కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గురుపూజోత్సవం సందర్భంగా జిల్లాలోని 99 మందికి ఉపాధ్యాయులకు స్థానిక వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో శనివారం ఉత్తమ పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవడం, ఆయన ఉపాధ్యాయుడిగా సేవలందించిన రాజమహేంద్రవరం గడ్డపై ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషమన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ తమ జీవితాలకు మార్గనిర్దేశం చేసిన గురువులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సభాధ్యక్షుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జేసీ వై.మేఘా స్వరూప్, సహాయ కలెక్టర్ ఆదిత్య శర్మ, క్రైమ్ డీఎస్పీ సుభాష్, డీఈఓ కె.వాసుదేవరావు, పేరెంట్ టీచర్ అసోసియేషన్ అధ్యక్షులు చౌదరి, సమగ్ర శిక్ష పీడీ ఎస్.సుభాషిణి, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణకుమారికి రాష్ట్రస్థాయి పురస్కారం
నిడదవోలు రూరల్: విజయవాడలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవంలో మండలం డి.ముప్పవరం జెడ్పీ ఉన్నత పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయిని నిచ్చెనకోళ్ల కృష్ణకుమారి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. విద్యారంగంలో విశేష సేవలు అందించి, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కృష్ణకుమారికి ప్రశంసా పత్రం, రూ.20 వేల నగదు బహుమతి అందజేశారు.


