ఏమాత్రం ఖాతరు లేదు! | - | Sakshi
Sakshi News home page

ఏమాత్రం ఖాతరు లేదు!

Sep 20 2026 12:15 AM | Updated on Sep 20 2026 12:15 AM

ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే

మందుల విక్రయాలు

మెడికల్‌ దుకాణాల్లో

నిబంధనలు బేఖాతరు

ఇష్టారీతిన అబార్షన్‌ కిట్లు,

‘ట్రమడాల్‌’ విక్రయాలు

పూర్తిస్థాయి తనిఖీలలో

అధికారులు విఫలం

సాక్షి, రాజమహేంద్రవరం: మందులు కొనాలంటే వైద్యుడి సలహా, ప్రిస్క్రిప్షన్‌ ఉండాలి. ఏది పడితే అది వేసుకుంటే ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అందుకే కొన్ని రకాల మందుల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. అయితే జిల్లాలో కొన్ని మందుల దుకాణాల్లో ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నిషేధిత ట్రమడాల్‌, ఎన్‌ఆర్‌ఎక్స్‌ డ్రగ్స్‌ విక్రయాలపైనా ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా గర్భస్రావానికి ఉపయోగించే ఔషధ కిట్లను వైద్యుల సూచన లేకుండా విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ డ్రగ్స్‌ రూల్స్‌ ప్రకారం కొన్ని మందులను రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌ ప్రిస్క్రిప్షన్‌ మేరకు మాత్రమే రిటెయిల్‌గా విక్రయించాలి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇష్టారీతిన అబార్షన్‌ మందుల విక్రయాలు

వైద్యుల పర్యవేక్షణ లేకుండా గర్భస్రావానికి సంబంధించిన మందులు వినియోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం రావచ్చు. అందువల్ల ఈ మందుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. గర్భం దాల్చి ఎన్ని వారాలు, మహిళ ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది పరిగణనలోకి తీసుకోకుండా మందులు వినియోగిస్తే ప్రాణానికే ప్రమాదం రావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డ్రగ్స్‌ విభాగం తనిఖీలు

జిల్లాలోని 21 మండలాలు, రాజమహేంద్రవరం నగర పరిధిలో మొత్తంగా 2,250కి పైగా మందుల దుకాణాలు ఉన్నాయి. అంటే జిల్లాలో ఏ స్థాయిలో మెడికల్‌ షాపుల వ్యాపారం సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రజారోగ్యానికి సంబంధించి ఇంతటి కీలకమైన వ్యాపార నిర్వహణపై డ్రగ్స్‌ విభాగం అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందని చెప్పక తప్పదు. అప్పుడప్పుడు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

● కొన్ని మెడికల్‌ షాపుల్లో నిషేధిత మందులు సులభంగా లభిస్తున్నాయనే ఆరోపణలు అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ తనిఖీలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, మందుల నిల్వలు, కొనుగోలు బిల్లులు, విక్రయ రికార్డులు, ప్రిస్క్రిప్షన్ల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది.

● నిబంధనల ప్రకారం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అడిగినప్పుడు లైసెన్స్‌దారులు సంబంధిత రికార్డులను తనిఖీకి సహకరించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో తనిఖీలు ఎంత మేరకు జరుగుతున్నాయి? ఎన్ని దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు? ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎన్ని లైసెన్సులపై చర్యలు తీసుకున్నారు? అన్న వివరాలు ఏవీ ఎవరికీ తెలియడం లేదు.

● జిల్లాలోని చాలా మందుల దుకాణాల్లో బిల్‌ బుక్‌లు నిర్వహించడం లేదు. ఇష్టారీతిన హ్యాండ్‌ సేల్‌ చేస్తున్నారు. ప్రతీ నెలా బిల్‌ బుక్‌లు పరిశీలించాల్సి ఉన్నా ఆ దిశగా డ్రగ్స్‌ విభాగం అధికారులు దృష్టి సారించడం లేదు.

