కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 27న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమానికి తరలివెళ్లేందుకు ఎలాంటి అనుమతులూ లేవని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెక్షన్ 163, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. జిల్లా పరిధిలో ఉద్యోగులను సమీకరించడం, వాహనాలు ఏర్పాటు చేయడం, ప్రయాణాలకు పురికొల్పడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం నిషిద్ధమన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించి తరలివెళ్లినా, ర్యాలీలు నిర్వహించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు రాజమహేంద్రవరంలో పర్యాటక దినోత్సవం
మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం రూరల్: తొలిసారిగా రాజమహేంద్రవరం వేదికగా ప్రపంచ పర్యాటక దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆదివారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పర్యాటక రంగానికి సంబంధించి కొత్త కార్యాచరణతో ’రాజమండ్రి డిక్లరేషన్’ను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లతో ఏపీ టూరిజంపై ప్రచారం చేస్తామన్నారు.
పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు : జేసీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా పరిధిలోని హోటళ్లలో భక్తులు, ప్రముఖులు, అధికారులు, సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయడానికి చర్యలు చేపడుతున్నట్టు జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో హోటళ్ల నిర్వాహకులు, అసోసియేషన్ ప్రతినిధులతో పుష్కరాల ముందస్తు ఏర్పాట్లపై తొలి సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పుష్కరాల సమయంలో అవసరాన్ని బట్టి హోటళ్లలోని సుమారు 50 నుంచి 60 శాతం గదులను ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రముఖుల కోసం ముందస్తుగా కేటాయించి ఉంచే అంశంపై చర్చించామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు ఆర్.శివరాముడు, కె.ఆనందరావు, పుష్కర స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉరకలేస్తున్న గోదావరి
కడలిలోకి 5.18 లక్షల క్యూసెక్కుల నీరు
ధవళేశ్వరం: గోదావరి ఉరకలేస్తుంది. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న మిగులు జలాలను ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేయాల్సి వస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి పెరిగింది. కాటన్ బ్యారేజ్ వద్ద ఆదివారం నీటి ఉధృతి మరింత పెరిగి, అనంతరం తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 9 లక్షల క్యూసెక్కుల నీరు కాటన్ బ్యారేజ్‌కు వచ్చి చేరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గోదావరి ఉపనదులైన శబరి, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో వరద పెరుగుతుంది. ఎగువ ప్రాంతానికి సంబంధించి భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 29 అడుగులకు నీటిమట్టం చేరింది. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి పెరుగుతుండటంతో ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ధవళేశ్వరంలోని ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


