సంకల్పం సరిపోతుందా? | Sakshi
Sakshi News home page

సంకల్పం సరిపోతుందా?

Published Wed, Apr 17 2024 3:53 AM

Sakshi Editorial On BJP And PM Narendra Modi

కొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు దేశం సిద్ధమవుతున్న వేళ పాలక బీజేపీ తన ‘సంకల్ప పత్రం’తో ముందుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక రాగల అయిదేళ్ళలో తన ప్రణాళికలు ఎలా ఉంటాయో ప్రజల ముందు ఉంచింది. దశాబ్ద కాలంగా ఢిల్లీ గద్దెపై ఉంటూ, రాజకీయాల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించిన ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సైతం అందుకు తగినట్టే సాగింది. విశేష ప్రజాకర్షక పథకాల జోలికి పోలేదు. ప్రస్తుత విధానాల కొనసాగింపునే ప్రధానంగా ఆశ్రయించింది.

పార్టీ కన్నా ప్రధాన రథసారథికే అధిక ప్రాధాన్యమిస్తూ, ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ ప్రచారం చేస్తోంది. ఇది మునుపెన్నడూ కాషాయపార్టీలో కనిపించని చిత్రం. ఎన్నికల్లో విజయం కోసం మోదీపై ఆ పార్టీకి ఉన్న నమ్మకానికి నిదర్శనం. ప్రచారంలో ప్రతిచోటా ప్రవచిస్తున్న ‘వికసిత భారత్‌’ స్వప్నానికి అనుసంధాయకంగా అభివృద్ధి, ప్రాథమిక వసతి కల్పన, సంక్షేమం, విద్య, పారిశ్రామిక రంగం, అంకుర వ్యవస్థ, ఉత్పాదక రంగం, రైల్వే  వగైరాలకు సంబంధించి ‘మోదీ గ్యారెంటీ’లను ఈ మేనిఫెస్టోలో జొప్పించడం విశేషం. 

వరుసగా మూడోసారి సైతం తమ పార్టీకి అధికార పగ్గాలు దక్కడం ఖాయమన్న ఆత్మవిశ్వాసంతోనో ఏమో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను కొనసాగిస్తే చాలనే భావన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కనిపించింది. గడచిన కేంద్ర బడ్జెట్‌లో ఎన్నికల ముందస్తు వరాలు కురిపించకుండా ఆర్థికంగా పొదుపు మంత్రాన్ని పఠిస్తూ, పాత విధానాల కొనసాగింపునే కమలనాథులు ఆశ్రయించారు. ఇప్పుడీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలోనూ అదే ధోరణిని అనుసరించారు.

ప్రజల నుంచి వచ్చిన దాదాపు 15 లక్షల దాకా సూచనలను పరిగణనలోకి తీసుకొని, ‘వికసిత భారత్‌’ స్వప్నానికి అనుగుణంగా ఈ మేనిఫెస్టోను రూపొందించామని బీజేపీ చెబుతోంది. మళ్ళీ అధికారంలోకి వచ్చే జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)కి దిశానిర్దేశంగా ఈ ‘సంకల్ప పత్రం’ పనిచేస్తుందని కమలనాథుల ఉవాచ. వచ్చే 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా, విశ్వశక్తిగా మారుస్తామనేది వారు చూపిస్తున్న సుందర స్వప్నం. 

మోదీ ఆదివారం విడుదల చేసిన ఈ ‘సంకల్ప పత్రం’ ఇప్పటికే సర్కారు అమలు చేస్తున్న ఉచిత రేషన్‌ పథకం, సురక్షిత మంచినీటి సరఫరా, గృహనిర్మాణం లాంటి దారిద్య్ర నిర్మూలన పథకాలను ఏకరవు పెట్టింది. గత పదేళ్ళలో 25 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటపడేశామనీ, సామాజిక న్యాయానికి కట్టుబడి ఇతర వెనుకబడిన వర్గాలు, గిరిజనులు, దళితులకు ప్రభుత్వంలో భాగం కల్పించామని చెప్పుకుంది. అదే సమయంలో ఈ ‘సంకల్పం’లో కొన్ని వివాదాలూ ఉన్నాయి. ఈసారి ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్య రామాలయ ప్రారంభం చేసి చూపిన బీజేపీ మూడోసారి గద్దెనె క్కితే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తేవాలని చూస్తోంది.

అయితే, తెలివిగా యూసీసీ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’, సార్వత్రిక ఎన్నికల జాబితా తదితర విస్తృత చర్చనీయాంశాలను తన సైద్ధాంతిక ఎంపికలుగా కాక, సుపరిపాలనకు తప్పనిసరి అన్నట్టు చిత్రిస్తూ మేనిఫెస్టోలో పెట్టింది. అదే సమయంలో 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న వివాదాస్పద ‘పౌరుల జాతీయ చిట్టా’ అంశాన్ని ఈసారి ప్రస్తావించలేదు. వ్యవసాయ చట్టాలపై ఎదురుదెబ్బ తగిలేసరికి, ఈ తడవ వాటి ఊసెత్తకుండా జాగ్రత్తపడింది. రైతులకు గట్టి హామీలివ్వకుండా దాటేసింది. 

ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌ల ఎన్నికల వాగ్దానపత్రాలను విశ్లేషకులు సహజంగానే పోల్చి చూస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టో విధానాల కొనసాగింపు ధోరణిలో సాగితే, కాంగ్రెస్‌ మేని ఫెస్టో ప్రజాకర్షక బాటన నడిచింది. ముందుగా ప్రకటించిన కాంగ్రెస్‌ది ‘న్యాయ్‌ (గ్యారెంటీల) పత్రం’ అయితే, ఆనక వచ్చిన బీజేపీది ‘సంకల్ప పత్రం’. యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్‌ న్యాయ్, శ్రామిక్‌ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్‌లు అయిదు ప్రధానాంశాలుగా, 25 గ్యారెంటీలతో కాంగ్రెస్‌ ముందుకొచ్చింది.

మహిళలు, యువతరం, అణగారిన వర్గాలు, రైతులు... ఈ నాలుగు వర్గాలూ దేశాభివృద్ధికి నాలుగు స్తంభాలని బీజేపీ సంకల్పం చెప్పుకుంది. కనీస మద్దతు ధరకు ‘చట్టపరమైన గ్యారెంటీ’ ఇస్తామని కాంగ్రెస్‌ పేర్కొంటే, బీజేపీ మాత్రం పంటలకు కనీస మద్దతు ధరల్ని ‘ఎప్పటికప్పుడు’ పెంచుతామన్నదే తప్ప, చట్టంగా భరోసా ఇవ్వలేదు. కులగణనకు కాంగ్రెస్‌ కట్టుబడితే, అలాంటి డిమాండ్లపై బీజేపీ తన అభిప్రాయం పంచుకోనే లేదు. 

రెండు మేనిఫెస్టోల్లో కొన్ని మంచి విషయాలూ లేకపోలేదు. రాగల అయిదేళ్ళలో వ్యవసాయ పరిశోధనలకు రెట్టింపు నిధులిస్తామన్నది కాంగ్రెస్‌ వాగ్దానం. ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన కింద త్వరితగతిన చెల్లింపులు జరుపుతామనీ, పంట నష్టాన్ని మరింత కచ్చితంగా అంచనా వేసేలా సాంకేతికతను వినియోగిస్తామనీ బీజేపీ హామీ ఇస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ రెండు పార్టీలూ వ్యవసాయ రంగానికి సరైన దిశానిర్దేశంలో విఫలమయ్యాయి. నీరు, ఎరువులు, ఇంధనాలను తక్కువగా వినియోగిస్తూనే ఎక్కువ దిగుబడి లాంటి వాటిపై అవి దృష్టిపెట్టలేదు.

ఇక, సాంస్కృతిక జాతీయవాదంతో తమిళుల్ని ఆకర్షించేలా ‘తిరువళ్ళువర్‌ సాంస్కృతిక కేంద్రాల’ ఏర్పాటు, సామా న్యుల సాధారణ రైలు ప్రయాణ కష్టాల్ని పక్కనబెట్టి ఖరీదైన ‘వందేభారత్‌ రైళ్ళ’ విస్తరణ లాంటివి బీజేపీ అనవసర ప్రాధాన్యాలే. దేశంలో ప్రస్తుత ప్రధాన సమస్యలు నిరుద్యోగం, ధరల పెరుగుదల అని సర్వేలన్నీ తేల్చినందున ఏ పార్టీ అయినా వాటిపై దృష్టి పెట్టడం ప్రయోజనం. ఆ మాటకొస్తే ఓటర్లను ఆకర్షించడమే కీలకమైన ఎన్నికల్లో, మేనిఫెస్టోలను తప్పనిసరిగా అమలు చేసి తీరాలన్న చట్టం లేని భారత్‌లో... ‘సంకల్పం’ శుష్కవచనమైతే నిష్ప్రయోజనం. 

Advertisement
 
Advertisement