● గ్రామీణ ప్రాంతాల్లో ఫార్మసీ సర్టిఫికెట్‌ ఒకరి పేరు న ఉంటే వేరొకరు వ్యాపారం చేస్తుంటారు. అటు వంటి వారికి అవగాహన లేక ఇష్టారీతిన మందు లు విక్రయిస్తున్నా వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు.

● మరీ ఆందోళనకర విషయమేమిటంటే గ్రామీణ ప్రాంతాల్లోని కొంత మంది ఆర్‌ఎంపీలు కూడా మినీ మందుల షాపులే నిర్వహించేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో అవసరమైన మందులన్నీ వారే విక్రయించేస్తున్నారు. ఒక్కోసారి కాల పరిమితి దాటిన మందులను సైతం విక్రయించడం ఆందోళన కలిగిస్తోంది.

● వైద్యుల సూచన మేరకే తీసుకోవాల్సిన యాంటీబయోటిక్స్‌ను సైతం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

● మెజార్టీ దుకాణాల్లో స్టాక్‌ రిజిస్టర్‌ నిర్వహించడం లేదు. ఏ ఏజెన్సీ నుంచి ఏయే మందులు ఎంత పరిమాణంలో కొనుగోలు చేశారో లెక్కాపత్రం ఉండడం లేదు. అప్పుడప్పుడు చేపట్టే అధికారుల తనిఖీల్లోనూ ఈ బిల్లులు లేని విషయం వెలుగు చూస్తున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదు.

● తాజాగా డ్రగ్స్‌ విభాగం అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఎన్‌ఆర్‌ఎక్స్‌ అమ్మకాలకు సంబంధించిన బిల్లులే లభించలేదు.

లాభార్జనే ధ్యేయంగా వ్యాపారం

మందుల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంపైనే కొందరు దుకాణదారులు దృష్టి పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యుడి సలహా లేకుండా మందులు అడిగిన వారికి విక్రయిస్తే కొంత వరకూ వ్యాపారం పెరగవచ్చు. కానీ దాని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌, నిద్రమాత్రలు, నొప్పి నివారణ మందులు, ఇతర నిషేధిత ఔషధాలను స్వయంగా వినియోగించడం వల్ల దుష్ప్రభావాలు, మందులపై ఆధారపడే పరిస్థితులు, యాంటీబయాటిక్‌ రెసిస్టెంన్స్‌ వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని అన్ని మెడికల్‌ షాపులపై డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఉన్నతాధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు జరుగుతున్నాయా లేదా పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో నిషేధిత మందుల విక్రయాలు, తనిఖీల వివరాలు తెలుసుకునేందుకు డ్రగ్స్‌ ఏడీ నాగమణికి గడిచిన మూడు రోజులుగా ఎన్నిసార్లు ఫోన్‌ చేసినప్పటికీ స్పందించకపోవడం గమనార్హం.

పక్క జిల్లాలో మందుల మాఫియా!

మన సరిహద్దులోని ఏలూరు జిల్లా పరిధి జంగారెడ్డిగూడెంలో మందుల మాఫియా బాగోతాలు ఇటీవల వెలులోకి వచ్చిన విషయం తెలిసిందే. వయాగ్రా మాత్రలు, ట్రమడాల్‌ మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం కొద్ది రోజుల క్రితం బయటపడింది. జంగారెడ్డిగూడెంలోని ఓ వ్యాపారి సుమారు 3,900 ట్రమడాల్‌ ఇంజెక్షన్లను తెలంగాణలోని కొందరు వ్యాపారులకు సరఫరా చేసినట్లు అక్కడి అధికారులు నిర్ధారించారు. ఈ ప్రాంతంలోనే కొన్ని ఇంజెక్షన్లు రోడ్డు పక్కన పడేయడం కూడా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాంతాలకూ ట్రమడాల్‌ ఇంజక్షన్లు సరఫరా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల తనిఖీలతో ఆ విషయం వెలుగుచూసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement