మూడో రోజుకు వీఆర్‌ఏల సమ్మె | - | Sakshi
Sakshi News home page

మూడో రోజుకు వీఆర్‌ఏల సమ్మె

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

కపిలేశ్వరపురం: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ కపిలేశ్వరపురం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. వీఆర్‌ఏల సంఘ నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

మొబైల్‌ ఫోరెన్సిక్‌

వాహనం ప్రారంభం

కాకినాడ క్రైం: కాకినాడ జిల్లాకు మంజూరైన మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. నేర పరిశోధనలో శాసీ్త్రయ ఆధారాల సేకరణను మరింత వేగవంతం చేయడానికి వాహనంలో అందుబాటులో ఉంచిన సాంకేతికత ఎంతో తోడ్పడుతుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నేరం జరిగిన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడం, డాక్యుమెంటేషన్‌ చేయడం, భద్రపరచడం, ప్రాథమికంగా పరిశీలించడం వంటి సేవలు ఈ వాహ నం ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు.

జీజీహెచ్‌లో

త్వరలో ‘హేల’ సేవలు

కాకినాడ క్రైం: కేన్సర్‌ వైద్యసేవల్లో వినియోగించే అత్యాధునిక లీనియర్‌ యాక్సిలరేటర్‌ (హేల) సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని జీజీహెచ్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశించారన్నారు. ఓఎన్‌జీసీ సహకారంతో రూ.36.65 కోట్ల అధునాతన చికిత్సా పరికరాలు కాకినాడ జీజీహెచ్‌లో కేన్సర్‌ వైద్య పరీక్షల కోసం కేటాయించినట్టు చెప్పారు. హేల యంత్రం ద్వారా రేడియేషన్‌ చికిత్స ప్రారంభించేముందు నూతనంగా అందుబాటులోకి వచ్చిన సీటీ స్కాన్‌ యంత్రంతో రోజూ పరీక్షలు జరిపి మూడు కోణాల నుంచి కేన్సర్‌ కణితి ఉన్న ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించవచ్చన్నారు. పరికరాల నిర్వహణకు నూతనంగా నిర్మితమవుతున్న ప్రభుత్వ ఐటీఐ సమీపంలో కేన్సర్‌ సేవల భవంతిలో రూ.7 కోట్ల వ్యయంతో బంకర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

కార్మికుల సొమ్ము పథకాలకు మళ్లిస్తారా?

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆగ్రహం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు నిధులను ఇతర అవసరాలకు మళ్లించడంపై ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ వెంకట సుబ్బయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పీఆర్‌ భవన్‌లో శుక్రవారం ఉదయం ఏపీ బిల్డింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర 6వ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సుమారు 22 లక్షల మంది కార్మికులు ఉన్నారని, వారి సంక్షేమం కోసం కార్మికుల నుంచి సమకూరిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం దారుణమన్నారు. రూ.6 వేల కోట్ల నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ బోర్డు కార్యకలాపాలు సక్రమంగా కొనసాగకపోవడంతో కార్మికులు అనేక సంక్షేమ ప్రయోజనాలకు దూరమయ్యారన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను ‘తల్లికి వందనం’ వంటి ప్రభుత్వ పథకాలకు వినియోగించడం సరికాదన్నారు. కార్మికుల చెమటతో సమకూరిన ప్రతి రూపాయీ కార్మిక కుటుంబాల సంక్షేమానికే ఉపయోగపడాలని, ఇతర పథకాలకు నిధులను మళ్లించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.సత్యనారాయణ మాట్లాడుతూ మరణించిన, ప్రమాదాలకు గురైన కార్మికుల కుటుంబాలకు సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన పరిహారం, ఇతర ప్రయోజనాలను ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement