పుష్కరాలకు స్వచ్ఛంద సేవలు | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు స్వచ్ఛంద సేవలు

Sep 20 2026 12:15 AM | Updated on Sep 20 2026 12:15 AM

14,488 మంది వలంటీర్లు..

39 స్వచ్ఛంద సంస్థల నమోదు

భక్తుల భద్రత, పారిశుధ్యం, వైద్యం,

అన్నదానం, సమాచార సేవలకు ప్రాధాన్యం

కలెక్టర్‌ కీర్తి చేకూరి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రానున్న పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు, యువత, వలంటీర్ల సేవలను సమర్ధంగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. పుష్కర సేవలపై జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎస్పీ, జేసీ, మున్సిపల్‌ కమిషనర్‌, ఏఎస్పీ ఇతర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 39 స్వచ్ఛంద సంస్థలు నమోదు కాగా, 14,488 మంది వలంటీర్లను సేవల్లో భాగస్వాములను చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 22 సంస్థలు నమోదు కాగా, 19 సంస్థల ద్వారా 11,625 మంది, కొవ్వూరు డివిజన్‌లో 17 సంస్థలు నమోదు కాగా, 11 సంస్థల ద్వారా 2,863 మంది వలంటీర్లు సేవలందించనున్నట్లు తెలిపారు. వలంటీర్ల సేవలను ప్రధానంగా ఘాట్‌ భద్రత, ట్రాఫిక్‌, రద్దీ నియంత్రణ, పారిశుధ్యం, వైద్య సహాయక సేవలు, అన్నదానం, సమాచార సేవలు అనే ఐదు విభాగాల్లో వినియోగించనున్నారు. ఘాట్లు, జంక్షన్లు, దేవాలయాలు, క్యూ లైన్ల వద్ద పోలీసు శాఖకు సహకరించడంతో పాటు, పారిశుధ్య నిర్వహణపై భక్తులకు అవగాహన కల్పించనున్నారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ మాట్లాడుతూ ఏబీవీపీ, రెడ్‌క్రాస్‌తో పాటు ఇతర సంస్థల యువత సేవలను వారి సామర్‌ాధ్యనికి అనుగుణంగా వినియోగించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నిర్వహణ, డ్రోన్‌ ఆపరేషన్లతో పాటు యువత నైపుణ్యం అవసరమైన విభాగాల్లో వినియోగించనున్నట్లు చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ మేఘా స్వరూప్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాహుల్‌ మీనా, అదనపు ఎస్పీ పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌, ఆర్డీవోలు కె. ఆనందరావు, ఆర్‌.శివరాముడు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నెట్‌వర్క్‌ అంతరాయాలు రానీయొద్దు

పుష్కర భక్తులకు కాల్‌డ్రాప్స్‌, నెట్‌వర్క్‌ అంతరాయాలు లేకుండా కమ్యూనికేషన్‌ వ్యవస్థను పటిష్టం చేయాలని కలెక్టర్‌ టెలికం సంస్థలను ఆదేశించారు. శనివారం ఆమె ఈ మేరకు జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ తదితర సంస్థల ప్రతినిధులతో ఈ మేరకు సమీక్షించారు. పుష్కరాలకు 70 లక్షల మంది వరకూ వచ్చే అవకాశం ఉన్నందున నెట్‌వర్క్‌ సామర్‌ాధ్యన్ని ఇప్పటి నుంచే పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అత్యధిక రద్దీ ఉండే 70 కీలక ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో టెలికాం టవర్ల ఏర్పాటుకు జాబితాను సంస్థల ప్రతినిధులకు అందించారు. మున్సిపల్‌ కమిషనర్‌ రాహుల్‌ మీనా మాట్లాడుతూ, రహదారులపై ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను 10 రోజుల్లో తొలగించాలని టెలికాం సంస్థలను ఆదేశించారు. భూగర్భ కేబుల్‌ పనులు చేపట్టే ముందు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సమాచారం ఇచ్చి సమన్వయంతో పనులు నిర్వహించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement