సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా రాజమహేంద్రవరంలో కొత్తగా జిల్లా పరిషత్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాలకు అనుగుణంగా జిల్లా ప్రజా పరిషత్‌లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం ఉన్న 13 జెడ్పీల స్థానంలో కొత్తగా 28 జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇటీవలే ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైన పోలవరానికీ ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పాటు కానుంది. ఇందుకోసం అదనంగా 15 మంది జెడ్పీ సీఈవోలు, మరో 15 మంది డిప్యూటీ సీఈవోల పోస్టుల ఏర్పాటుకూ ఆమోదం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌కు 2021లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జిల్లాల పునర్విభజన జరగడంతో కాకినాడ కేంద్రంగానే ఇప్పటి వరకూ ఉమ్మడి జెడ్పీ కార్యకలాపాలు సాగాయి. అయితే ఈ నెల 24తో ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాతే కొత్త జిల్లా పరిషత్‌లు అమలులోకి రానున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందే ఉమ్మడి జిల్లా పరిషత్‌ను నాలుగు జిల్లా పరిషత్‌లుగా విభజించే ప్రక్రియ ముగించాల్సి ఉండడంతో తాజా ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ మూడు మండలాలనూ ఏం చేస్తారో...?
రాష్ట్రంలోని 660 మండలాలను ఆయా జిల్లా పరిషత్‌లలో మ్యాపింగ్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే వీటిలోని కొన్ని మండలాలు వేర్వేరు జిల్లాల్లో ఉండడంతో వాటిని అలానే కొనసాగిస్తారా లేక నియోజకవర్గాల ప్రాతిపదికగా తూర్పు గోదావరి జిల్లాతో మ్యాపింగ్ చేసి కొత్త జిల్లా పరిషత్ ఏర్పాటు చేస్తారా అనేది తేలాల్సి వుంది.
● ద్వారకా తిరుమల మండలం గోపాలపురం నియోజకవర్గంలో భాగమైనప్పటికీ ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది.
● పెదపూడి మండలం అనపర్తి నియోజకవర్గంలో భాగమైనప్పటికీ ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉంది.
● గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే కొనసాగుతోంది.
మొత్తంగా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా లో 22 మండలాలున్నాయి. అయితే ద్వారకా తిరుమల, పెదపూడిని మన జిల్లాలోనే కలుపుకొని గోకవరం మండలాన్ని కాకినాడలో కలపనున్నారా అనే ది తేలాల్సి వుంది. ఆస్తుల విభజన.. ఉద్యోగుల సర్దుబాటు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయనున్న జిల్లా పరిషత్ కార్యాలయం కోసం అనుకూలమైన భవనం కోసం సంబంధిత అధికారులు ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో పరిశీలించారు. మరోవైపు ప్రస్తుతం కలెక్టరేట్ నిర్వహిస్తున్న భవనం సమీపంలోని స్థలంలో సొంత భవన నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జెడ్పీ ఏర్పాటులో కీలకమైన ఉద్యోగుల సర్దుబాటుకు కూడా అవసరమైన చర్యలు ప్రారంభించారు. జెడ్పీ సీఈవో, ఉప సీఈవోతో పాటు కార్యాలయంలోని విభాగాలకు సిబ్బందిని కేటాయించనున్నారు. కాకినాడ జిల్లా పరిషత్ నుంచి ఏవోలు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, టైపిస్టులు, అటెండర్లను రాజమహేంద్రవరానికి కేటాయించనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగుల నుంచి జిల్లాల వారీగా ఆప్షన్లు తీసుకుని సర్వీస్ వివరాలను అమరావతిలోని కమిషనరేట్‌కు పంపించారు. జెడ్పీకి సంబంధించిన ఆర్థిక వనరులు, ఆస్తుల విభజన కూడా జరగాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా పరిషత్‌కు నాలుగు జిల్లాల్లోనూ కొన్ని స్థిరాస్థులు ఉన్నాయి. వాటిని జనాభా ప్రాతిపదికన కేటాయించే అవకాశం ఉంది.
రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
పోలవరానికీ సొంత జిల్లా పరిషత్
2021లో ఉమ్మడి జెడ్పీ పోరు తరువాత నాలుగు జిల్లాల విభజన
స్థానిక ఎన్నికల దిశగా
మరో కీలక అడుగు
ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు
చంద్రబాబు, లోకేష్, పవన్ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వర్షాభావం, ఎరువుల ధరల మంటతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. సూపర్ సిక్స్ పేరిట దగా చేశారు. ప్రతీ మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని మోసం చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని నమ్మించి వారికీ దగా చేశారు. ప్రస్తుతం ప్రజలంతా వైఎస్ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పునాది పడుతుంది.
– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం
వైఎస్సార్ సీపీ అభ్యర్థులదే గెలుపు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులదే గెలుపు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల వారినీ మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా... కూటమి అభ్యర్థులకు ఎప్పుడు ఓటుతో బుద్ధి చెబుదామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌ను దూరం చేసుకున్నామని ప్రజలంతా బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం ఖాయం.
– జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే,
వైఎస్సార్ సీపీ రాజానగరం ఇన్‌చార్జి
జెడ్పీ పీఠం వైఎస్సార్ సీపీదే
వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తమ బతుకులు మారుతాయని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసింది. మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఈ పరిస్థితుల్లో ఏ ఎన్నికలు నిర్వహించినా వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపు ఖాయం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం మా పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ సొంతం చేసుకోవడం ఖాయం.
– సత్తి సూర్యనారాయణ రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, అనపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి


