మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం రూరల్: శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం బొమ్మూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ వారి రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారి ప్రసాదం పవిత్రతపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వులూ కలవలేదని సిట్ తేల్చడంతో చంద్రబాబు, పవన్ అబద్ధాలు చెప్పారని తేలిపోయిందన్నారు. అయినప్పటికీ టాయ్‌లెట్ కెమికల్స్ కలిశాయంటూ చంద్రబాబు మరింత దిగజారుడుగా వ్యవహరించారన్నారు. ఈ ఉదంతంపై చంద్రబాబు, ఆయన పచ్చ పత్రికలు ఇంకా భక్తుల మనోభావాలను గాయపరుస్తూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాము కాట్లతో అప్రమత్తం
డీఎంహెచ్‌ఓ కోమల
రాజమహేంద్రవరం రూరల్: పాముకాటుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ పి.కోమల అన్నారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఆమె స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్రలో భాగంగా సిబ్బందిచే మొక్కలు నాటించారు. అనంతరం అంతర్జాతీయ పాముకాటు దినం సందర్భంగా ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. 108 అంబులెన్సుల్లో యాంటీ స్నేక్ వీనమ్ అందుబాటులో ఉంచామని, పాముకాటు బాధితులు అత్యవసర వైద్యం పొందేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సంధ్య, జిల్లా ఇమ్యుమైజేషన్ అధికారి డాక్టర్ బి.శ్రీదేవి, డిప్యూటీ డెమో సత్యవతి, ఏఎన్‌ఎంలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నిత్యావసరాల ధరలు
నియంత్రించాలి
రేపు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన
రాజమహేంద్రవరం సిటీ: నిత్యావసర ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సోమవారం స్థానిక కోటగుమ్మం వద్ద శాంతియుత నిరసన చేపట్టనున్నట్టు వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బియ్యం ధరల్లో 25 శాతం, నూనె ధరల్లో 30 శాతం, కూరగాయల ధరల్లో 20 శాతం పెరుగుదల వచ్చిందని, దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఈ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా ఈ నిరసన చేపట్టనున్నట్టు వివరించారు. భరత్ రామ్ ఆదేశాలతో ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్టీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కా టం రజనీకాంత్, పార్టీ నాయకులు దూలం ప్రసా ద్ (శాండీ), రేగుళ్ల బాలశ్రీధర్, రామకృష్ణ గౌడ్ త్రీ టౌన్ పోలీసులకు లేఖ అందజేశారు.
‘ఏరువాక’ కో ఆర్డినేటర్‌గా
డాక్టర్ మానుకొండ
రాజానగరం: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో దివాన్‌చెరువులోని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్‌గా శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాసరావు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ కో ఆర్డినేటర్‌గా విధులు నిర్వర్తించిన డాక్టర్ చల్లా వెంకట నరసింహరావును పశ్చిమ గోదావరి జిల్లా, మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రానికి కీటక శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్తగా బదిలీ చేశారు.
డిమాండ్లు పరిష్కరించాలి
వీఆర్‌ఏల నిరవధిక దీక్ష
సీతానగరం: స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని వీఆర్‌ఏలు సహాయ నిరాకరణ, నిరవధిక దీక్ష చేపట్టారు. శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీ రాష్ట్ర వీఆర్‌ఏల సంఘం పిలుపు మేరకు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నేరవేర్చాలని కోరుతూ వారు నిరవధిక దీక్ష చేపట్టారు. మండల వీఆర్‌ఏ సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలుకు పెంచాలని, నామినీ వీఆర్‌ఏలను పర్మెనెంట్ చేయాలని తదితర డిమాండ్లు చేశారు.


