ఫ పీఠం కోసం టీడీపీ, జనసేన పాకులాట
ఫ ఎన్నికల్లో చైర్మన్‌గిరీకి పట్టు
ఫ తమ పరిస్థితి ఏంటంటున్న బీజేపీ
ఫ ఉమ్మడి తూర్పులో రాజుకున్న విభేదాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మున్సిపల్ ఎన్నికలు కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తుంది. ఆ పీఠం తమకు కావాలంటే తమకంటూ పట్టుబిగించడం అగ్గిరాజేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో జనసేన సీటు ఆశిస్తుండగా.. జనసేన ఎమ్మెల్యేలున్న ప్రాంతంలో టీడీపీ మిత్రపక్షాలను కాదని పీఠంపై కూర్చునేందుకు కుట్రలు పన్నుతోంది. ఇప్పటికే వర్గ వైషమ్యాలతో మండిపడుతున్న నేతలకు ఈ పరిణామం మింగుడుపడటం లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే.. కూటమికి బీటలు వారినట్లు కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. వాటిని పరిశీలిద్దాం రండి..
కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ నెలలో నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. తొలుత మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వేడి రాజుకొంది. మున్సిపల్ పీఠం కై వసం చేసుకునేందుకు మిత్రపక్షంలోని జనసేన, టీడీపీ నేతలు పోటీ పడుతుండగా.. బీజేపీ మాత్రం తమ పరిస్థితి ఏంటన్న మీమాంసలో ఉంది. ప్రస్తుతం ఈ పరిణామం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 మున్సిపాలిటీలు, 2 నగరపాలక సంస్థలు ఉన్నాయి. ఇందులో కోర్టు వివాదాలు ఉండడంతో కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. మిగిలిన మున్సిపాలిటీల్లో మాత్రం జరుగనుంది.
నిడదవోలులో నివురుగప్పిన నిప్పులా..
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మున్సిపల్ పోరుతో మరింత భగ్గుమంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావును కాదని జనసేనకు ఎమ్మెల్యే సీటు కట్టబెట్టారు. అప్పటి నుంచి టీడీపీ నేత శేషారావు, జనసేన మంత్రి కందుల దుర్గేష్‌కు వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇద్దరు నేతలూ ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం పూర్తి స్థాయిలో కలిసిన సందర్భాలు లేవు. నామినేటెడ్ పోస్టుల్లో సైతం జనసేన నేతలకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠమైనా దక్కించుకుని పట్టు నిలబెట్టుకునేందకు శేషారావు వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీని కోసం ఎక్కడికై నా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పంచాయితీని టీడీపీ అధిష్టానం వద్దకు తీసుకెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉంటే.. మున్సిపల్ పీఠాన్ని సైతం తామే కై వసం చేసుకుంటామని జనసేన నేతలు చెబుతుండటం ఇరువర్గాల మధ్య వర్గ విభేదాలు మరింత ఆజ్యం పోస్తున్నాయి.
కొవ్వూరులో కామ్‌గా..!
కొవ్వూరు మున్సిపాలిటీలో కామ్‌గా వెళ్లాలని జనసేన నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వారి ప్రాబల్యం ఆశించిన మేర లేకపోవడంతో వైస్ చైర్మన్ పదవితో సర్దుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో కొవ్వూరు మున్సిపల్ చైర్మన్ స్థానానికి టీడీపీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది.
కమలనాథులకు మొండిచేయి..?
కూటమిలో ప్రధాన మిత్రపక్షమైన బీజేపీకి ఆది నుంచీ అన్యాయం జరుగుతూనే ఉంది. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ జనసేన, టీడీపీ నేతలకు ప్రాధాన్యం కల్పించారు. రెండు పార్టీలకు చెందిన వారికే సింహభాగం పదవులు కట్టబెట్టారు. మున్సిపల్ పోరులోనూ బీజేపీకి మొండిచేయి చూపే పరిస్థితులు కనిపిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క మున్సిపల్ చైర్మన్ పదవైనా కేటాయిస్తారా..? లేదా..? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ పరిణామం బీజేపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు.
పిఠాపురంలో పట్టుఎవరిదో..? : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీలో స్థానిక పోరు రసవత్తరంగా మారనుంది. జనసేన ఆధిపత్యం కొనసాగుతుండటంతో మేయర్ స్థానం సైతం తమకే కావాలంటూ ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నేత వర్మ మున్సిపల్ చైర్మన్ స్థానానికి రెబల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ పరిణామం జన సైనికుల్లో ఆందోళన నింపుతోంది.
రామచంద్రపురంలో రసవత్తరంగా.. : కోనసీమ జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యేగా సుభాష్ ప్రాతిని ధ్యం వహిస్తున్నారు. మున్సిపల్ పీఠం తమకే దక్కాలంటూ టీడీపీ నేతలు భావిస్తు న్నారు. ఇదిలా ఉంటే.. జనసేనకు అవకాశం ఇవ్వాలని అక్కడి నేతలు కో రుతున్నారు. అయినా టీడీపీకే దక్కే అవకాశాలు ఉన్నాయి. ముమ్మిడివరం నగర పంచా యతీపీఠం సైతం జనసేన ఆశిస్తుండగా..టీడీపీ కై వసం చేసుకునే అవకాశం ఉంది.
రెండింట్లో ఒక్కటైనా..!
కాకినాడ జిల్లా పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో ఏదో ఒక మున్సిపల్ చైర్మన్ పీఠం తమకు కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది. రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో మున్సిపల్ చైర్మన్ స్థానమైనా తమకు దక్కాల్సిందేనంటూ తెగేసి చెబుతున్నారు. జనసేన డిమాండ్‌ను టీడీపీ పట్టించుకోవడం లేదు. రెండు మున్సిపాలిటీల చైర్మన్ పదవులు తమకేనంటూ టీడీపీ ప్రచారం చేస్తుండటంతో జనసేన నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.


