సూపర్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

సూపర్‌ మోసం

Sep 16 2026 3:55 AM | Updated on Sep 16 2026 3:55 AM

50 ఏళ్లకే పింఛన్‌ అంటూ

ఎన్నికల్లో చంద్రబాబు హామీ

అధికారం చేపట్టి రెండేళ్లు

దాటినా అమలు చేయని ప్రభుత్వం

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వెన్నుపోటు

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త

పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

ఇప్పుడూ 50 ఏళ్లు దాటిన వారికి

దక్కని భరోసా

సాక్షి, రాజమహేంద్రవరం/సీతానగరం/నిడదవోలు రూరల్‌: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అండ్‌ కో అన్ని వర్గాలకూ తమదైన స్టైల్‌లో వెన్నుపోటు పొడిచారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన వాటి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ప్రజలందరినీ కూటమి నాయకులు నమ్మించి వంచించారు. ముఖ్యంగా సమాజంలో అత్యధిక శాతం కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామన్న హామీని పూర్తిగా విస్మరించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ హామీపై స్పష్టమైన కార్యాచరణ కనిపించకపోవడంతో 50 ఏళ్లు దాటిన అర్హులు నిరాశకు గురవుతున్నారు. తమకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.

ఊరూరా ఊదరగొట్టి..

ఎన్నికల సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని ప్రధానంగా ప్రస్తావించిన చంద్రబాబు 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్‌ అందిస్తామని గొప్పగా ప్రకటించడంతో ఆయా వర్గాల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు ఆర్థిక భరోసా లభిస్తుందని పలువురు భావించారు. అయితే రెండేళ్లు పూర్తయినా కొత్తగా ఈ పథకం కింద పింఛన్లు మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మార్గదర్శకాలు కూడా విడుదల చేయలేదని వాపోతున్నారు.

2.3 లక్షల మందికి నిరాశ

తూర్పుగోదావరి జిల్లాలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల బీసీ, ఎస్సీ, ఎస్టీలు సుమారు 2.3 లక్షల మందికి పైగా ఉన్నారు. 60 ఏళ్లు దాటకపోవడంతో వీరికి సాధారణ పింఛన్‌కు అర్హత లేదు. అదే సమయంలో చంద్రబాబు హామీ అమలుకు నోచుకోకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ చెందుతున్నారు. నమ్మి ఓట్లేసినందుకు నట్టేట ముంచారని ఆవేదన చెందుతున్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు, కుల వృత్తులపై ఆధారపడేవారు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని వారు పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పనిచేసే సామర్థ్యం తగ్గుతున్నా ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదని వాపోతున్నారు.

ఇప్పుడూ పింఛన్లపై

అనుమానాలే

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రభుత్వం కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రకటన చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసిన వారికి ఎన్నికల ముందు దరఖాస్తుల ప్రక్రియ తెరపైకి రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే ఇప్పుడు పింఛన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్లుగా పట్టించుకోకుండా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రతిపక్షాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పోనీ ఇప్పుడైనా ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా హామీ ఇచ్చిన 50 ఏళ్లకే పింఛన్‌ అంశంపై మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి పింఛన్‌ అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నారు.

చంద్రబాబును

నమ్మి మోసపోయాం

50 ఏళ్లకే పింఛన్‌ అందిస్తామంటే ఎంతో సంతోషించాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి మూడో ఏడాది వచ్చేసింది. నేటికీ ఆ పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. ప్రస్తుతం పింఛన్ల దరఖాస్తులు స్వీకరించడం కూడా ఎన్నికల స్టంట్‌లో భాగమే. హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. భవిష్యత్తులో బాబును నమ్మే పరిస్థితి లేదు. ప్రజలంతా తిరగబడకముందే హామీలు అమలు చేయాలి.

– బట్టు వెంకటరత్నం (54 ఏళ్లు),

ఎస్సీ సామాజిక వర్గం, సమిశ్రగూడెం

హామీ అమలు చేయాల్సిందే

50 ఏళ్లు దాటినప్పటికీ పింఛన్‌ మంజూరు చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ ఇచ్చిన హామీలు నమ్మాం. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తర్వాత కూడా వాటి అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి చంద్రబాబు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో బీసీలందరూ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.

– కొరుపుల కృష్ణ (58 ఏళ్లు), మిర్తిపాడు, వెలమ సామాజికవర్గం

ఆశలపై నీళ్లు

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయకుండా కొత్త దరఖాస్తుల ప్రకటనతో సరిపెట్టడం వల్ల మా ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. మా ఓట్లతో అధికారంలోకి వచ్చాక హామీని మరిచిపోవడం దారుణం. వయసు పెరుగుతున్న సమయంలో మాకు ప్రభుత్వం అండగా నిలుస్తుందనుకుంటే ఆ భరోసానే లేకుండా పోయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మార్గదర్శకాలు రూపొందించి, పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి.

– చిటికెల రాంబాబు (59 ఏళ్లు), మిర్తిపాడు, వెలమ సామాజికవర్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement