సీటీఆర్‌ఐ: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరిగా పొందాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రసారమయ్యే వార్తా కథనాలు, రాజకీయ ప్రకటనలను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీకి తాను చైర్మన్‌గా, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కె.లక్ష్మీనారాయణ సభ్యులుగా వ్యవహరిస్తామన్నారు. గుర్తింపు పొందిన, రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం వినియోగించే ధ్రువీకరణ అవసరమైన రాజకీయ ప్రకటనలకు సంబంధిత ఎంసీఎంసీ కమిటీ నుంచి ముందస్తు అనుమతి పొందాలన్నారు. టెలివిజన్ చానళ్లు, కేబుల్ నెట్‌వర్క్‌లు, రేడియో, సినిమా థియేటర్లు, ఆడియో–విజువల్ ప్రజా ప్రదర్శన వేదికలు, ఈ – పేపర్లు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు, వాయిస్ సందేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రసారం, ప్రచురణ చేయనున్న రాజకీయ ప్రకటనలకు వర్తించే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముందస్తు ధ్రువీకరణ పొందాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ ఈ నెల 26న, ఓట్ల లెక్కింపు నవంబర్ 30న నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా సంస్థలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
మొదటి విడత సర్పంచ్ బరిలో 148 మంది
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఐదు మండలాల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ఉపసంహరణ శనివారం ముగిసింది. అనంతరం సర్పంచ్, వార్డు మెంబర్ల తుది జాబితా గుర్తులతో ప్రకటించడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి తెలిపారు. ఆరు మండలాల్లో 45 వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్ ఏకగ్రీవంగా కాగా, సర్పంచ్ బరిలో 148 మంది, వార్డు మెంబర్ల బరిలో 1258 మంది ఉన్నారన్నారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారన్నారు.
ప్రత్యేక లోక్ అదాలత్‌లో 18 కేసుల రాజీ
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఎన్‌ఐ యాక్ట్ కేసులను మాత్రమే దీనిలో పరిష్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపాల్ జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యార్లగడ్డ శ్రీలక్ష్మి ఆ వివరాలను తెలిపారు. ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 30 బెంచ్‌లలో నిర్వహించారు. వీటి ద్వారా 753 కేసులు పరిష్కారానికి రాగా అందులో అందులో 18 కేసులు రాజీ అయ్యాయి. ఈ కేసుల ద్వారా బాధితులకు రూ.40,33,948 నష్టపరిహారం అందజేశారు.
‘నన్నయ’ వర్సిటీకి 485వ ర్యాంక్
రాజానగరం: దక్షిణ ఆసియాలో క్యూ ఎస్ వరల్డ్ యూనివర్సిటీ ఇచ్చిన ర్యాకింగ్స్‌లో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి 485వ స్థానం దక్కడం హర్షణీయమని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అన్నారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ విద్యా బోధన, పరిశోధన, ఆవిష్కరణలు, అంతర్జాతీయ గుర్తింపు మున్నగు పలు అంశాలకు క్యూఎస్ ర్యాకింగ్స్‌లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ‘నన్నయ’ వర్సిటీకి ఈ గుర్తింపు లభించడంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు.


