కోరుకొండ: భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో ఓ అల్లుడు అత్తపై కత్తితో దాడి చేశాడు. కోరుకొండ ఎస్సై ఆర్.శివాజీ కథనం ప్రకారం.. రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామానికి చెందిన పోటి కృష్ణకు కాపవరానికి చెందిన హేమశ్రీతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగి అత్తారింటికి రావడం లేదు. దీనికి అత్త ఐతిరెడ్డి వరలక్ష్మి కారణమని భావించిన కృష్ణ, ముందుగా తెచ్చుకున్న కత్తితో కాపవరంలోని అత్తారింటికి వెళ్లాడు. అక్కడ అత్త వరలక్ష్మిపై కత్తితో ఎడమ చెంపపై దాడి చేశాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సంఘటనా స్థలానికి కోరుకొండ సీఐ ఎస్‌వీవీ మూర్తి, ఎస్సై ఆర్.శివాజీ చేరుకుని పరిశీలించారు.


