కుటుంబ సభ్యులకు జక్కంపూడి పరామర్శ
రాజానగరం: దివాన్ చెరువు జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో వైఎస్సార్ సీపీ పాలచర్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు పిల్లా చంద్రరావు (49) మృతి చెందాడు. ఆటోలో వెళ్తున్న అతనిని కారు ఢీ కొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బొమ్మూరు పోలీసులు మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి, చంద్రరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ చురుకై న కార్యకర్తను కోల్పోయిందని ఆయన అన్నారు. అనంతరం పాలచర్లలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఆయన పాల్గొని పాడె మోసారు.
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
సామర్లకోట: స్థానిక పెన్షన్‌లైన్‌కు చెందిన వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు పట్టా సవర్నాయుడు (పీఎస్ నాయడు) (40) స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఐస్ పార్లర్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. అంతకు ముందు ఆటో నిర్వహిస్తూ వ్యాపారం చేయడానికి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఖాళీగా ఉన్న ఐస్ పార్లర్ తీసుకున్నట్టు ఆటో యూనియన్ నాయకులు తెలిపారు. శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన నాయుడు మధ్యాహ్నం భోజనానికి రాక పోవడం, ఐస్ పార్లర్‌లో లేక పోవడంతో పట్టణంలోని బంధువుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో ఆయన బంధువులు విషయాన్ని ఆటో యూనియన్ నాయకులకు తెలియజేసి పోలీసులను ఆశ్రయించారు. నాయుడు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను సిగ్నల్ ద్వారా గుర్తించి పెద్దాపురం రోడ్డులోని స్టేట్ బ్యాంకు సమీపంలోని అన్నపూర్ణ కల్యాణ మండపం వద్ద ఉన్నట్టు తెలుసుకున్నారు. శనివారం రాత్రి అక్కడకు చేరుకుని అక్కడి వాచ్‌మన్‌ను నాయుడు గురించి అడిగారు. దీంతో అతడు రెండో అంతస్తులో ఉన్నాడని, విశ్రాంతి తీసుకుంటానని ఉదయం వెళ్లాడని చెప్పాడు. పోలీసులు ఆ గది వద్దకు వెళ్లి కిటికీ నుంచి చూడగా నాయుడు ఉరి వేసుకోవడాన్ని చూసి, తలుపు గడియ తొలగించి మృతదేహాన్ని దించి దర్యాప్తు ప్రారంభించారు. అతడు కొంత కాలంగా మానసిక ఇబ్బంది, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారని ఎస్సై ఎస్‌వీఎస్‌ఎన్ మూర్తి వివరించారు.
ఆన్‌లైన్ మోసంపై కేసు నమోదు
అనపర్తి: బిక్కవోలు, నల్లమిల్లి రోడ్డులో ఉన్న కేపీఆర్ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జరిగిన ఆన్‌లైన్ మోసంపై శనివారం కేసు నమోదు చేసినట్టు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్రకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సంస్థ ముడి పదార్థాల కొనుగోలు కోసం న్యూఢిల్లీకి చెందిన యునైటెడ్ కెమికల్స్ నుంచి కొటేషన్ కోరింది. ఢిల్లీకి చెందిన సంస్థ కంప్యూటర్‌ను హ్యాక్ చేసి బ్యాంకు వివరాలను మార్చి పంపారు. దాని ప్రకారం, కేపీఆర్ సంస్థ ప్రతినిధులు రూ.5,29,112 యునైటెడ్ కెమికల్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, గ్వాలియర్ ఖాతాకు బదిలీ చేశారు. అయితే యునైటెడ్ కెమికల్స్ కంపెనీ న్యూఢిల్లీ వారు తమకు ఆ డబ్బు అందలేదని తెలియజేశారు. వెంటనే కేపీఆర్ సంస్థ ఉద్యోగులు కోటక్ మహీంద్రా బ్యాంకుకు మెయిల్ పంపి, ఆ మొత్తాన్ని స్తంభింపజేయమని కోరారు. బ్యాంకు ఖాతాలోని మొత్తాన్ని స్తంభింపజేశారు. వెంటనే కేపీఆర్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


