బుచ్చెంపేటలో వేలం రాజకీయం | - | Sakshi
Sakshi News home page

బుచ్చెంపేటలో వేలం రాజకీయం

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల మద్దతుతో గెలవాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, అధికార బలం, ప్రలోభాలు, బెదిరింపులు అస్త్రాలుగా వాడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని కోరుకొండ మండలం బుచెంపేట ఎంపీటీసీ స్థానం కేంద్రంగా సాగుతున్న పరిణామాలు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. గ్రామాభివృద్ధి పేరుతో ఎంపీటీసీ స్థానాన్ని వేలం ద్వారా దక్కించుకునేందుకు రూ.16.8 లక్షలకు ఒప్పందం కుదిరిందన్న విమర్శలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి శుక్రవారం రాత్రి గ్రామానికి చేరుకుని అర్ధరాత్రి వరకూ అక్కడే మకాం వేయడం.. భారీగా పోలీసు బలగాలను మోహరింపుతో వివాదం మరింత ముదిరింది. కూటమిలోని కీలక నేతలు అర్ధరాత్రి వరకు గ్రామంలో ఉండాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలకు సమాధానాల్లేవు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థిపై గెలవలేక...

రాజానగరం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో పరిషత్‌ ఎన్నికల కోసం వైఎస్సార్‌ సీపీ తరఫున బలమైన అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. ఇందులో భాగంగా బుచ్చెంపేటలో అనపర్తి మణికంఠతో నామినేషన్‌ వేయించారు. ఎన్నికల ద్వారా ఈ స్థానాన్ని గెలవలేమనుకున్న కూటమి నేతలు వక్ర మార్గంలో వ్యూహాలు రచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి ఇన్‌చార్జిగా ఉన్న నియోజకవర్గంలో రాజకీయంగా పరువు నిలబెట్టుకోవడం అధికార పక్షానికి ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలోనే కోరుకొండ మండలం బుచ్చెంపేట ఎంపీటీసీ స్థానంపై కూటమి నేతలు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌కు, వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి బలమైన మద్దతు ఉన్న ఈ గ్రామంలో పట్టు సాధించేందుకు వేలంపాట ద్వారా స్థానం సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు.

రూ.16.8 లక్షలకు ఒప్పందం

బుచ్చెంపేట స్థానానికి వైఎస్సార్‌ సీపీ తరఫున అనపర్తి మణికంఠతో పాటు అడబాల సీతారామకృష్ణ, జాలెం దీపుబాబు, జనసేన నుంచి బేటి వెంకటేశ్వరరావు, దిడ్డి వెంకట అప్పారావు, అడబాల వీరవెంకట సత్యనారాయణ, టీడీపీ నుంచి దిడ్డి మాధవరావు నామినేషన్లు వేశారు. ఈ నేపథ్యంలో రూ.16.8 లక్షలకు జనసేన అభ్యర్థి బేలే వెంకటేశ్వరరావుకు ఆ స్థానాన్ని కట్టబెట్టేందుకు ఒప్పందం కుదిర్చారు. ఆ నగదు కూటమిలోని కీలక నేతలే చెల్లిస్తామని చెప్పి కుతంత్రానికి పాల్పడ్డారన్న విమర్శలున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎంపీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలకు మించి ఖర్చు చేయడానికి లేదు. అలాంటిది అంత పెద్ద మొత్తంలో చెల్లించేందుకు జనసేన అభ్యర్థి సిద్ధమయ్యారంటే అతని అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం తక్షణమే రద్దు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా

బుచ్చెంపేట ఎంపీటీసీ స్థానం చేజారిపోతుందనే ఆందోళనతోనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అర్ధరాత్రి ఆ గ్రామానికి చేరుకున్నారని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. వేలం పాటతో సంబంధం లేకపోతే ఆ సమయం వరకు ఆ గ్రామంలో ఎందుకు ఉన్నారని, పోలీసు బలగాలను అంత భారీగా ఎందుకు మోహరించారని ప్రశ్నలు వస్తున్నాయి. పోలీసుల మోహరింపుతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.

రాజకీయ కక్ష సాధింపునకు అక్రమంగా కేసు

బుచ్చెంపేటలో వివాదం సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఘటనతో సంబంధం లేని వ్యక్తులతో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఫిర్యాదు చేయించారని, ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారని మండిపడుతున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బుచ్చెంపేటలో వైఎస్సార్‌ సీపీకి 352 ఓట్ల మెజారిటీ వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అప్పటి ప్రజా తీర్పు నేపథ్యంలోనే గ్రామంపై కూటమి నేతలు ప్రత్యేక దృష్టి సారించారని వారు వాదిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా ఉంటే వేలం వంటి వక్ర మార్గాలపై ఆధారపడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బుచ్చెంపేట ఎంపీటీసీ స్థానం చుట్టూ మొదలైన ఈ వివాదం రాజానగరం నియోజకవర్గ రాజకీయాల్లో వేడి పెంచుతోంది. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజాభిమానం తప్ప, డబ్బు లేదా అధికారం అండ కాదన్న అభిప్రాయం ఈ పరిణామాలతో మరోసారి చర్చకు వస్తోంది.

రూ.16.8 లక్షలకు

ఎంపీటీసీ స్థానానికి బేరం

కుతంత్రానికి తెరతీసిన కూటమి నేతలు

బుచ్చెంపేటలో ఎమ్మెల్యే బత్తుల,

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు మకాం

పోలీసుల ద్వారా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఒత్తిడికి యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement