మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ
రాజమహేంద్రవరం రూరల్: శిలాఫలకాలు వేయడం, ఇతరులు నిర్మించిన ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తడం, రిబ్బన్లు కత్తిరించడం, ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియాలో గొప్పగా కథనాలు రాయించుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. శనివారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘సీఈవో సీఎం టు వాటర్ మేన్’ అంటూ ఎంత ప్రచారం చేసుకున్నా వాస్తవాలు మారవన్నారు. సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో వైఎస్సార్‌ది సంకల్పం, జగన్‌ది సమగ్ర నిర్మాణం, చంద్రబాబుది శిలాఫలకాలు, ప్రచారం, క్రెడిట్ చోరీ అని ఎద్దేవా చేశారు.
వెలిగొండకు ప్రాణం పోసింది వైఎస్సార్
2004 అక్టోబర్ 27న రూ.3581.58 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది వైఎస్సార్ ప్రభుత్వమని వేణు చెప్పారు. 2005లో పనులు ప్రారంభించారని, రెండు సొరంగాలు 37.587 కిలోమీటర్లు కాగా, వైఎస్సార్ హయాంలోనే 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు, 2004 వరకు ఖర్చు చేసింది రూ.10 లక్షలేనన్నారు. తొమ్మిదేళ్లు శిలాఫలకానికే పరిమితమయ్యారన్నారు. 2014 – 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వెలిగొండ రెండు సొరంగాల్లో కలిపి పూర్తి చేసింది కేవలం 6.686 కిలోమీటర్లు మాత్రమేనన్నారు. ఈ గణాంకాన్ని దాచిపెట్టి ప్రాజెక్టు తానే నిర్మించినట్టు ప్రచారం చేసుకోవడం ప్రజలను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు.
సొరంగాలు పూర్తి చేసింది జగన్ ప్రభుత్వమే
వైఎస్ జగన్ ప్రభుత్వం మిగిలిన 10.568 కిలోమీటర్ల సొరంగ నిర్మాణాన్ని పూర్తి చేసిందని వేణు చెప్పారు. మొదటి సొరంగాన్ని 2021 జనవరిలో, రెండో సొరంగాన్ని 2024 జనవరిలో పూర్తి చేసి దశాబ్దాల వెలిగొండ కలను సాకారం చేసిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులకు రూ.1046.46 కోట్లు ఖర్చు చేసి కీలక దశకు చేర్చారన్నారు. వెలిగొండ నిర్వాసితుల పునరావాసం కోసం జగన్ ప్రభుత్వం రూ.1301.56 కోట్లతో ప్రణాళిక రూపొందించిందన్నారు.
పోలవరం ఎడమ కాలువలోనూ అదే క్రెడిట్ చోరీ
పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను 2005లోనే వైఎస్సార్ ప్రభుత్వం ప్యాకేజీలుగా విభజించి ప్రారంభించి ఆయన హయాంలోనే దాదాపు 79 శాతం పూర్తి చేశారన్నారు. ఇప్పుడు ఆ నిర్మాణం తానే చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గోదావరి నీటిని పురుషోత్తపట్నం పంపుల ద్వారా ఇప్పటికే నిర్మించిన పోలవరం ఎడమ కాలువలోకి వదిలి, ఉత్తరాంధ్రకు పోలవరం నీళ్లు తెచ్చానని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నీళ్లు పురుషోత్తపట్నం పంపులవి, కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించింది. కరువు కాటకాలతో అల్లాడుతున్న తెలుగు నేలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ఒకేసారి 86 సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులిచ్చిన నాయకుడు వైఎస్సార్ అని వేణు చెప్పారు. ఐదేళ్ల మూడు నెలల్లో రూ.53,205.29 కోట్లు ఖర్చు చేసి జలయజ్ఞాన్ని దేశ సాగునీటి చరిత్రలోనే అపూర్వ అధ్యాయంగా నిలిపారన్నారు. వైఎస్సార్ ప్రారంభించిన ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్ జగన్ అని వేణు గుర్తుచేశారు. వైఎస్సార్ ప్రాజెక్టులకు రూపమిచ్చారని, వైఎస్ జగన్ అసంపూర్తి పనులను పూర్తి చేశారని అన్నారు.
పోలవరం ఎత్తుపై సమాధానం చెప్పాలి
నిజంగా చంద్రబాబు ‘వాటర్ మ్యాన్’ అయితే పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేస్తారా? లేక 41.15 మీటర్లకే పరిమితం చేస్తారా? పోలవరం ఎత్తు, నిర్వాసితుల పునరావాసం, పూర్తి స్థాయి నీటి నిల్వపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని చెల్లుబోయిన వేణు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు నిజంగా మేలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చంద్రబాబు చెప్పాలన్నారు.


