సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): సామాన్యుడు కుళా యి పన్ను కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని.. ఇంటి పన్ను కట్టకపోతే ముక్కు పిండి మరీ వసూలు చేస్తా రు. పైగా ఆలస్యంగా కట్టినందుకు జరిమానా విధిస్తా రు. అటువంటిది ఏకంగా పదేళ్ల పాటు రూ.21 కోట్లు పన్ను ఎగవేస్తున్నా ఎవరూ కిమ్మనట్లేదంటే అక్కడ ఆమ్యామ్యాల వ్యవహారం ఏదో ఉందని అర్ధం చేసుకోవచ్చు. అధికారులను, ప్రజాప్రతినిధులను శాసిస్తూ ఏడాదికి రూ.200 కోట్లు టర్నోవర్ సాధిస్తున్న పేపర్‌మిల్లు యాజమాన్యం చేస్తున్న అరాచకమిది.
సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం జీవనాడి, కోట్లాది మందికి తాగునీరందించే పవిత్ర గోదావరి నది ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలతో కాసారంగా మారుతోంది. ఇందుకు ప్రధాన కారణం నగర నడిబొడ్డున ఉన్న ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ (పేపర్ మిల్లు). దాని నుంచి వెలువడుతున్న ద్రవ, వాయు వ్యర్థాలు పర్యావరణాన్ని నాశనం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం మొత్తంలో రోజుకు దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే అందులో 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు ఒక్క పేపర్ మిల్లు నుంచే రావడం గమనార్హం. వీటి వల్ల కాతేరు, సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా విషపూరితంగా మారుతున్నాయి.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం...
● పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యార్థాలను శుద్ధి చేయకుండా నేరుగా గోదావరిలోకి వదలడంతో అటు పర్యావరణం, ఇటు పరీవాహక ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
● వ్యర్థాల్లోని లెడ్, ఆర్సెనిక్, కాడ్మియం వంటి భార లోహాలు నీటిలో కలవడం వల్ల క్యాన్సర్, కాలేయం, మూత్ర పిండాల (కిడ్నీ) వ్యాధులు వస్తాయి.
● మిల్లు వెదజల్లే వ్యర్థాలు, పొగ వల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు వ్యాపిస్తాయి.
● నదిలో కలిసే రసాయనాలు నేలలోకి ఇంకి, చుట్టు పక్కల బావులు, బోరు బావుల నీరు తీవ్ర కాలుష్యానికి కారణమవుతాయి.
● గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని సాగు భూమిలో సారం దెబ్బ తింటుంది. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది.
● నదిలోని జీవచరాలకు ముప్పు వాటిల్లి వాటిపై ఆధారపడిన మత్స్యకారులు ఉపాధి కోల్పోవలసి వస్తుంది.
కాలుష్య నియంత్రణ మండలి చెప్తున్నది ఇదీ..
● గోదావరి నీటిని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ల్యాబ్‌లలో పరీక్షించి కాలుష్య కారకాలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తేల్చింది.
● సల్ఫైడ్లు నిబంధనల కంటే 70 శాతం అధికం (3.4 ఎంజీ/లీ).
● బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అనుమతించిన దానికంటే 20 శాతం అధికం (ఎంజీ/లీ).
● ఫాస్పేట్ 6 శాతం అధికం (5.3 ఎంజీ/లీ)
రూ. 21.34 కోట్ల పన్నుల ఎగవేత...
ఒకవైపు పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తూనే మరోవైపు స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను మిల్లు యాజమాన్యం ఎగవేస్తోంది. 2016 నుంచి కాతేరు పంచాయతీ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లకు దాదాపు రూ.21.34 కోట్ల మేర పన్నులు చెల్లించకుండా నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టు స్టేలతో కాలయాపన చేస్తోంది.
హెచ్చరికలు బేఖాతరు
గతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మిల్లు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిల్లుకు సమన్లు జారీ చేయాలని, పన్నుల ఎగవేతపై న్యాయ పోరాటాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే ‘క్లోజర్ నోటీసులు’ ఇచ్చి మిల్లును మూసివేయిస్తామని హెచ్చరించినప్పటికీ, మిల్లు యాజమాన్యంలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.
రాజమహేంద్రవరం పేపరు మిల్లు
సీఎస్‌ఆర్ నిధులు... ఏర...
ఏడాదికి దాదాపు రూ.200 కోట్ల ఆదాయాన్ని యాజమాన్యం ఆర్జిస్తోంది. దీనిలో 5 శాతం అంటే రూ.10 కోట్లు సీఎస్సార్ నిధులకు ఖర్చు పెట్టాల్సి ఉంది. కానీ ఎవరైనా ఆ నిధుల కోసం వెళితే కేవలం రూ.లక్షల్లో ఇచ్చేసి చేతులు దులుపుకొంటున్నారు. నగరాభివృద్ధికి ప్రజాప్రతినిధులు ఈ నిధులను వెచ్చిస్తున్నారు. ఈ కారణంతో వారెవరూ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి నెలకొంది.
– టీకే విశ్వేశ్వరరెడ్డి,
గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు
పరిశ్రమలు ఉండాలి.. కానీ..
పరిశ్రమలు ఉండాలి కాని అవి కాలుష్య రహితంగా ఉండాలి. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి పేపర్‌మిల్లు కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పేపర్‌మిల్లు కాలుష్యంపై చేతులెత్తేసింది. తక్షణం పేపర్‌మిల్లుపై చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యంగా గాలిని, నీటిని కలుషితం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడాన్ని ఆరికట్టాలి.
– తాటిపాక మధు,
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
పేపర్ మిల్లు కోరల్లో గోదారమ్మ
హానికారక వ్యర్థాల విడుదలతో కలుషితం
సీఎస్సార్ నిధుల చెల్లింపులోనూ నిర్లక్ష్యం
ప్రజాప్రతినిధులకు, అధికారులకు
కేవలం రూ.లక్షల్లో ‘పంపకాలు’
దీంతో కాలుష్యంపై నోరు
మెదలపలేని పరిస్థితి
పదేళ్లుగా రూ.21.34 కోట్ల పన్ను ఎగవేత
చేతులెత్తేసిన కాలుష్య నియంత్రణ మండలి
వెంకటనగరం.. తూర్పులంక..
ఇది రాజమహేంద్రవరం నగరానికి సమీపాన ఉన్న ప్రాంతం. ఇక్కడే పేపర్‌మిల్లు నుంచి వచ్చిన వ్యర్థాలను శుద్ధి చేసి గోదావరిలోకి పంపించే ప్లాంట్ ఉంది. కానీ అతి తక్కువ మోతాదులో వ్యర్థాలను శుద్ధి చేసి మిగిలినది నేరుగా గోదావరిలోకి కలిపేస్తున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా ఇక్కడ వంద ఎకరాల భూమిని చెరువులుగా చేసి మిల్లు వ్యర్థాలను వాటిలోకి తరలించి ఆనక గోదావరిలోకి కలిపేస్తున్నారు. అటువైపు వెళ్లడానికి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు సాహసం చేయకపోవడం గమనార్హం.


