మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై కేసు | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై కేసు

Oct 25 2026 12:17 AM | Updated on Oct 25 2026 12:17 AM

బుచ్చెంపేటలో వైస్సార్‌సీపీ అభ్యర్థి మణికంఠతో

మాట్లాడడంపై కోడ్‌ ఉల్లంఘన పేరుతో నమోదు

కోరుకొండ: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మండలం బుచ్చెంపేట గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అనపర్తి మణికంఠ.. తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నందుకు సిద్ధమవడంపైనా, పార్టీ నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంపైనా శుక్రవారం సదరు అభ్యర్థిని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. గ్రామంలో ఎంపీటీసీ పదవికి గ్రామస్తులు వేలం పాట నిర్వహించగా, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మణికంఠ, కూటమి, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ క్రమంలో కూటమి అభ్యర్థి బేలు వెంకటేశ్వరరావు రూ.16.8 లక్షలకు పాడుకోవడంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మణికంఠ నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న రాజా ఆయన్ని కలసి ప్రశ్నించారు. దీనిపై కూటమి నాయకులు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ అభియోగం చేశారు. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజమహేంద్రవరం నార్త్‌ జోన్‌ డీఎస్పీ సీహెచ్‌ జీవన పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతో జక్కంపూడి రాజాపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. బుచ్చెంపేట వీఆర్వో రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ప్రెస్‌మీట్‌లో కోరుకొండ సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తి, ఎస్సై ఆర్‌.శివాజీ పాల్గొన్నారు.

రాజాను కలిసిన మణికంఠ

బుచ్చెంపేట వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి అనపర్తి మణికంఠ తన సోదరులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను కలిసి శుక్రవారం నాటి ఘటనపై చర్చించారు. ఆ స్థానానికి వేలంపాట తదనంతర పరిణామాలపై సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని వారు ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement