తగ్గిన వాన.. తగ్గని ముంపు | - | Sakshi
Sakshi News home page

తగ్గిన వాన.. తగ్గని ముంపు

Sep 26 2026 12:14 AM | Updated on Sep 26 2026 12:14 AM

● ఎడతెరిపిలేని వర్షానికి ఎట్టకేలకు బ్రేక్‌

● ఇంకా జలదిగ్బంధంలోనే పలు ప్రాంతాలు

● 2 వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు

● చెరువులకు గండ్లు

● ఛిద్రమైన రహదారులు

● ఇంకా రోడ్ల పైనే ప్రవాహాలు

● రాకపోకలకు తప్పని ఇబ్బందులు

సాక్షి, రాజమహేంద్రవరం: వరుణుడు శాంతించాడు. నిరవధికంగా కురిపించిన చినుకుల శరపరంపరను ఆపాడు. ఎన్నడూ లేని విధంగా దాదాపు 60 గంటల పాటు క్షణం కూడా తెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఎట్టకేలకు శుక్రవారం వేకువజామున బ్రేక్‌ పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం రాత్రి తీరం దాటిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు భారీ వర్షం జిల్లాను ముంచెత్తింది. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి చినుకులు ఆగడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. వాన తగ్గినా జిల్లాలోని పలు ప్రాంతాలను ఇంకా ముంపు వీడలేదు. ఈ వర్షాలకు జిల్లావ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో వివిధ పంటలు నీట మునిగాయి. దీంతో, ఖరీఫ్‌ గట్టెక్కుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాన ధాటికి జిల్లాలో పలు రోడ్లు దారుణంగా ఛిద్రమయ్యాయి.

● రాజమహేంద్రవరం నగరంలో వర్షం తగ్గినప్పటికీ పలు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. హుకుంపేట సావిత్రి నగర్‌లోని పలు వీధులను ముంపు నీరు వీడలేదు.

● కోరుకొండ మండలం గాదరాడ – కణుపూరు మధ్య చింతల గండి కాలువ వరద ఉధృతికి గురువారం రాత్రి ఓ కారు కొట్టుకుపోయింది. అందులోని నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇక్కడి కాలువపై కల్వర్టు నిర్మించాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు శుక్రవారం ధర్నా చేశారు. కాలువ ఉధృతంగా ప్రవహించే సమయంలో పొలాలకు వెళ్లేందుకు నరకయాతన అనుభవిస్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. కణుపూరు, కలవచర్ల, సీతారాంపురం, గాదరాడ గ్రామాల ప్రజలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూంటారు. కోరుకొండ మండలం నర్సాపురం పెద్ద చెరువు, శ్రీరంగపట్నం బురద కాలువకు గండ్లు పడ్డాయి. సూరంపాలెం ప్రాజెక్టు నుంచి అధిక మొత్తంలో నీటిని విడిచిపెట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మధురపూడి విమానాశ్రయం రోడ్డులోని పొన్నాలమ్మ గుడి సమీపాన వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.

● నిడదవోలు పట్టణంలో రోడ్లు జలమయం కావడంతో శుక్రవారం కూడా ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

● పెరవలి మండలంలో సుమారు 650 ఎకరాల వరి పంట ముంపునకు గురైంది. 150 ఎకరాల్లో కూరగాయల పంటలు కూడా నీట మునిగాయి. పొలాల్లో ఇంకా నీరు నిలిచి ఉండటంతో నష్టం తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

● దేవరపల్లి మండలంలో 400 ఎకరాలు, గోపాలపురం మండలంలో 900 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. దేవరపల్లి మండలంలో గండి చెరువు పొంగి ప్రవహిస్తోంది.

● అనపర్తి మండలం దుప్పలపూడి ఇంకా ముంపులోనే ఉంది.

● సీతానగరం మండలం చినకొండేపూడి – చీపురుపల్లి మధ్య లో కల్వర్టుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

● తాళ్లపూడి మండలం అన్నదేవరపేట – చిట్యాల రోడ్డు, చాగల్లు మండలం నందమూరు – కొవ్వూరు మధ్య రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తూండటంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొవ్వూరు వైఎస్సార్‌ కాలనీ కూడా ఇంకా ముంపులోనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement