అదనపు కోటా కోసం ఎదురుచూపులు | - | Sakshi
Sakshi News home page

అదనపు కోటా కోసం ఎదురుచూపులు

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

35 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి

అనుమతికి మించి సాగు

దేవరపల్లి: పొగాకు బోర్డు 2025–26 పంట కాలంలో అనుమతించిన ఉత్పత్తి కంటే అదనంగా పండించిన పొగాకు అమ్మకాల కోటా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బోర్డు ఇచ్చిన కోటా మేరకు విక్రయాలు పూర్తి కావడంతో అదనంగా పండిన పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. బ్యారన్‌కు 35 క్వింటాళ్ల చొప్పున పంట పండించడానికి బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులు బ్యారన్ల రిజిస్ట్రేషన్‌ చేశారు. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 50.87 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, సుమారు 85 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. ఇచ్చిన కోటా ప్రకారం రైతులు బ్యారన్‌కు 35 క్వింటాళ్ల చొప్పున అమ్మకాలు పూర్తి చేశారు. బ్యారన్‌కు 15 నుంచి 20 క్వింటాళ్ల అదనపు పంట రైతుల వద్ద ఉండిపోయింది. ఈ పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని రైతులు అధికారులను కోరుతున్నారు. రీజియన్‌ పరిధిలో సుమారు 35 మిలియన్ల కిలోలు అదనపు పొగాకు ఉంది.

ఒడిదొడుకుల్లో మార్కెట్‌

పొగాకు పండించి దాదాపు ఎనిమిది నెలలు కావడంతో రంగుమారి, నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌ ఒడుదొడుకుల్లో కొనసాగుతుండడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంటను అమ్ముకోవడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అమ్మకాలు నత్తనడకన జరుతుండడంతో ఎక్కువ రోజులు పొగాకు రైతుల ఇళ్ల వద్ద నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో బ్రైట్‌ గ్రేడు ధర ఆశాజనకంగా ఉండడంతో అదనపు పొగాకు అమ్మకాలకు అనుమతి ఇస్తే, కొంత వరకు కోలుకొనే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.

23.44 మిలియన్ల కిలోల విక్రయం

రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకు రూ. 581.45 కోట్ల విలువ గల 23.44 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలో గరిష్ఠ ధర రూ. 325, కనిష్ఠ ధర రూ.150, సగటు ధర రూ. 248.71 లభించింది. బ్రైట్‌ గ్రేడు పొగాకు ధర కొంత వరకు ఆశాజనకంగా ఉన్నప్పటికి ఎక్స్‌ గ్రేడు, మీడియం గ్రేడు పొగాకు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎక్స్‌ గ్రేడు గత ఏడాది కిలో రూ. 260 ధర పలకగా, ప్రస్తుతం రూ. 150 నుంచి 160 ఉంది. లోగ్రేడు పొగాకు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. 10 నుంచి 15 శాతం లోగ్రేడ్‌, 30 శాతం ఎక్స్‌ గ్రేడు, 20 శాతం మీడియం. 35 శాతం బ్రైట్‌ గ్రేడు పొగాకు పండినట్టు రైతులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement