సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026లో భాగంగా శని, ఆదివారాల్లో జిల్లాలో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. అర్హులను ఓటరుగా నమోదు చేయడం, ఓటర్ల జాబితాలోని వివరాలను పరిశీలించడం, ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే సరిచేయడం వంటివి చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, జాప్యం లేకుండా ఆన్‌లైన్ చేయాలని ఆదేశించారు. ఆ రోజుల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
దర్యాప్తులో రోజుకో కొత్త మలుపు
కాకినాడ రూరల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ ఎట్టకేలకు శుక్రవారం రాత్రి పోలీసులకు చిక్కాడు. ఈ కేసు దర్యాప్తులో రోజుకొక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడిన పదేళ్ల బాలుడు కార్తికేయరెడ్డి అందించిన వివరాలు, నూకరాజు సూసైడ్ నోట్, సౌజన్య రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్ పోలీసుల దర్యాప్తునకు కీలకంగా మారాయి. సౌజన్య రాసిన సుదీర్ఘ మూడు పేజీల నోట్‌లో సాధిక్ వేధింపులు మొత్తం తెలియజేయడంతో కొన్ని విషయాలను మాత్రమే పోలీసులు బహిర్గతం చేస్తూ నోట్‌ను మాత్రం బయటపెట్టకుండా గోప్యత పాటిస్తున్నారు. కొడుకు కార్తికేయరెడ్డిని రైఫిల్ షూటింగ్ కోసం సౌజన్య 2024లో సాధిక్ అకాడమీకి తీసుకువెళ్లారు. ఆమెతో సాధిక్ సన్నిహితంగా ఉంటూ ఆమె తండ్రి నూకరాజు, భర్త జగదీశ్వరరెడ్డికి సంబంధించిన విషయాలు తెలుసుకుని, పక్కా ప్లాన్‌తో తన ఆధీనంలోకి తీసుకుని బంగారం, నగదు తీసుకోవడంతో పాటు ఆస్తి రాయించుకునే ప్రయత్నంతో పాటు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. నూకరాజు కుటుంబం ప్రాధేయపడినా కనికరించలేదు. పరువు, ప్రతిష్ట, విపరీమైన వేధింపులను తట్టుకోలేక నూకరాజు కుటుంబం గోదావరిలో దూకి ప్రాణాలు తీసుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ సంఘటనలో చిరంజీవిగా మిగిలిన కార్తికేయరెడ్డి ఈ నెల 16న అర్ధరాత్రి రాజమహేంద్రవరంలోని రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి దూకిన తరువాత తల్లిని కాపాడే ప్రయత్నం చేశాడని తాజాగా పోలీసు వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. కాకినాడ ఏడీబీ రోడ్డులోని తాను చదువుతున్న స్కూల్‌లో నేర్చుకున్న స్విమ్మింగ్ ద్వారా క్రీడల్లో నేషనల్ స్థాయికి ఎదిగిన కార్తికేయరెడ్డి గోదావరిలో దూకిన తరువాత తల్లి సౌజన్యను దాదాపు గంట పాటు కాపాడే ప్రయత్నం చేశాడని తెలిసింది. ఈ ఉదంతంతో ఇద్దరిలో బతకాలనే ఆశలు చివర్లో చిగురించగా, సౌజన్య మాత్రం కొద్దిసేపటికి గల్లంతైందని సమాచారం. కార్తికేయరెడ్డిని మత్స్యకారులు కాపాడారు.
రైఫిట్ షూటింగ్‌లో సర్టిఫికెట్ ఉందా?
ప్రీ రైఫిల్ షూటింగ్ పేరిట కాకినాడలో అకాడమీని పెట్టి శిక్షణ అందిస్తున్న 26 ఏళ్ల సాధిక్ ఖాన్‌కు రైఫిల్ షూటింగ్‌లో శిక్షణ పొందిన సర్టిఫికెట్ లేదని పోలీసులు భావిస్తున్నారు. డీఎస్‌ఏలో ఒకరి వద్ద నేర్చుకున్న రైఫిల్ షూటింగ్‌తోనే అకాడమీని పెట్టినట్టు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు షేక్ సాధిక్ ఖాన్‌పై రాజమహేంద్రవరంతో పాటు కాకినాడ నగరంలోని సర్పవరంలోనూ కేసు నమోదైంది.
నేటికీ లభ్యం కాని
ఏఈ భార్య ఆచూకీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం వద్ద 16న అర్ధరాత్రి కుటుంబం సహా గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించిన వారిలో ఏఈ నూకరాజు భార్య మీనా ఆచూకీ ఇంకా లభించలేదు. ఘటన జరిగి ఐదు రోజులైనా ఆమె ఆచూకీ శుక్రవారం కూడా లభ్యం కాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయనున్నారు. గల్లంతైన వారిలో నూకరాజు మృతదేహం రాజమహేంద్రవరం దోబీఘాట్ వద్ద, ఆయన కుమార్తె సౌజన్య మృతదేహం కొత్తపేట మందపల్లి లంక వద్ద లభించిన విషయం తెలిసిందే. మీనా ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బోటు ద్వారా ముమ్మరంగా గాలిస్తున్నాయి.


