ఉసురు తీసిన వివాహేతర సంబంధం | - | Sakshi
Sakshi News home page

ఉసురు తీసిన వివాహేతర సంబంధం

Oct 8 2026 12:12 AM | Updated on Oct 8 2026 12:12 AM

● వీడిన మడికి హత్య కేసు మిస్టరీ

● స్నేహితుడే హంతకుడు

ఆలమూరు: మండలంలోని మడికిలో సంచలనం సృష్టించిన మింగి రమేష్‌ (24) హత్య కేసును పోలీసులు చేధించారు. ఆలమూరు పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌ విద్యాసాగర్‌, ఎస్సై జి.నరేష్‌ మాట్లాడుతూ రమేష్‌ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. చిలకలపాడుకు చెందిన రమేష్‌ నర్సరీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి స్నేహితుడైన మడికి శివారు ప్రాంతానికి చెందిన గంపా దుర్గాప్రసాద్‌ భార్య అనూషతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం దుర్గాప్రసాద్‌కు తెలిసిపోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో అనూష తన ఐదేళ్ల కుమార్తెతో కలిసి ఆరు నెలలుగా వేరేగా అద్దె ఇంటిలో నివసిస్తోంది. రమేష్‌ వల్లే తన కాపురం కూలిపోయిందని, స్నేహానికి నమ్మక ద్రోహం చేశాడని దుర్గాప్రసాద్‌ కక్ష పెంచుకున్నాడు, ఎలాగైనా రమేష్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

రాత్రి వేళ కాపు కాసి..

రమేష్‌ గత నెల 29వ తేదీ రాత్రి అనూష ఇంటికి వెళ్లాడు. ముందుగా తన స్కూటర్‌ను ఆమె నివసిస్తున్న ఇంటి వెనుక ఉన్న కార్తికేయ నర్సరీ వద్ద పార్క్‌ చేశాడు. ఈ విషయం గమనించిన దుర్గాప్రసాద్‌ నర్సరీలోనే ఉండి రమేష్‌ కోసం కాపు కాశాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో రమేష్‌ తిరిగి స్కూటీ వద్దకు చేరుకోవడంతో దుర్గాప్రసాద్‌ అతడితో గొడవకు దిగాడు. ఘర్షణ పెరగడంతో రమేష్‌ మెడలోని పూసల దండతో పీక నొక్కి, చాకుతో అతడి పొట్టలో పొడిచాడు. అనంతరం కింద పడేసి ముఖంపై పిడిగుద్దులు గుద్ది, ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

పోలీసుల గాలింపు

సెప్టెంబర్‌ 30న ఈ ఘటన జరగ్గా, అప్పట్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో విచారించి అక్టోబర్‌ 5న హత్య కేసుగా మార్పు చేశారు. నిందితుడి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు గ్రామంలోని ఒక నర్సరీ వద్ద సంచరిస్తున్న దుర్గాప్రసాద్‌ను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని ఆలమూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో బుధవారం హాజరుపర్చారు. ఈ ఘటనలో దుర్గాప్రసాద్‌ ఒక్కరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో నిందితుడి ఫోన్‌ డేటాను పరిశీలిస్తున్నామని ఎస్సై నరేష్‌ తెలిపారు. కాగా.. కేసును చేధించిన కొత్తపేట డీఎస్పీ ఎస్‌.మురళీ మోహన్‌, సీఐ విద్యాసాగర్‌, ఎస్సై జి.నరేష్‌, ఏఎస్సై డి.స్వామి, హెడ్‌ కానిస్టేబుల్‌ అమ్మిరాజులను ఎస్పీ రాహుల్‌ మీనా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement