అసలేం జరిగింది! | - | Sakshi
Sakshi News home page

అసలేం జరిగింది!

Aug 20 2026 12:17 AM | Updated on Aug 20 2026 12:17 AM

ఏఈ నూకరాజు ఘటనపై

పోలీసుల ముమ్మర దర్యాప్తు

డిలీట్‌ అయిన సెల్‌ఫోన్‌ మెసేజ్‌లే కీలకం

వాటిని రికవరీ చేసేందుకు చర్యలు

నిందితుడు సాధిక్‌ ఖాన్‌పై నిఘా

పిఠాపురం: పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముందుగా నూకరాజు, ఆయన కూతురు సౌజన్య రాసిన మరణ వాంగ్మూలాలు, అనంతరం వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, సౌజన్యల సెల్‌ ఫోన్లలో డిలీట్‌ చేసిన డేటాను రికవరీ చేయడం ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయనే కోణంలో వారి సెల్‌ ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించే పనిలో ఉన్నారు. మరో పక్క ఈ కేసులో నిందితుడైన సాధిక్‌ ఖాన్‌ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అతడు కర్ణాటకకు పారి పోయినట్లు గుర్తించి, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కూతురు సౌజన్యల ఆచూకీ మూడో రోజూ లభ్యం కాలేదు.

ఫోన్‌ సంభాషణలే ఆధారం

నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఆదివారం రాత్రి ఏం జరిగింది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరం బయలు దేరిన ఆయన.. దారిలో ఎవరిని కలిశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ ప్రాంతంలో ఎంత సేపు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు తదితర వాటిపై ఆరా తీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి గోదావరిలోకి దూకే వరకు ఫోన్‌ సంభాషణలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్లే వరకు సాధిక్‌ పలు మార్లు కాల్‌ చేసి బెదిరించినట్లు నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంపైనా పోలీసులు దృష్టి సారించారు.

మెసేజ్‌లపై దృష్టి

నూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన సామగ్రిని, వారి సెల్‌ఫోన్లను పోలీసులు ఆయన కారులో స్వాధీనం చేసుకున్నారు. అయితే వారి సెల్‌ఫోన్లలో వాట్సాప్‌ మెసేజ్‌లను ఆత్మహత్యలకు ముందు డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావించి, ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

లేఖల పరిశీలన

నూకరాజు, సౌజన్య రాసిన లేఖలను విశ్లేషిస్తున్న పోలీసులు నూకరాజు వియ్యంకుడు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దృష్టి సారించారు. తన కుమారుడిపై కోచ్‌ సాధిక్‌ ఖాన్‌ విష ప్రయోగం చేసి చంపేశాడని ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మృతుడు జగదీశ్వరరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన కావడం, జగదీశ్వరరెడ్డి మృతదేహాన్ని దహనం చేయడంతో ఆధారాలు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జగదీశ్వరరెడ్డి చనిపోవడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురై సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెబుతున్నారు. విష ప్రయోగం జరిగి ఉంటే అప్పటి మెడికల్‌ రిపోర్టుల్లో విషయం బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

కర్ణాటకకు పారిపోయిన నిందితుడు!

నిందితుడు సాధిక్‌ ఖాన్‌పై రాజమహేంద్రవరం టూటౌన్‌, కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అయితే సాధిక్‌ ఖాన్‌ సోమవారం తెల్లవారుజామునే పారిపోయినట్లు గుర్తించి, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలోని అతడి ఇల్లు, రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కాగా.. సాధిక్‌ ఖాన్‌ తన సెల్‌ఫోన్‌ వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అతడు కర్ణాటక పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement