంస్థ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని అప్పట్లో అంఖిదాస్‌ చెప్పినట్టు ప్రస్తుత, మాజీ సిబ్బందిని ఉటంకిస్తూ ఆ కథనం వివరించింది.

అయితే ఆ రెండు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రస్తుతం తనకు ఖాతాలే లేవని రాజాసింగ్‌ అంటున్నారు. అదే నిజమైతే ఫేస్‌బుక్‌ తీరు మరింత ప్రశ్నార్థక మవుతుంది. ఒక ప్రజాప్రతినిధి పేరిట ఆయనకు సంబంధం లేకుండా ఖాతా నడుస్తుంటే, అందులో రెచ్చగొట్టే వ్యాఖ్యలుంటే అందుకు బాధ్యులెవరు? ఆయన పేరిటవున్న సందేశాల గురించి సంస్థ అంతర్గత సమావేశంలో ప్రస్తావనకొచ్చినప్పుడే ఆరా తీసివుంటే, కనీసం రాజాసింగ్‌ను అప్పట్లో సంప్రదించివుంటే ఆయనే వాస్తవమేమిటో చెప్పేవారు. ఆ ఖాతాల్లో రోహింగ్యాలపై తాను చేసిన వ్యాఖ్యలు మాత్రమే తనకు సంబంధించినవని ఇప్పుడు రాజాసింగ్‌ చెబుతున్నారు. ఆ వ్యాఖ్యల్లోని మంచిచెడ్డల సంగతలావుంచితే ఫేస్‌బుక్‌ నిర్వాహకులు వ్యాపారప్రయోజనాలకు ఆశపడి తమ కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యారని ఈ ఉదంతం చెబుతోంది. 

ఫేస్‌బుక్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్జించిన రెవెన్యూ 11,737 కోట్ల డాలర్లు. ఇది నిరుటితో పోలిస్తే 17 శాతం అధికం. ఖర్చులు పోను మిగులు దాదాపు ఆరువేల కోట్ల డాలర్లు. దాని మార్కెట్‌ విలువ 50,000 కోట్ల డాలర్లపైమాటే. ఇంతగా లాభాలొచ్చే సంస్థ, కొన్ని దేశాల జీడీపీలతో పోల్చినా సంపన్నవంతమైన సంస్థ ఇలా యధాలాపంగా కార్యకలాపాలు నిర్వహించడం సరైందేనా?  ఫేస్‌బుక్‌ బీజేపీ విషయంలో మెతకగా వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వ సంస్థలు తన ఖాతాదార్ల డేటాను అడిగినప్పుడు వెనకాముందూ చూడకుండా అందజేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రెండేళ్లక్రితం బ్రిటన్‌ కేంద్రంగా పనిచేస్తున్న కేంబ్రిడ్జి అనలిటికా(సీఏ) సంస్థ ఫేస్‌బుక్‌ ఖాతాదార్ల వివరాలను సంతలో సరుకుగా అమ్ముకుందని, మన దేశంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ)లు ఆ డేటాను కొన్నాయని కథనాలొచ్చాయి.

దానిపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఫేస్‌బుక్‌ బాధ్యతను నిగ్గు తేల్చి తగిన చర్య తీసుకునివుంటే బాగుండేది. అలా చేస్తామని అప్పట్లో కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు కూడా. కానీ ఆ విషయంలో పురోగతి లేదు. అమెరికావంటి దేశాల్లో కూడా సంస్థ నిర్వాహకుల్ని పిలిపించి ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు తమ నిర్లక్ష్యంతోనో, కుమ్మక్కు ధోరణితోనో సమాజంలో అశాంతికి కారణమైతే... ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరంగా మారే పరిస్థితివుంటే ఉపేక్షించడం క్షేమం కాదు. ఇప్పటికైనా కేంద్రం సమగ్ర దర్యాప్తు జరిపించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement