● వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్,
పలువురిపై నాన్‌బెయిలబుల్ కేసులు
● టీడీపీ కార్యకర్తలా ఎస్సై వ్యవహార శైలి
ద్వారకాతిరుమల: స్థానిక సంస్థల ఎన్నికల వేళ పోలీసుల తీరుపై వివాదం చెలరేగింది. ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ నేతలపై ఎస్సై దురుసు వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే. ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ సందర్భంగా మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వాసు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. తిరుమలంపాలెంలో తమ పార్టీకి చెందిన రెండు నామినేషన్లు, జాజులకుంటలో మరో నామినేషన్ ఎందుకు తిరస్కరించారో తెలుసుకునేందుకు కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎస్సై టి.సుధీర్ టీడీపీ నేతల ఆదేశాలతో వైఎస్సార్ సీపీ నేతలను బయటకు పంపే క్రమంలో వాసు చేయి పట్టుకున్నారు. తన చేతిని గుంజుకునే క్రమంలో వాసు చొక్కా కొంత భాగం చినిగిపోయింది. అనంతరం పోలీసులు టీడీపీ నేతలను మాత్రం అక్కడ ఉంచి మిగిలినవారిని పంపేయడం చర్చనీయాంశమైంది.
మరోవైపు వాసుతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, మరికొందరు నేతలు తమ విధులకు ఆటంకం కలిగించి, దుర్భాషలాడారని కానిస్టేబుల్ సీహెచ్ భాస్కరరావుతో ఎస్సై ఫిర్యాదు చేయించి నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయించారు. దీంతో అధికారం చేతిలో ఉంది కదా అని రెచ్చిపోతే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని నాయకులు హెచ్చరించారు. కాగా ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ నేతలు లేకుండా చేసి తమకు అనుకూలంగా ఎన్నికలు జరిపించుకునేలా తమపై కేసు నమోదు చేయించారని వారు ఆరోపించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, టీడీపీ నేతల నేతృత్వంలో పోలీసులు పనిచేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
అభ్యంతరం చెప్పినా వినలేదు
పంగిడిగూడెం–1లో నామినేషన్ దాఖలు చేసిన పిల్లెల్లి వీరమ్మకు టి.నరసాపురం మండలం అల్లంచర్లలోనూ ఓటు ఉందని, అక్కడ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారని ఆర్‌వోకు తెలిపాను. పంగిడిగూడెంలో ఆమె దాఖలు చేసిన నామినేషన్ నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం తెలిపినప్పటికీ ఆమెను అర్హురాలిగా ప్రకటించారు. ఈ క్రమంలో తాము మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కూర్చున్నాము. ఎస్సై సుధీర్ వచ్చి ప్రతాపనేని వాసుని బయటకు నెట్టడాన్ని చూసి అడ్డువెళ్లాము. దాంతో మాపై తప్పుడు కేసుపెట్టారు. ఇదంతా పథకం ప్రకారమే జరిగింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
– బొండాడ వెంకన్నబాబు, వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు


