ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల మాతృ సంస్థ అయిన మెటా (Meta).. తన ప్లాట్‌ఫామ్‌లలో మోసపూరిత ప్రకటనల ద్వారా బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఇంతకీ ఈ వివాదం ఏమిటి? దీనిపై మెటా స్పందన ఏమిటి? అనే విషయాలను ఇక్కడ చూసేద్దాం.
మెటాపై విమర్శలు
మోసపూరిత ప్రకటనలను సంస్థ గుర్తించినప్పటికీ.. కఠినమైన చర్యలు తీసుకోలేదు. స్కామర్ల ప్రకటనల వల్ల మెటాకు అడ్వర్టైజింగ్ రూపంలో భారీ లాభాలు వస్తున్నాయి. కాబట్టి మెటా అటువంటి ప్రకటనలను అరికట్టడం లేదని నివేదికలు చెబుతున్నాయి. సామాన్య ప్రజలు.. ముఖ్యంగా యువత, వృద్ధులు ఈ మోసాలకు బలయ్యారు. దీంతో అనేక దేశాలు మెటాపై విమర్శలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు సంబంధించిన స్కామ్ ప్రకటనలకు విషయంలో లెక్కలేనన్ని ప్రశ్నలు పుడుతున్నాయి.
మెటా తన ప్లాట్‌ఫామ్‌లలో స్కామ్.. ఇతర మోసపూరిత ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా ఏటా బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత ఏడాదిలో కంపెనీ.. ఒక్క చైనీస్ కంపెనీల ప్రకటనల నుంచి 18 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ డబ్బు సంపాదించిందని, ఇది కంపెనీ ప్రపంచ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువ అని రాయిటర్స్ దర్యాప్తులో వెల్లడించింది.
స్కామ్ ఎగుమతి దేశంగా చైనా!
చైనాలో ఫేస్‌బుక్ & ఇన్‌స్టాగ్రామ్‌లను నిషేదించినప్పటికీ.. అక్కడి కంపెనీలు విదేశీ వినియోగదారులకు ప్రకటనలు ఇవ్వడానికి అనుమతి ఉంది. ఈ విధంగా.. మెటా ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 25% స్కామ్ & నిషేధిత ప్రకటనలు చైనావే కావడం గమనార్హం. దీంతో చాలామంది చైనాను స్కామ్ ఎగుమతి దేశంగా అభివర్ణించారు.
అయితే.. చైనా నుంచి వచ్చే స్కామ్ యాడ్‌లను అరికట్టడానికి మెటా తాత్కాలికంగా ఒక యాంటీ ఫ్రాడ్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందాన్ని ఏర్పాటు చేసిన తరువాత కంపెనీ ఆదాయం 19 శాతం నుంచి 9 శాతానికి తగ్గిపోయింది. దీంతో మెటా ఆ బృందాన్ని 2024 చివరలో రద్దు చేసి, చైనీస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలపై ఆంక్షలు ఎత్తివేసింది. ఆ తరువాత ఆదాయం మళ్లీ 16%కి పెరిగింది.
మెటా స్పందన
మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ (Andy Stone) రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. యాంటీ ఫ్రాడ్ టీమ్ కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని అన్నారు. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. ఆ బృందాన్ని రద్దు చేయాలని ఆదేశించలేదని, స్కామ్ కార్యకలాపాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలను ముమ్మరం చేయాలని కంపెనీని ఆదేశించారని ఆయన స్పష్టం చేశారు. గత 18 నెలల్లో, మెటా తన ప్లాట్‌ఫామ్‌ల నుంచి 46 మిలియన్ల చైనీస్ ప్రకటనలను తొలగించిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: 26ఏళ్ల వయసు.. ఫోర్బ్స్ జాబితాలో చోటు: ఎవరీ కళ్యాణి రామదుర్గం?


