నడిపింఛెన్‌ | - | Sakshi
Sakshi News home page

నడిపింఛెన్‌

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

తూతూమంత్రంగా

ఏరివేతకు షురూ..

సుమారు రెండున్నరేళ్ల తర్వాత కొత్త పింఛన్లకు అవకాశం రావడంతో తూర్పు గోదావరి జిల్లాలో 53,470 వరకూ దరఖాస్తులు వచ్చాయి. భారీగా దరఖాస్తులు రావడంతో నిబంధనల కొర్రీలతో స్క్రూట్నీ చేసి అర్హులనూ ఏరివేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా విద్యుత్‌ బిల్లులను బూచిగా చూపించి చాలా దరఖాస్తులు తిరస్కరించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

హామీలివ్వడం ఆనక వదిలేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు.. రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్ల ఊసులేదు.. అడిగినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు.. స్థానిక ఎన్నికల వేళ మళ్లీ పింఛన్ల మాట వచ్చింది.. పది రోజుల్లో హడావుడిగా దరఖాస్తులు స్వీకరించేశారు.. ఇక్కడి వరకు ఓకే. మరి నిబంధనల కొర్రీతో ఎంతమందిని అనర్హులుగా మార్చుతారో? అసలు మంజూరు చేస్తారా? లేక ఇదంతా ఎన్నికల స్టంటా అనేది లబ్ధిదారులకు అర్థం కాక ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, రాజమహేంద్రవరం: బూటకపు హామీలతో చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి నుంచి ఏ ఒక్కరికీ కొత్తగా పింఛన్లు మంజూరు చేయలేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్య ఎప్పటికప్పుడు అర్హులకు పింఛన్లు మంజూరు చేసేవారు. ఫలితంగా అర్హులకు ఆర్థిక భరోసా దక్కేది. ఆ విధానానికి చంద్రబాబు ప్రభుత్వం స్వస్తి పలికింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు కొత్తగా ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద పింఛన్ల డ్రామాకు తెరలేపింది. కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు చేస్తారన్న సమాచారంతో ఈ నెల 7 నుంచి అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు తదితర వర్గాలు ఉన్నాయి. అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరవుతుందా? అర్హత పరిశీలనలో ఎంత మంది గట్టెక్కుతారు? నిబంధనల పేరుతో ఎంత మంది దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇన్నాళ్లూ ఆ ఊసేలేదు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల కంటే మరింత ఎక్కువగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్‌ కో గొప్పగా ప్రకటించారు. అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఊసే మరిచిపోయారు. ఇప్పుడు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేయించిన అన్ని సర్వేల్లోనూ ప్రభుత్వ పనితీరుపై అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తేలింది. ముఖ్యంగా పథకాల అమలులో జనం నుంచి వ్యతిరేకత వస్తుందనేది తెలిసిందే. ఇటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఓటర్లు బుద్ధి చెబుతారని చంద్రబాబుకు అర్థమైపోయిందని, అందువల్లే ప్రజల దృష్టి మళ్లించేందుకు పింఛన్ల డ్రామాకు తెరతీశారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానన్న హామీని అమలు చేయడం లేదని ఆయా వర్గాలు ఆవేదన చెందుతున్నాయి.

ఆశలు కల్పించి.. దోచేసి

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తుందన్న విషయం తెలియగానే దళారులు రంగంలో దిగారు. పింఛన్లు ఇప్పిస్తామని ఆశ కల్పించి అందినకాడికి దోచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది నుంచి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారని తెలుస్తోంది. మరోవైపు పింఛన్‌ దరఖాస్తుల మాటున మీ సేవ కేంద్రాల నిర్వాహకులు మామూళ్ల దందా సాగించినట్లు సమాచారం. ఆదాయ, కుల ధ్రువపత్రాల మంజూరుకు కొందరు రెవెన్యూ సిబ్బందితో కలసి కథ నడిపించారని.. దరఖాస్తు చేసేందుకు గడువు ముగుస్తుండడంతో వారు అడిగినంత దరఖాస్తుదారులు సమర్పించుకున్నారని తెలుస్తోంది. ఈ వసూళ్ల బాగోతం జిల్లా అంతటా సాగింది. వాస్తవానికి ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుకు రూ.125 చెల్లించాలి. కానీ రెవెన్యూ అధికారులతో మాట్లాడి వెంటనే పత్రాలు ఇప్పిస్తామని రూ.600 వరకు కొందరు వసూలు చేశారు. కొన్నిచోట్ల దరఖాస్తు ఆన్‌లైన్‌ చేసేందుకు రూ.300 వరకు తీసుకున్నారు. చర్మకారులు, డప్పు కళాకారులు తప్పనిసరిగా నోటరీ (సెల్ఫ్‌ డిక్లరేషన్‌) చేయించి దరఖాస్తు చేయాలి. ఆ నోటరీ కోసం కూడా దళారులు రూ.300 వసూలు చేశారు.

శనివారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

ఫ స్థానిక ఎన్నికల వేళ

కొత్త పింఛన్లంటూ హడావుడి

ఫ 27 నెలలుగా లబ్ధిదారుల

ఎదురుచూపులు

ఫ 7 నుంచి 18 వరకు

53,470 దరఖాస్తుల స్వీకరణ

ఫ నిబంధనల కొర్రీతో దరఖాస్తుదారుల్లో అనుమానాలు

ఫ మంజూరు అయ్యేవరకూ

నమ్మలేదంటున్న అర్హులు

ఇదో ఎత్తుగడ

మరోవైపు 80 శాతం వికలాంగత్వం ఉన్నవారికి రూ.15 వేల పింఛన్‌ ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రకటించారు. ఇప్పుడు ఇస్తున్న రూ.6 వేలకు బదులు రూ.15 వేలు ఇస్తామని చెబుతూనే.. సదరం సర్టిఫికెట్‌ కొత్తగా తెచ్చుకోమని అధికారులు చెబుతున్నారు. సదరం శిబిరాల్లో మాత్రం గతంలో 80 శాతం వికలాంగత్వం ఉన్నట్టు సర్టిఫికెట్‌ ఇచ్చినా, ఇప్పుడు దాన్ని తగ్గించేసి ఇస్తున్నారు. ఇదేంటని వైద్యులను అడుగుతుంటే పైనుంచి వచ్చిన ఆదేశాలంటూ చెబుతుండడం గమనార్హం. దివ్యాంగులకు పింఛన్ల సొమ్ము పెంచకుండా ఉండేందుకు ప్రభుత్వం అనధికార ఆదేశాలు ఇచ్చిందనే విషయం స్పష్టమవుతోంది.

దరఖాస్తులు చేసుకోలేక..

చేనేత కార్మికులు రెండేళ్లకు సంబంధించిన జీఎస్టీ బిల్లులు సమర్పించాలనే నిబంధనతో క్షేత్రస్థాయిలో నేతన్నలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పింఛన్లు ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఆ లెక్కన ఒక్కో జిల్లాకు పది వేలకు మించి రావు. తూర్పు గోదావరి జిల్లాకేమో ఆఖరి రోజుతో 53,470 దరఖాస్తులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వీలైనంత వరకూ నిబంధనల పేరుతో దరఖాస్తులు తిరస్కరించాలని ప్రభుత్వ పెద్దల నుంచి అధికారులకు అనధికార ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement