వెన్నుపోటు పొడిచేసి.. | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు పొడిచేసి..

Sep 27 2026 12:10 AM | Updated on Sep 27 2026 12:10 AM

ఎన్నికల వేళ వరాల జల్లు

గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్‌ కో బీసీలపైనా వరాల జల్లు కురిపించారు. తీరా ఎన్నికలయ్యాక ఆ హామీల అమలునే మరిచిపోయారు. వాటిని పరిశీలిస్తే...

● బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛన్‌.

● బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం.

● బీసీ సబ్‌ ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయల ఖర్చు.

● స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్‌.

● చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ కోసం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం.

● తక్కువ జనాభా ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్‌ ద్వారా రాజకీయ భాగస్వామ్యం కల్పించడం.

● దామాషా ప్రకారం బీసీ కార్పొరేషన్లకు నిధులివ్వడంతో పాటు స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్ల ఖర్చు.

● రూ.5 వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరిస్తామని హామీ.

● గొర్రెల పెంపకం యూనిట్లకు రాయితీలివ్వడంతో పాటు వాటికి బీమా సౌకర్యం కల్పించడం.

● పవర్‌లూమ్‌లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్‌లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించడం.

● దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనమివ్వడంతో పాటు వారి షాపులకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ కల్పించడం.

ఓటు బ్యాంకు అన్నారు.. వెనక్కి నెట్టేశారు. బీసీలకు ప్రాధాన్యమన్నారు.. పక్కనబెట్టేశారు.. బూటకపు హామీలతో వెన్నుపోటు పొడిచారు. గత ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్‌ అంటూ హడావుడి చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా విస్మరించారు. ఈ నేపథ్యంలో నిలువునా దగాకు గురవుతున్న బీసీలు అంతా ఒక్కటయ్యారు.. వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీలు గర్జనకు సిద్ధమయ్యారు.. ఆదివారం జరిగే ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం రూరల్‌ కాతేరు గ్రామంలోని వెంకటాద్రి గార్డెన్స్‌ వేదిక కానుంది. వైఎస్సార్‌ సీపీ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల బీసీ నాయకులు హాజరుకానున్నారు.

సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు బీసీలకు వెన్నుపోటు పొడిచాడని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. ఒక్క బీసీ ఎమ్మెల్యేను కూడా ఉప ముఖ్యమంత్రిని చేసి తమ పక్కన కూర్చోబెట్టుకునేందుకు ఇష్టపడడం లేదని, బలహీన వర్గాల విషయంలో చంద్రబాబు అనుసరించే ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనమని అంతా అంటున్నారు. సంక్షేమ పథకాలు అందించడంలోనూ, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలోనూ పూర్తిగా మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడిచిన నేపథ్యంలో బీసీలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పింఛన్లు, మహిళలకు ఆర్థిక సాయం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వంటి అంశాలపై బీసీ సంఘాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

మమ అని‘పింఛన్‌’..

50 ఏళ్ల వయసు దాటిన బీసీలకు పింఛన్‌ అందిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీపై నేటికీ కార్యాచరణ ప్రారంభం కాలేదు. అధికారం చేపట్టాక ఒక్కరికీ కొత్తగా పింఛన్‌ ఇవ్వని చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో పింఛన్ల డ్రామాకు తెరతీశారు. ఇప్పుడు కూడా బీసీలకు భరోసా దక్కకపోవడంతో ఆయా వర్గాలు పెదవి విరుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 1.2 లక్షల మంది అర్హులు పింఛన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వృద్ధాప్యానికి చేరువవుతున్న బీసీ కార్మికులు, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి నెలవారీ ఆర్థిక భరోసా ఎంతో అవసరమని పలువురు పేర్కొంటున్నారు.

మహిళలకు రూ.1,500 సాయం ఊసేలేదు

మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో బీసీ నేస్తం పథకం ద్వారా అర్హులైన బీసీ మహిళలకు ఏడాదికి రూ.18 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేవారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుంది. దీనికోసం తూర్పుగోదావరి జిల్లాలో 2.3 లక్షల మందికి పైగా బీసీ మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా నో చాన్స్‌

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో చంద్రబాబు పూర్తిగా మోసం చేశారని బలహీన వర్గాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా దొరకలేదా అని ఆయా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క బీసీ ఎమ్మెల్యేకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని విమర్శిస్తున్నాయి.

ఫ బీసీలకు చంద్రబాబు దగా

ఫ పింఛన్ల నుంచి రాజకీయ

ప్రాతినిధ్యం వరకూ మోసమే

ఫ బీసీ డిక్లరేషన్‌ పేరిట ఎన్నికల వేళ

బూటకపు ప్రచారం

ఫ 27 నెలలు గడిచినా అందని

50 ఏళ్లకే పింఛన్‌

ఫ జిల్లాలో 1.2 లక్షల మంది

బీసీల ఎదురుచూపులు

ఫ నెలకు రూ.1,500 హామీకీ

మంగళం పాడేసిన బాబు

ఫ వెన్నుపోటు పార్టీ వంచనపై

బీసీల గర్జన నేడు

ఫ హాజరుకానున్న వైఎస్సార్‌ సీపీ

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నాయకులు

బీసీలకు 45 శాతం సీట్లిచ్చిన జగన్‌

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 45 శాతం మేర సీట్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేటాయించారని ఆ పార్టీ వర్గాలు, బీసీ సంఘాల ప్రతినిధులు గుర్తు చేసుకుంటున్నారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ సామాన్యులను కూర్చోబెట్టిన మనసున్న నాయకుడని కొనియాడుతున్నారు. అప్పట్లోనే 34 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రయత్నిస్తే, నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు న్యాయపరమైన చిక్కులు సృష్టించారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడం వల్లే బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల డ్రామాకు చంద్రబాబు తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement