కోళ్ల చోరీకి వచ్చాడని
అనాథలమయ్యాం
నా భర్త బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. దొంగతనాలతో తనకు సంబంధం లేదు. బైక్ మరమ్మతులు చేసేందుకని చెప్పి గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. శుక్రవారం ఉదయం కొందరు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడారు. దొంగతనానికి వచ్చారని, దొరికారని, మిగిలిన వారి వివరాలు చెప్పాలని అడిగారు. తమకు ఎవరి వివరాలూ తెలియవని చెప్పినా వినిపించుకోలేదు. ఆటవికంగా, చాలా దారుణంగా నా భర్తపై దాడి చేసి చంపేశారు. ఇప్పుడు నా పిల్లలు, నేను ఇంటి పెద్దను కోల్పోయి అనాథలమైపోయాం. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలి.
– అఖిల, మృతుడు నరేష్ భార్య
ఫ మధురపూడిలో ఆటవిక న్యాయం
ఫ ఎరుకుల యువకుడి ప్రాణం తీసిన కర్కశులు
ఫ కోళ్ల దొంగతనం చేశాడని
విచక్షణారహితంగా దాడి
ఫ గురువారం రాత్రంతా చలిలోనే
ఆరు బయట నిర్బంధం
ఫ షెడ్డు యజమాని బులుసు సురేంద్ర చౌదరి సమక్షంలో మరుసటి రోజూ దాడి
ఫ భర్తను వదిలేయాలంటూ భార్య ఫోన్లో వేడుకున్నా కరగని మనసులు
ఫ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయిన నిందితుడు నరేష్
సాక్షి, రాజమహేంద్రవరం/కోరుకొండ: మానవత్వం మరిచిపోయిన కర్కశులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆటవిక న్యాయం అమలు చేశారు. దొంగతనం చేశాడన్న అనుమానంతో ఓ యువకుడిని పట్టుకుని దుస్తులు తొలగించి, చేతులు వెనక్కు కట్టేసి, విచక్షణారహితంగా కొట్టి.. రాత్రంతా చలిలో ఆరు బయట నిర్బంధించి, తెల్లవారిన తర్వాత కూడా దాడి కొనసాగించడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కోరుకొండ మండలం మధురపూడి విమానాశ్రయం గోడను ఆనుకుని నిర్వహిస్తున్న పందెం కోళ్ల షెడ్డు వద్ద జరిగింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లె గ్రామానికి చెందిన తిమ్మసత్తి నరేష్ (36) బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య అఖిల, ఇద్దరు పిల్లలతో సాగుతున్న అతని జీవితం ఒక్కసారిగా విషాదాంతమైంది. స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లిన నరేష్ తిరిగి ఇంటికి ప్రాణాలతో చేరుకోలేకపోయాడు.
దుస్తులు తొలగించి... చేతులు వెనక్కు కట్టేసి...
నరేష్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం నలుగురూ కలిసి ఓ కారులో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత, సుమారు ఒంటిగంట సమయంలో మధురపూడి విమానాశ్రయం సమీపంలోని బులుసు సురేంద్రచౌదరికి చెందిన కొబ్బరితోటకు వెళ్లారు. అక్కడ పెంచుతున్న నాలుగు పందెం కోళ్లను తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన కోళ్ల షెడ్డు వద్ద పనిచేసే వారు వెంబడించారు. ఆ సమయంలో ముగ్గురు తప్పించుకోగా నరేష్ మాత్రం వారికి చిక్కాడు. పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సిందిపోయి వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. వారికి సమీపంలోని దాబాలో పనిచేస్తున్న వారు జతకలవడంతో సుమారు ఆరుగురు కలిసి రాజమహేంద్రవరం–రంపచోడవరం ప్రధాన రహదారిపై మధురపూడి విమానాశ్రయం సమీపంలోని దాబా ఎదురుగా తీవ్రంగా కొట్టారు. దుస్తులు తొలగించి కేవలం లోదుస్తులతో ఉంచి, చేతులు వెనక్కు కట్టేసి చాలా సేపు దాడి చేశారు.
రాత్రంతా చలిలోనే.. ఆరు బయట నిర్బంధం
దాడితో తీవ్రంగా గాయపడిన నరేష్‌ను రోడ్డు నుంచి కొబ్బరితోట లోని కోళ్ల షెడ్డు వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడ గేదెలను కట్టే కొట్టం సమీపంలో రాత్రంతా ఆరుబయటే చలిలో ఉంచినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. శరీరంపై సరైన దుస్తులు లేకుండా, గాయాలతో బాధపడుతున్న యువకుడిని చలిలోనే అమానుషంగా వదిలేశారు. శుక్రవారం తెల్లవారుజామున కోళ్ల షెడ్డు యజమాని బులుసు సురేంద్ర చౌదరి అక్కడికి చేరుకుని నరేష్ ను ప్రశ్నించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నరేష్‌తో వచ్చిన మిగిలిన ముగ్గురి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినట్లు పే ర్కొంటున్నారు. ఈ క్రమంలో నరేష్ కుటుంబ స భ్యుల ఫోన్‌నంబర్లు తీసుకుని వారితో సురేంద్ర చౌదరి మాట్లాడారు. మిగిలిన ముగ్గురిని తీసుకొచ్చి అప్పగిస్తేనే నరేష్‌ను విడిచిపెడతామని, లేకుంటే చంపేస్తామని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న భార్య అఖిల తీవ్ర ఆందోళనకు గురైంది. తన భర్తతో వచ్చిన వారు ఎవరో తనకు తెలియదని, దయచేసి ఆయనను విడిచిపెట్టాలని ప్రాధేయపడింది. తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని, భర్తకు ఏమైనా జరిగితే వారి పరిస్థితి ఏమిటని ఆమె వేడుకున్నా సురేంద్ర చౌదరి, అతని మనుషులు కనికరం చూపించలేదు.
పోలీసుల అదుపులో ఎనిమిది మంది!
ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మంది అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. వారిపై హత్య కేసు నమోదు చేశారు. వారందరనీ అధికారికంగా ఆదివారం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోళ్ల షెడ్డు యజమాని బులుసు సురేంద్ర చౌదరితోపాటు ఆ షెడ్డలో పనిచేసే వారు, సమీపంలోని దాబాలో పనిచేసే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆదివారం ఉదయం నరేష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే అవకాశముంది. పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అంశాలు ఈ కేసులో కీలకం కానున్నాయి.
నా బిడ్డను చంపేశారు
నా కుమారుడు నరేష్‌ను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఫోన్లో ఎంత వేడుకున్నా కనికరించలేదు. మా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయి మేమంతా అనాథలమయ్యాం. తన ఇద్దరి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఎవరిస్తారు. పట్టుకుని పోలీసులకు అప్పగించాల్సిన వారు ఆటవికంగా దాడి చేసి చంపేశారు. నిందితులను కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలి. – మృతుడి తల్లి
దాడితో ప్రాణాలు కోల్పోయి...
గురువారం అర్ధరాత్రి మొదలైన నరేష్‌పై దాడి శుక్రవారం కూడా కొనసాగినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కోళ్ల షెడ్డు యజమాని బులుసు సురేంద్ర చౌదరి సమక్షంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ మరోసారి నరేష్‌పై విచక్షణారహితంగా దాడి జరిగినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కర్రలు, రాడ్డులతో ఎవరికి నచ్చినట్లు వారు దాడి చేశారని అదే గ్రామానికి చెందిన వారు కొందరు చెబుతున్నారు. ఈ దాడిలో మెడ వెనుక భాగంతో పాటు పొత్తికడుపు, ఇతర సున్నిత ప్రాంతాల్లో తీవ్ర గాయాలవడంతో శుక్రవారం సాయంత్రం సుమారు ఐదు గంటల సమయంలో నరేష్ ప్రాణాలు కోల్పోయాడు. గురువారం రాత్రి పట్టుబడిన వ్యక్తిని శుక్రవారం ఉదయమైనా పోలీసులకు అప్పగించకుండా దాడి కొనసాగించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కోళ్ల షెడ్డు యజమాని బులుసు సురేంద్ర చౌదరి అధికార పార్టీ నాయకుడని, అందువల్లే అంతలా బరితెగించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆటవిక న్యాయం అమలు చేశారని స్థానికులు చెబుతున్నారు.
చలిలోనే బంధువుల నిరీక్షణ
నరేష్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, నార్త్ జోన్ డీఎస్పీ జీవన శుక్రవారం రాత్రి సుమారు ఎనిమిది గంటలకు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నరేష్ బంధువులు శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం నిర్వహించవద్దని కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో శనివారం పోస్టుమార్టం జరగలేదు. అనంతరం కోరుకొండ పోలీస్‌స్టేషనన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన డీఎస్పీ జీవన మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే కేసు నమోదు చేసినా నరేష్ కుటుంబ సభ్యుల ఆవేదన మాత్రం తీరలేదు. శనివారం రాత్రి భార్య అఖిల, తొమ్మిదేళ్ల కుమార్తె, నరేష్ తల్లిదండ్రులు, ఇతర బంధువులు, ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు చలిలోనే నిరీక్షించారు. తమకు పూర్తి స్థాయాలో న్యాయం జరగాలని, నిందితులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల కన్నీళ్లు, చిన్నారుల పరిస్థితి అక్కడి వారిని కదిలించాయి.


