ఫ జిల్లాపై భానుడి ప్రతాపం
ఫ శుక్రవారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఫ సాధారణం కంటే 4, 5 డిగ్రీలు అధికం
ఫ రోడ్లపైకి రావాలంటేనే
హడలిపోతున్న జనం
సాక్షి, రాజమహేంద్రవరం: ఎండ సుర్రుమంటోంది.. జనం బయటకు రాలేనంతగా ఉంటోంది.. కొద్దిరోజులుగా జిల్లా ఉక్కబోతతో అల్లాడుతోంది.. వానాకాలం కాస్త వేసవిని తలపిస్తోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలు ఎండ చెమటలు కక్కిస్తుంటే.. రాత్రిళ్లు ఉక్కబోత, దోమల దండయాత్రతో జనం అల్లాడిపోతున్నారు. వేసవి మాదిరిగా ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శుక్రవారం జిల్లాలో గరిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణ కంటే 5 డిగ్రీలు ఎక్కువ కావడం ఆందోళనకరం. జిల్లాలో ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో రాత్రి వేళ కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. గురువారం రాత్రి 27 డిగ్రీలు, శుక్రవారం రాత్రి 27.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఫలితంగా వేడితో పాటు ఉక్కబోత కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్లు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ శాఖ అధికారులు ఇష్టారాజ్యంగా కోతలు విధిస్తున్నారు. విద్యుత్ సరఫరా లేక ఫ్యాన్లు, ఏసీలు పనిచేయక జనం అల్లాడిపోతున్నారు. చాలాచోట్ల రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య విద్యుత్ సరఫరా నిలిపేస్తుండడంతో దోమలతో సహవాసం చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలంతా ఎండ వేడిమితో అల్లాడిపోతుంటే.. రాత్రి వేళ విద్యుత్ కోతలతో నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి రాత్రి వేళ విద్యుత్ కోతలకు స్వస్తి చెప్పాలని కోరుతున్నారు.
రోడ్లన్నీ
నిర్మానుష్యంగా..
ఈ ఎండలకు మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నారు. రోడ్లపై వ్యాపారులు ఎండకు తాళలేక వ్యాపారాలను వదులుకుంటున్నారు. సాయంత్రం వేళలోనే అయినకాడకు వ్యాపారాలు చేసుకుంటున్నారు. విద్యుత్ కోతల కారణంగా వివిధ వ్యాపార వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి ఎండలు ఎప్పుడూ చూడలేదని జనం నిట్టూర్పు వదులుతున్నారు.


