ఆమె విజయానికి ఆయన! | - | Sakshi
Sakshi News home page

ఆమె విజయానికి ఆయన!

Oct 25 2026 12:23 AM | Updated on Oct 25 2026 12:23 AM

సాక్షి, రాజమహేంద్రవరం: ఇన్నాళ్లూ జనంలో తిరిగారు.. ప్రజల పక్షాన వారి సమస్యలపై పోరాడారు.. ఎన్నికల బరిలో గెలిచి పదవులు చేపట్టాలని ఆశపడ్డారు. ఆ రోజు వచ్చే సరికి రిజర్వేషన్లు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. సమీకరణాలు మారిపోయాయి. తన స్థానాన్ని దక్కించుకోవడానికి వారి ఇల్లాళ్లను బరిలోకి దింపారు. వారి గెలుపే లక్ష్యంగా వ్యూహ రచనలు చేస్తున్నారు. నామినేషన్లు మొదలుకుని ప్రచారాలు, ఓటర్లను కలవడం, స్థానిక సమీకరణాలను చక్కదిద్దడం వరకు తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. ఆమె గెలుపే లక్ష్యంగా ఆయన చేస్తున్న రాజకీయం చర్చనీయాంశమవుతోంది.

రిజర్వేషన్లు మార్చిన లెక్కలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు నాయకుల రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, గ్రామ పంచాయతీల్లో కొద్ది రోజుల క్రితం వివిధ కేటగిరీలకు స్థానాలు కేటాయించడంతో చాలా మంది ఆశావహులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా వారు తమ కుటుంబ సభ్యులను, ప్రధమ ప్రాధాన్యంగా వారి జీవిత భాగస్వామిని రంగంలోకి దించుతున్నారు. వారి విజయమే లక్ష్యంగా మంత్రాంగం నెరపుతున్నారు. టికెట్‌ సాధించడం దగ్గర నుంచి ప్రత్యర్థుల బలాబలాలు, అంచనాలలో వారు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా వారి పరిచయాలు, పలుకుబడి, కార్యకర్తల బలాబలాలు అభ్యర్థి విజయానికి ఉపయోగపడేలా అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

మున్సిపల్‌ పీఠాలపై మహిళల గురి

పట్టణ స్థానిక సంస్థల్లోనూ మహిళలకు పెద్దఎత్తున ప్రాతినిధ్యం దక్కుతోంది. నిడదవోలు, కొవ్వూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవులను మహిళలకు కేటాయించడంతో ఆ పీఠాలు దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 96 వార్డుల్లో 48 మహిళలకు కేటాయించారు. వారంతా ఇప్పటికే నామినేషన్లు వేసి ప్రచారాలు చేస్తున్నారు. వారి గెలుపునకు కుటుంబ సభ్యులు సైతం వెన్నంటి చేదోడు వాదోడుగా వారితో పాటే ప్రచారాల్లో పాల్గొంటున్నారు.

గ్రామాల్లో సైతం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా ఉంది. జిల్లాలోని 412 ఎంపీటీసీ స్థానాల్లో 203, 332 గ్రామ పంచాయతీల్లో 166 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఇక 3,872 పంచాయతీ వార్డుల్లో 1,937 వార్డుల్లో మహిళలే రాణులు కానున్నారు. అంటే గ్రామీణ స్థానిక సంస్థల్లోనూ మహిళలకు విస్తృతంగా పోటీ చేసే అవకాశం లభిస్తోంది. ఈ రిజర్వేషన్ల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి కొత్త రూపు సంతరించుకుంటోంది.

రిజర్వేషన్లతో సేవ చేసే అవకాశం

మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా స్థానిక పాలనలో వారి ప్రాతినిధ్యాన్ని పెంచే అవకాశం ఏర్పడుతోంది. కొన్ని చోట్ల మహిళా అభ్యర్థుల వెనుక వారి భర్తలే ప్రధాన వ్యూహకర్తలుగా వ్యవహరిస్తుండటం చర్చకు దారితీస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన నాయకులు తమ రాజకీయ ప్రాబల్యాన్ని కొనసాగించేందుకు భార్యలను ముందుకు తీసుకొస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి మహిళా అభ్యర్థి వెనుక భర్తలే నడిపిస్తున్నారనే అభిప్రాయం సరైంది కాదు. పలువురు మహిళలు స్వతంత్రంగా రాజకీయాల్లోకి వస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రిజర్వేషన్ల ద్వారా లభించిన అవకాశాన్ని ప్రజాసేవకు, స్థానిక సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఈసారి స్థానిక ఎన్నికల్లో అనేక చోట్ల పోటీ చేస్తున్నది మహిళలే అయినా.. వారి విజయాల కోసం తెరవెనుక వ్యూహాలు రచిస్తున్న నాయకుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అందుకే ప్రస్తుతం పలువురు నేతల తపనంతా తమ కోసం కాదు.. తమ భార్యల గెలుపు కోసమే! అన్నట్లుంది జిల్లాలోని పరిస్థితి.

పరిషత్‌లోనూ నారీమణులకే పెద్ద పీట

జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లోనూ మహిళలకు గణనీయమైన ప్రాతినిధ్యం దక్కుతోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్‌కు ఇవే తొలి ఎన్నికలు. ఈ క్రమంలో జిల్లాలోని 21 జెడ్పీటీసీ స్థానాల్లో 11, 21 ఎంపీపీ పదవుల్లో 11 మహిళలకు కేటాయించారు. దీంతో ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు మహిళా నేతలు, రాజకీయ కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు వేసేశారు. తాము పోటీ చేయలేని పరిస్థితుల్లో తమ భార్యలకు అవకాశాలు కల్పించేందుకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు. గతంలో తమ వెంట తిరిగిన కార్యకర్తలను ఇప్పుడు భార్యల ప్రచారానికి సమాయత్తం చేస్తున్నారు. గ్రామస్థాయి నాయకులతో సంప్రదింపులు జరుపుతూ మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమవుతున్నారు. పరిషత్‌ ఎన్నికల్లో గెలుపు సాధిస్తే స్థానికంగా తమ రాజకీయ పట్టును నిలుపుకోవచ్చుననే అంచనాతో అడుగులు వేస్తున్నారు.

నాయకుల పోటీకి రిజర్వేషన్ల గండి

వారి స్థానంలో బరిలోకి జీవిత భాగస్వామి

మహిళల కోటాలో నిడదవోలు,

కొవ్వూరు మున్సిపల్‌ పీఠాలు

మూడు మున్సిపాలిటీల్లోని

96 వార్డుల్లో 48 వారికే..

11 జెడ్పీటీసీలు, 11 ఎంపీపీలు

నారీమణులకే..

ఎంపీటీసీల్లో 203...

పంచాయతీల్లో 166 సైతం

3,872 పంచాయతీ వార్డుల్లో

1,937 అతివలకే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement