ప్రశ్నిస్తే పరారవుతారా! | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నిస్తే పరారవుతారా!

Aug 22 2026 12:24 AM | Updated on Aug 22 2026 12:24 AM

బాధ్యతారాహిత్యంగా మంత్రి లోకేష్‌ తీరు

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపాటు

చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీపై విచారణకు ఆదేశించండి

కపిలేశ్వరపురం (మండపేట): ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తామని తెలిసి, ముందే కౌన్సిల్‌కు మంత్రి నారా లోకేష్‌ పరారు కావడం, ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. రాష్ట్రంలోని డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై తాము బాధ్యతాయుతంగా కౌన్సిల్‌లో ప్రశ్నించామన్నారు. ప్రతి రోజూ అసెంబ్లీకి వచ్చిన లోకేష్‌ ఆ కౌన్సిల్‌కు రాకపోవడంతో తమ ఆరోపణలు వాస్తవమని తేలిందన్నారు. శుక్రవారం మండపేటలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విలేకరులతో ఎమ్మెల్సీ త్రిమూర్తులతు మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై తాము ప్రశ్నించామని, అవి పరిష్కారమవుతాయని ఆశించిన ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి నిరాశ ఎదురైందన్నారు. డీఎస్సీలో సుమారు 400 మందికి క్రీడా కోటాలో ఉద్యోగాలిచ్చామని చెప్పడం, అందుకు క్రీడాకారిణి పీవీ సింధూకు ఉద్యోగం ఇవ్వడంతో పోల్చి చెప్పడం వెనుక లోకేష్‌ అక్రమాలకు పాల్పడారన్న దానికి బలం చేకూరుతుందన్నారు. పీవీ సింధూ వంటి స్థాయి క్రీడాకారులకు గౌరవార్థం ఉద్యోగాలిస్తారని, వారు ఉద్యోగ విధుల్లో ఉండకపోవచ్చన్నారు. సింధూతో పోల్చడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందిన 400 మంది ఉద్యోగ విధుల్లో చేరకపోయినా ఫర్వాలేదా అని ప్రశ్నించారు.

అవస్థలకు ఎల్‌నినో కారణమా?

సాగునీరు అందక రైతులు అవస్థ పడుతున్నారని, ఎల్‌నినో కారణమంటూ కూటమి చెప్పడాన్ని ఎమ్మెల్సీ తోట తప్పుబట్టారు. పంట సాగు చేసే ముందే సాగునీటి పరిస్థితిపై రైతులకు అవగాహన కల్పించకపోవడాన్ని నిలదీశారు. అన్నదాతా సుఖీభవ పేరుతో ఏడాదికి రూ.20 వేల చొప్పున రెండేళ్లలో రూ.40 వేల పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ. మూడు వేల నిరుద్యోగ భృతి హామీలు అమలు కాలేదన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తుందని, వాస్తవానికి అమలు చేసే చిత్తశుద్ధి మాత్రం కనిపించడం లేదని ఎమ్మెల్సీ అన్నారు. దీనికి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా కేంద్రంతో చర్చించి ఆ అంశాన్ని 9వ షెడ్యూల్‌లో పెట్టించాలన్నారు. బీసీలకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 50 శాతానికి పైగా రాజకీయపరంగా రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

సీబీఐ విచారణకు సిద్ధం

డీఎస్సీ అక్రమాలపై సమాధానం చెప్పలేని ప్రభుత్వం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గ్రూప్స్‌ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ ఇంతకాలం తర్వాత హంగామా చేస్తుందని త్రిమూర్తులు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో గ్రూప్స్‌, ప్రస్తుత ప్రభుత్వంలోని డీఎస్సీ రెండింటి మీదా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో సీబీఐ విచారణ వేసుకోవచ్చని చెప్పారు. అధికారం చేతిలో ఉండగా, చేయాల్సిన పనులు చేయకుండా గత ప్రభుత్వంపై బురద చల్లడం, అసెంబ్లీలో కూటమి ప్రతినిధులతో ప్రశంసించుకోవడంతో చంద్రబాబు ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతుందన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఉద్యోగాలివ్వలేదంటూ కూటమి అధినాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి ప్రజలే సమాధానం చెబుతారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement