● ఇన్నీసుపేట కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్
బాబుపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం
● నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం
● ఆర్బీఐ నిబంధనలు బేఖాతరు
● ఆయనను పదవి నుంచి
తొలగించాలని డిమాండ్
● వైఎస్సార్ సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): భారత రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా పదవిలో కొనసాగుతున్న ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి నుంచి కోళ్ల అచ్యుత రామారావు (బాబు)ను వెంటనే తప్పించాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా చిట్స్, వడ్డీ వ్యాపారాలు చేసే వారు ఆర్యాపురం, ఇన్నీసుపేట, జాంపేట బ్యాంకుల్లో చైర్మన్లు, డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని, ఆయా బ్యాంకుల్లోని ప్రజల డిపాజిట్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శ్యామలా సెంటర్‌లో ఉన్న ఇన్నీసుపేట కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద భరత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం ధర్నా చేశారు. 2025లో పార్లమెంట్ చట్టం ప్రకారం కో ఆపరేటివ్ రంగంలో పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న చైర్మన్, డైరెక్టర్లు పదవులకు అనర్హులని, రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి 13 నెలలు కావస్తున్నా ఇంతవరకు వారిని పదవుల నుంచి తప్పించకపోవడం దారుణమన్నారు. దీనిపై సహకార శాఖ అధికారులను బాధ్యులుగా చేయాలని హైకోర్టును ఆశ్రయించనున్నామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు చైర్మన్ కోళ్ల బాబుతో పాటు జామి వెంకట రమణమూర్తి, ఆదిరెడ్డి శ్రీనివాసరావు, కటారి శ్రీనివాస కన్నా, పంచకట్ల శివను వెంటనే తొలగించకపోతే తాము ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. బాబు గత 27 ఏళ్లుగా అక్కడ ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ఇన్నీసుపేట, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్లు స్వయంగా ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బంధువులని, వారంతా చిట్స్, వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్‌పై ‘51 ఎంకై ్వరీ’ నడుస్తోందని, తాజాగా ఇన్నీసుపేట బ్యాంక్ చైర్మన్ బాబు అక్రమాలు, అరాచకాలపై కూడా సమగ్ర విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కుటుంబ ఆస్తులను పంచుకున్నట్టు బ్యాంకుల ఆస్తులను పంచుకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఈ అక్రమాలను తాము సహించబోమని, వీటిపై ఉద్యమించి అవినీతికి అడ్డుకట్ట వేస్తామన్నారు. అనంతరం బ్యాంక్ సీఈఓకు వినతి పత్రం అందచేసి రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వుల కాపీలను అందజేశారు. కార్యక్రమంలో ఇన్నీసుపేట బ్యాంక్ డైరెక్టర్లు గుత్తుల భాస్కర్, అందనాపల్లి సత్యనారాయణ, డిపాజిటర్ యజ్జరపు మరిడయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్నా, నల్లా రామాంజనేయులు, తిరగటి దుర్గ, కృష్ణవేణి, సేపేని మునీశ్వరరావు, యజ్జవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.


