రాజమహేంద్రవరానికి తెలుగు సినిమాతో అనుబంధం | - | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరానికి తెలుగు సినిమాతో అనుబంధం

Sep 16 2026 3:55 AM | Updated on Sep 16 2026 3:55 AM

రంగంపేట: తెలుగు సినిమా టాకీ ప్రస్థానం ప్రారంభమై 95 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రంగంపేటలో మంగళవారం 95వ సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు అడబాల మరిడయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా ప్రస్థానం, రాజమహేంద్రవరం ప్రాంతంతో సినీ రంగానికి ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా టాకీ యుగానికి భక్త ప్రహ్లాద చిత్రంతో 1931 సెప్టెంబర్‌ 15న శ్రీకారం చుట్టిందన్నారు. రాజమహేంద్రవరంలో నిడమర్తి కుటుంబం దుర్గా సినీ స్టూడియోను 1935లో నిర్మించిందని, దీనిలో రామ విజయం చిత్రానికి ఇండోర్‌ షూటింగ్‌ నిర్వహించి, 1936 జూలై 20న విడుదల చేశారన్నారు. రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన మూగమనసులు చిత్రంలోని సుమారు 75 శాతం అవుట్‌డోర్‌ చిత్రీకరణను 1963లో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు, గోదావరి నది, కోటిపల్లి, కోనసీమ గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించారన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,100 సినిమాల చిత్రీకరణలు జరిగాయన్నారు. కార్యక్రమంలో పిచ్చుకల అచ్యుత రామారావు, గారపాటి వెంకట్రావు, ఉండవిల్లి పెద్దరాజు, ఉండవిల్లి బుల్లి సత్తిరాజు, గోపిన వెంకట్రావుతదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement