అనపర్తి: కరోనా కాలంలోనూ మాజీ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలను అందించి ప్రజలను కాపాడారు. కానీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్‌నినోను బూచిగా చూపి సంక్షేమ పథకాలను అటకెక్కించేస్తున్నారని, ఈ సాకుగా నిత్యావసరాల ధరలు పెంచి పబ్బం గడుపుకొంటున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల నేపథ్యంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలు, నేటి కూటమి ప్రభుత్వ పాలన మధ్య వ్యత్యాసాలను ప్రజలకు వివరించాలని అభ్యర్థులకు సూచించారు.
ఒత్తిళ్లకు ఎదురొడ్డిన అభ్యర్థులకు అభినందనలు
స్థానిక ఎన్నికల్లో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా వైఎస్సార్ సీపీ తరఫున అభ్యర్థులుగా నిలచిన ప్రతి ఒక్కరికీ సూర్యనారాయణరెడ్డి హృదయపూర్వక ధన్యవా దాలు తెలిపారు. అభ్యర్థులంతా ప్రచారంలో ముందుండడం అభినందనీయమని, ఆత్మ విశ్వాసంతో ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు.
పూట భోజనానికి డబ్బు సంచులు!
మూడేళ్ల క్రితం వరకు జేబులో డబ్బులు పెట్టుకుని సంచి నిండా నిత్యావసర సరుకులు తెచ్చుకున్న సామాన్యుడు ఈ కూటమి ప్రభుత్వంలో సంచి నిండా డబ్బులు పట్టుకెళ్లినా పూటకు సరిపడా సరకులు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. ధరలు సగానికి పైగా పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పార్టీ విధానాలు, గత ప్రభుత్వంలో అమలైన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలతో నేరుగా మాట్లాడి సమర్థం ప్రచారం నిర్వహించాలని పార్టీ అభ్యర్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
● వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే
సత్తి సూర్యనారాయణరెడ్డి పిలుపు
● గత ప్రభుత్వంలో సంక్షేమాన్ని.. ఈ ప్రభుత్వంలో సంక్షోభాన్ని ప్రజలకు చెప్పాలని హితవు


