విషాద ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

విషాద ప్రయాణం

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

● అదుపు తప్పి కారును ఢీకొన్న మరో కారు

● మహిళ మృతి, పలువురికి గాయాలు

● జెడ్‌.రాగంపేటలో ఘటన

గండేపల్లి: జాతీయ రహదారిపై ఒక కారు అదుపు తప్పి మరో కారును ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. గండేపల్లి మండలం జెడ్‌.రాగంపేట వద్ద శనివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి మండలం జగ్గయ్యపేట తాలూకా భీమవరానికి చెందిన చెందిన 14 మంది మహిళలు పంచారామ క్షేత్రాల సందర్శన కోసం రెండు కార్లలో గురువారం సాయంత్రం బయలుదేరారు. చివరిగా పిఠాపురంలో దర్శనం అనంతరం శుక్రవారం రాత్రికి అన్నవరం చేరుకుని అక్కడే బస చేశారు. శనివారం ఉదయం అన్నవరంలో సత్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి వాడపల్లి, ద్వారకాతిరుమలకు బయలుదేరారు. గండేపల్లి మండలం జెడ్‌.రాగంపేట వద్ద గల ఆదిత్య హాస్పిటల్‌ వద్దకు వచ్చేసరికి హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళుతున్న మరో కారు అదుపు తప్పి వీరి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జ కావడంతో వాటిలో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శ్రీకాకుళం వెళు తున్న కారులోని వడ్డి సరస్వతి తలకు తీవ్ర గాయమై కారులోనే మృతి చెందారు. కారు నడుపుతున్న ఆమె అల్లుడు పొట్టునూరి ప్రదీప్‌ కుమార్‌ స్వల్ప గాయాలతో బయటపడగా, భార్య దినీషా తలకు, పెద్ద కొడుకు వడ్డి రోహన్‌ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రెండో కుమారుడు విహాన్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వడ్డి సరస్వతి సొంతూరు శ్రీకాకుళం. అల్లుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అల్లుడు, కూతురు, మనవళ్లతో కలిసి సొంతూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈమె పెద్ద కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. భీమవరానికి చెందిన కారులోని ఇందూరి పార్వతి, మాసినేని లక్ష్మి, నర్ల కృష్ణ కుమారి, చింతకుంట్ల దేవి, పెనుగొండ భూలక్ష్మి, నాగమణి, ఇందూరి రుక్మిణి, కారు డ్రైవర్‌ జయకృష్ణ తీవ్ర గాయాలపాలయ్యారు.

స్పందించిన స్థానికులు

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు, హైవే మెయింటినెన్స్‌ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పోలీస్‌ జీప్‌, 108, హైవే అంబులెన్స్‌ల్లో సమీపంలోని సీహెచ్‌సీకి తరలించారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. బాధితుల్లో ఇందూరి పార్వతి, పెనుగొండ భూలక్ష్మి అపస్మారక స్థితిలో ఉన్నారని, మాసినేని లక్ష్మికి నడుముకు గాయమైనట్టు తెలిసింది. కాగా.. అన్నవరం నుంచి వస్తున్న కారు వెనకే కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన ఇనకోటి శశికుమార్‌ (అయ్యప్ప దీక్షాధారుడు) మోటారు సైకిల్‌పై వస్తున్నాడు. ప్రమాదం జరిగిన కారును అతడు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానిక సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బంధువులు రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు.

కారణమిదేనా!

ప్రమాద స్థలంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తే హైదరాబాద్‌ నుంచి శ్రీకాకుళం వెళుతున్న కారుకు ఒక మోటార్‌ సైకిలిస్టు అడ్డువచ్చినట్టు తెలుస్తోంది. అతడు స్థానిక డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ దారిలో రాంగ్‌ రూట్‌లో వచ్చి, రోడ్డు దాటే ప్రయత్నంలో కొంత దూరం వెళ్లి ఆగిపోయాడు. అతడిని తప్పించే క్రమంలో హైదరాబాద్‌ నుంచి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి భీమవరానికి చెందిన కారు ఢీకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement