● సేవా సంకల్ప్ అభియాన్‌పై
విద్యార్థులకు పోటీలు
● వచ్చే నెల పదో తేదీ నుంచి నిర్వహణ
● జిల్లా విద్యాశాఖాధికారి
వాసుదేవరావు
కంబాలచెరువు: ఆలోచనలు, సృజనాత్మకత, ఆకాంక్షలను వ్యక్తపరచడానికి విద్యార్థులకు ఒక అవకాశాన్ని కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం అక్టోబర్ 10వ తేదీ వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సేవ ప్రస్థానాన్ని వెలుగులోకి తీసుకురావడం, ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విద్యార్థులలో అవగాహన కల్పించడం అభియాన్ ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలోని 6 నుంచి 12వ తరగతి వరకు గల అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, పురపాలక, ఎయిడెడ్, ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో సేవా సంకల్ప్ అభియాన్ కింద విద్యార్థి కేంద్రీకృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. దీని నిమిత్తం జిల్లాలోని అన్ని యాజమాన్య ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ అన్ని పాఠశాలలలో ఈ నెల 22, 23 తేదీల్లో చిత్రలేఖనం, వక్తృత్వ పో టీలను నిర్వహించాలన్నారు. అలాగేే ఈనెల 26న నో బ్యాగ్ డేను పాఠశాల స్థాయిలో నిర్వహించి, అందులో మూడు స్థానాల్లో నిలిచిన బృందాల వివరాలను ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సంబంధిత మండల విద్యాధికారికి సమర్పించాలన్నారు. వారు ఈనెల 28న మండల స్థాయిలో పోటీలు నిర్వహించాలని, సీనియర్ ప్రధానోపాధ్యాయులు, సీనియర్ పాఠశాల సహాయకులతో మండల జ్యూరీని ఏర్పాటు చేయాలన్నారు. చిత్రలేఖనం నుంచి ఇద్దరు, వక్తృత్వం నుంచి ముగ్గురు, 6 నుంచి 8వ తరగతి వరకు ఒకరు చొప్పున, 11, 12 నుంచి ఒకొక్కరు చొప్పున ఒక మండలం నుంచి ఐదుగురు విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా పోటీలకు పంపాలన్నారు. మండలాల వారీగా నివేదికను, ఫొటోలు, వీడియోలతో పాటు ప్రతి విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురి వివరాలతో కలిపి, తప్పనిసరిగా ఈ నెల 29వ తేదీ ఉదయం 10.30 గంటలలోపు కార్యాలయానికి సమర్పించాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు అక్టోబర్ ఒకటిన రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్టు డీఈఓ వాసుదేవరావు తెలిపారు.


