జనం డబ్బుతో.. సొంత డబ్బా | - | Sakshi
Sakshi News home page

జనం డబ్బుతో.. సొంత డబ్బా

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన హామీల అమలును గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం.. సొంత డబ్బా కొట్టుకోవడానికి మాత్ర ప్రజల డబ్బును పప్పుబెల్లాల్లా ఖర్చు పెట్టేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రభుత్వ ప్రచారానికి వినియోగించుకోవాలనే ఒక విచిత్రమైన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. తద్వారా ఒక్కొక్కరికీ లక్షలాది రూపాయలు ముట్టజెప్పేందుకు కూటమి పెద్దలు స్కెచ్‌ వేశారు.

టీడీపీ కార్యకర్తలకు లబ్ధే లక్ష్యంగా...

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఉపయోగించుకోవడమే ఈ పాలసీ ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. అయితే, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ముసుగులో టీడీపీ కార్యకర్తలకు, ఐటీడీపీ సభ్యులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే చంద్రబాబు లక్ష్యమని పలువురు విమర్శిస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌, యూట్యూబ్‌, ఎక్స్‌లో ఉన్న ఫాలోవర్లు, రీచ్‌ తదితర అంశాల ఆధారంగా పారితోషికం చెల్లిస్తారు. లక్షకు పైగా ఫాలోవర్లుంటే ఎ–కేటగిరీ కింద, 50 వేల నుంచి లక్ష మధ్య ఉంటే బి–కేటగిరీ, 25 వేల నుంచి 50 వేల మధ్య సి–కేటగిరీ, 10 వేల నుంచి 25 వేల మధ్య ఫాలోవర్లుంటే డి–కేటగిరీగా నిర్ణయించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్‌ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఇన్‌ఫ్లుయెన్సర్లకు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ చెల్లించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది. అయితే, తుది చెల్లింపు విధానం, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ వంటి వాటిపై పూర్తి స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

హామీలను విస్మరించి..

గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన విషయం తెలిసిందే. అయితే, అంతకంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తామంటూ నోటికొచ్చిన హామీలిచ్చి, గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచీ ఆ పథకాల అమలును తుంగలో తొక్కారు.

● 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆడబిడ్డ నిధి పేరిట ప్రతి నెలా రూ.1,500 చొప్పున చెల్లిస్తామని చంద్రబాబు గొప్పగా హామీ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా ఆ వయస్సు మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ చంద్రబాబు ఈ పథకం అమలు చేయడం లేదు.

● 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ పింఛన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పిన మాట కూడా గాల్లో కలిసిపోయింది. ఈ పథకానికి అర్హులు జిల్లావ్యాప్తంగా సుమారు 1.2 లక్షల మంది ఉంటారని అంచనా. 27 నెలల పాలనలో ఇప్పటి వరకూ ఒక్క పింఛను కూడా ఇవ్వకుండా.. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పింఛన్ల డ్రామాకు తెర తీసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు కూడా 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భరోసా ఇవ్వకపోవడం గమనార్హం.

● 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అప్పటి వరకూ ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచలేదు. ఆ హామీ ప్రకారం జిల్లాలోని ప్రతి నిరుద్యోగికి ఇప్పటి వరకు రూ.81 వేల చొప్పున చెల్లించాలి. ఇప్పటికై నా ఈ పథకం అమలు చేయాలని జిల్లాలోని 2.3 లక్షల మందికి పైగా ఉన్న నిరుద్యోగులు చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నారు.

● ఈవిధంగా గత ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలు అమలు చేయకుండా.. ప్రజాధనంతో సొంత డబ్బా కొట్టుకునేందుకు సిద్ధమవడం సిగ్గుచేటని విపక్ష నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ హామీల గురించి ప్రశ్నిస్తే ఖజానా ఖాళీ అయిపోయిందని ఓవైపు చెబుతూ.. ఇలా దుబారా ఖర్చుకు పూనుకోవడం దారుణమని మండిపడుతున్నారు.

చాలా దారుణం

కూటమి పార్టీల నాయకులు ఎన్నికల సమయంలో యువత, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును గాలికొదిలేశారు. నిరుద్యోగ భృతి ఊసే మరిచిపోయారు. ఈ హామీలు అమలు చేయకుండా సోషల్‌ మీడియాలో ప్రభుత్వ ప్రచారానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకురావడం, అధికార పార్టీకి అనుకూలమైన సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు ప్రజాధనం వినియోగించడం చాలా దారుణం.

– ఎస్‌.కిరణ్‌ కుమార్‌,

పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ప్రశ్నిస్తే కేసులు.. ప్రచారం చేస్తే డబ్బులా?

చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు పెడుతున్నారు. అదే వారికి అనుకూలంగా ప్రచారం చేస్తే డబ్బులివ్వడానికి సిద్ధపడుతున్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక్కరికీ ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి పథకానికి దిక్కే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్‌ ఇస్తామని హామీలు గుప్పించారు. ఇంతవరకు అమలు చేయలేదు. వాటికి నిధుల్లేవు కానీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు మాత్రం డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? పథకాలకు డబ్బులు లేవంటూ ఇలా దుబారా చేయడం దారుణం.

– టి.విజయ్‌ కుమార్‌, ఏఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

హామీలు అమలు చేయాలి

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకువెళ్లడం తప్ప, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలను కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇళ్లు లేని పేదలకు పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల చొప్పున భూమి ఇస్తామన్నారు. రెండేళ్లు దాటినా ఇప్పటి వరకూ పేదలకు స్థలాలు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వారి పార్టీ కార్యాలయాలకు మాత్రం స్థలాలు కేటాయించుకుంటోంది. ఇప్పటికై నా హామీలు అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి.

– తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

ప్రజల సొమ్ము..

పార్టీ ప్రచారానికా?

ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 సంవత్సరాలు దాటితే పింఛన్‌ ఇస్తానని చెప్పిన చంద్రబాబు వాటిని అమలు చేయడం లేదు. రాష్ట్రంలో మహిళలకు ఇస్తానన్న పథకాలు అమలు కాలేదు. వీటికి నిధుల్లేవని చెప్పి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చేవారు. ప్రభుత్వం పథకాలకు ఖర్చు చేయకుండా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఖర్చు పెట్టడానికి సిద్ధం కావడం సరికాదు. ప్రజల సొమ్ము ప్రజలకే చేరాలి. అంతే కానీ పార్టీ ప్రచారానికి వాడటమేమిటి? హామీలు అమలు చేయకుండా నచ్చినట్లు ప్రచారం చేయడానికి సోషల్‌ మీడియాను వాడుకుంటారా? అదే సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం ఎంత వరకు కరెక్ట్‌?

– తులసి, అఖిల భారత ప్రజాతంత్ర

మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి

టీడీపీ కార్యకర్తలకు

దోచిపెట్టేందుకే..

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకు తీసుకున్న నిర్ణయం దారుణం. దీనిపై రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారు.

– టీకే విశ్వేశ్వర రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ

రాజమహేంద్రవరం పార్లమెంటరీ కన్వీనర్‌

ప్రభుత్వ ప్రచారానికి సోషల్‌ మీడియా

ఇన్‌ఫ్లుయెన్సర్ల సేవలు

రూ.25 వేల నుంచి రూ.1.5 లక్షల

వరకూ చెల్లించేందుకు సిద్ధం

విచిత్ర విధానానికి రాష్ట్ర

మంత్రివర్గం ఆమోదం

ఐటీడీపీ సభ్యులకు లబ్ధి చేకూర్చే ఎత్తుగడ

చంద్రబాబు తీరుపై మండిపడుతున్న మేధావులు, విపక్షాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement