● మాటల్లోనే పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
● గోదావరి రివర్‌ఫ్రంట్ పనుల్లో తీవ్ర జాప్యం
● నేటికీ 40 శాతం కూడా
పూర్తికాని పరిస్థితి
● ప్రతిపాదనల్లోనే పర్యాటక ప్రాజెక్టులు
● పర్యాటకులకు మౌలిక వసతుల
కల్పన ఏదీ?
● జిల్లా మంత్రే ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రయోజనం శూన్యం
సాక్షి, రాజమహేంద్రవరం: చారిత్రక నేపథ్యం.. గోదావరి అందాలు.. ప్రకృతి రమణీయత.. పూల సోయగాల కడియం.. ఇలా పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్న ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా జిల్లా నుంచే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేశ్ సైతం ప్రకటనలు ఘనంగా చేస్తున్నా.. అభివృద్ధి అధమంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గోదావరి రివర్ ఫ్రంట్ పనులే నత్తనడకన సాగుతుండగా, కొత్త ప్రాజెక్టులపై ప్రకటనలు ప్రతిపాదనల స్థాయిని దాటడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27న రాజమహేంద్రవరంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాలకు ఏర్పాట్లు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వేడుకల హడావుడి కంటే పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
బోటు షికారు గాలి మాటే
రాజమహేంద్రవరంతో పాటు జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. గోదావరి తీరంలో పర్యాటకులకు మెరుగైన వసతులు, కొత్త పర్యాటక ప్యాకేజీలు, టెంట్ సిటీలు, హోమ్ స్టేలు, ప్రచార కార్యక్రమాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెబుతున్నా అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
● ముఖ్యంగా ధవళేశ్వరం – కడియపులంక మధ్య గోదావరి కెనాల్‌కు ఇరువైపులా కడియం నర్సరీ స్టాళ్లు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. కెనాల్ మధ్య బోటు షికారు ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటకులకు ఫుడ్ కోర్టులు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని గొప్పగా ప్రకటించారు. అదేదీ కార్యరూపం దాల్చనే లేదు.
● అదే సమయంలో నర్సరీ స్టాళ్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో కొంతమంది ఆశగా దరఖాస్తు చేసుకున్నారు. వాటికి నేటికీ అతీగతీ లేదు. వాటి ప్రస్తుత స్టేటస్ ఏమిటో పాలకులకు, అధికారులకే తెలియదంటే అతిశయోక్తి కాదు.
● కాటన్ మ్యూజియం అభివృద్ధికి నిధులిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెప్పినా పైసా విదల్చలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు అటువైపే చూడలేదు.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహించడం వల్ల పర్యాటక రంగానికి ప్రయోజనం చేకూరదని, పర్యాటకుల సంఖ్య పెరగాలంటే అందుకు తగిన వసతులు, అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
గోదావరి ఒడ్డున అభివృద్ధి శూన్యం
రాజమహేంద్రవరంలో పర్యాటక రంగానికి గోదావరి నది ప్రధాన ఆకర్ష్షణ. పుష్కర ఘాట్లు, గోదావరి గట్టు, నదిపై వంతెనలు, పరిసర పార్కులు నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రాజమహేంద్రవరం శారదామఠం ఎదురుగా పద్మావతి ఘాట్ సమీపంలో చేపట్టిన రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు రూ.24 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు 40 శాతమే పూర్తయ్యాయి. మరోవైపు ఇక్కడి పనుల కోసం కొన్ని స్నాన ఘాట్లు, కాంక్రీట్ రివెట్‌మెంట్ భాగాలను తొలగించడంతో నది గట్టు భద్రత పైనా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇటీవల గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం పెరగడంతో గట్టు కోతకు గురవుతుందేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. ఇక్కడ చేపట్టే పనుల విషయంలో మంత్రికి, స్థానిక ప్రజాప్రతినిధికి మధ్య సమన్వయం లేదని, ఈ పనుల పరిశీలనకు కూడా సదరు ప్రజాప్రతినిధి హాజరుకావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి తన సన్నిహితులకు కాంట్రాక్ట్ ఇప్పించుకోవడంతో స్థానిక ప్రజాప్రతినిధి ముఖం చాటేస్తున్నారని రాజమహేంద్రవరం నగరవాసులు చర్చించుకుంటున్నారు. మరోవైపు గోదావరి పుష్కర ఘాట్ వద్ద చేపట్టిన హేవలాక్ బ్రిడ్జి పనులు కూడా ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టు నత్తనడకన సాగుతున్నాయి.


