స్థానిక ఎన్నికల్లో గట్టెక్కడానికే కుట్ర
స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కేందుకే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారు. అనపర్తి, రామవరం, కుతుకులూరు, మహేంద్రవాడ, పొలమూరు, కొప్పవరం గ్రామాల్లో వ్యాపారం చేసుకునేవారున్నారు. వారు బతుకుతెరువు కోసం వారానికి నాలుగైదు రోజులు, లేదా నెలలో కొద్ది రోజులు ఇతర ప్రాంతాలకు వెళ్లి మళ్లీ ఇళ్లకు వస్తుంటారు. వారి కుటుంబాలు గ్రామాల్లోనే ఉన్నప్పటికీ ఓట్ల తొలగింపునకు ఫారం – 7 దరఖాస్తులు ఇప్పించడం హేయమైన చర్య. ఈ అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా. అర్హులందరికీ తుది జాబితాలో ఓటు కల్పించే వరకూ వైఎస్సార్ సీపీ తరఫున పోరాడుతాం. నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న నాయకులకు త్వరలోనే ఓటర్లు బుద్ధి చెబుతారు.
–సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి
ఫ వైఎస్సార్ సీపీ ఓట్లపై
కూటమి కుయుక్తులు
ఫ అనపర్తిలో 1,200కు పైగా ఫారం–7 దరఖాస్తులు
ఫ ‘శాశ్వత వలస’ పేరుతో
ఓట్ల తొలగింపునకు కుట్ర
ఫ సంతకాలు ఫోర్జరీ చేసి గుంపగుత్తుగా దరఖాస్తులు
సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఓటమి భయం పట్టుకుంది.. దీంతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు కుయుక్తులు పన్నుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా ఇంటింటా సర్వే నిర్వహించి ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత కూడా భారీ సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు సమర్పించడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ మాజీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఈ దురాగతానికి పూనుకున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ‘శాశ్వతంగా వలస వెళ్లారు’ అనే కారణంతో సుమారు 1,200కు పైగా ఓట్ల తొలగింపునకు కూటమి నాయకులు దరఖాస్తులు చేశారంటే, పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఐదుగురి ఓట్లకు సంబంధించి మాత్రమే ఫారం– 7 సమర్పించే అవకాశం ఉంది. దీంతో కూటమి నాయకులు మరింత బరితెగించి వివిధ సందర్భాల్లో తమ పార్టీల కార్యకర్తలు అందజేసిన ఆధార్, ఓటరు కార్డులను ఉపయోగించి సంతకాలు ఫోర్జరీ చేసి గుంపగుత్తగా ఫారం– 7 దరఖాస్తులను అధికారులకు అందించారు. దీంతో క్లెయిమ్‌లపై విచారణ సమయంలో ఆక్షేపణదారులు రాకపోవడంతో ఈ బాగోతం బట్టబయలవుతోంది. తమ పేరు మీద ఎవరో దరఖాస్తు చేశారని, తమకు సంబంధం లేదని కొందరు ఆక్షేపణదారులు విచారణ సమయంలో అధికారులకు స్పష్టం చేస్తుండడం గమనార్హం.
ఇంతలోనే శాశ్వత వలస ఎలా?
‘సర్’ ప్రక్రియలో భాగంగా 2026 జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించారు. అనంతరం జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. అప్పటికే 21 వేలకు పైగా ఓట్లను వివిధ కారణాలతో అధికారులు తొలగించారు. ఇంత విస్తృతంగా ఇంటింటా సర్వే చేపట్టిన కొద్ది నెలల్లోనే అనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ‘శాశ్వత వలస’ పేరుతో పెద్ద సంఖ్యలో ఫారం–7లు సమర్పించడం గమనార్హం. ఇటీవలే బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించినప్పుడు స్థానికంగా ఉన్న ఓటర్లు ఇప్పుడు ఇంత తక్కువ వ్యవధిలో ఎలా ‘శాశ్వత వలసదారులు’గా మారారు? అని వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తోంది. ప్రత్యేకంగా అనపర్తి మండలంలోని కొన్ని గ్రామాల్లో ఫైనాన్స్, వ్యాపారం, విద్య, ఉద్యోగాల కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పని నిమిత్తం కొంత కాలం మరో ప్రాంతంలో ఉండటం మాత్రమే శాశ్వత నివాసం మారినట్టు భావించేందుకు సరిపోదు. ఎన్నికల సంఘం కూడా ఓటరు అర్హతకు ‘ఆర్డినరీ రెసిడెన్స్’ను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఉద్యోగం, విద్య తదితర కారణాలతో సాధారణ నివాసం నుంచి దూరంగా ఉన్న భారతీయ పౌరుడికి నిబంధనలకు లోబడి, తన సాధారణ నివాస నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండవచ్చని ఈసీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
కుట్రలో భాగంగానే..
బూటకపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు అండ్ కోపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం సీఎం చంద్రబాబు చేపట్టిన సర్వేల్లోనూ వెల్లడైంది. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనపర్తి నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడడం, ఆస్తుల విధ్వంసానికి పూనుకోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భావన కూటమి నాయకుల్లో నెలకొంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అతని కుమారుడు ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే అనపర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి సుమారు 1,200కు పైగా ఫారం–7 దరఖాస్తులు తమ అనుచరులతో ఇప్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విచారణ గదుల్లోనూ కూటమి నాయకులే
ఫారం–7లపై విచారణకు హాజరయ్యే ఓటర్ల వద్దకు కూటమి నాయకులు, కార్యకర్తలు చేరుకుని విచారణపై ప్రభావం చూపుతున్నారు. ఓటరు తన స్థానికతకు సంబంధించిన పత్రాలను సమర్పించే సమయంలో రాజకీయ జోక్యం ఉంటే స్వేచ్ఛాయుత విచారణ సాధ్యం కాదు. అనపర్తిలో మాత్రం ఓటరు తన ధ్రువీకరణ పత్రాలను అధికారులకు చూపిస్తుంటే.. కూటమి నాయకులు జోక్యం చేసుకుని.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లోనైతే పోలీస్ స్టేషన్లలో తప్పుడు ఫిర్యాదులు చేసి.. ఓటరు విచారణకు రాకుండా పోలీసుల సాయంతో బెదిరిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ‘శాశ్వత వలస’ దరఖాస్తులు రావడంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది.


