ఎన్నాళ్లీ గ్యాస్‌ కబుర్లు! | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ గ్యాస్‌ కబుర్లు!

Sep 16 2026 3:55 AM | Updated on Sep 16 2026 3:55 AM

సాక్షి, రాజమహేంద్రవరం: కొత్త కనెక్షన్ల మంజూరు విషయంలో ఏజెన్సీలు గ్యాస్‌ కబుర్లు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా యుద్ధం కారణంగా కొన్నాళ్ల క్రితం గ్యాస్‌ కొరత ఏర్పడింది. ఆ సమయంలో కొత్త కనెక్షన్ల మంజూరు, రెండో సిలిండర్‌ కేటాయింపును ప్రభుత్వం నిలిపేసింది. ప్రస్తుతం యుద్ధ ప్రభావం కొంత వరకూ తగ్గి పరిస్థితులు చక్కబడినా ఏజెన్సీల తీరు మారడం లేదు. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వమూ స్పందించడం లేదు. ఫలితంగా కొత్తగా వివాహమైన వారు, ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడిన వారు కొత్త కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఇండక్షన్‌ స్టౌలు, ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్లు, 5 కిలోల సిలిండర్లు కొనుగోలు చేసుకుంటున్నారు.

రెండో సిలిండర్‌ లేక..

జిల్లాలోని 52 గ్యాస్‌ ఏజెన్సీల పరిధిలో 5,12,135 కనెక్షన్లు ఉన్నాయి. ఈ లబ్ధిదారుల్లో కొందరికి రెండో సిలిండర్‌ లేదు. దీంతో ఇంట్లో ఉన్న ఒక్క సిలిండర్‌ అయిపోయిందంటే ఆ పూట వంట చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చుట్టు పక్కల వారిని అడిగి తీసుకోవాల్సి వస్తోంది. ఆ అవకాశం లేకుంటే బుక్‌ చేసుకున్న సిలిండర్‌ వచ్చేంత వరకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కటే సిలిండర్‌ ఉన్న వారిలో చాలా మంది ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్లు కొనుక్కుని వంట చేసుకుంటున్నారు.

జిల్లాలో 52 ఏజెన్సీలు

ప్రస్తుతం జిల్లాలోని 52 ఏజెన్సీల పరిధిలో సగటున 80 మంది చొప్పున సుమారు 4 వేల మంది దరఖాస్తుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త కనెక్షన్‌ కోసం కొందరు, రెండో సిలిండర్‌ కోసం మరికొందరు నిరీక్షిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు రూ.1700 వెచ్చించి 5 కిలోల సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. అందులోని గ్యాస్‌ అయిపోయిన వెంటనే ఏజెన్సీల వద్దకు పరుగులు తీసి దాన్ని నింపుకొంటున్నారు. మరోవైపు ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం కోసం 10 కిలోల సిలిండర్లు తీసుకొస్తామన్న చంద్రబాబు ప్రభుత్వం మాట నేటికీ నెరవేరలేదు. కొద్ది రోజుల కిందట ఒకటీ రెండు ఏజెన్సీలు మాత్రం ఈ పది కిలోల సిలిండర్లను తీసుకొచ్చాయి. అయితే కొత్త కనెక్షన్లు అందించడంతో పాటు రెండో సిలిండరు మంజూరు చేస్తేనే తమకు ఉపశమనం లభిస్తుందని వినియోగదారులు వేడుకుంటున్నారు.

యుద్ధ ప్రభావం తగ్గినా

మంజూరు కాని కొత్త కనెక్షన్లు

రెండో సిలిండర్‌ కేటాయింపునూ

నిలిపేసిన ప్రభుత్వం

గ్యాస్‌ ఏజెన్సీల చుట్టూ

వినియోగదారుల చక్కర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement