ప్రగతి వెలుగుకు పోస్టుమార్ట్‌మ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రగతి వెలుగుకు పోస్టుమార్ట్‌మ్‌

Aug 19 2026 12:12 AM | Updated on Aug 19 2026 12:12 AM

మూతపడిన నిడదవోలు మహిళా మార్ట్‌

కూటమి మహిళా నేత పెత్తనంతో అస్తవ్యస్తం

నిడదవోలు రూరల్‌: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన నిడదవోలులోని వెలుగు మహిళా మార్ట్‌ లాభాల బాటలో పయనించింది. అతి తక్కువ కాలంలోనే కోట్ల టర్నోవర్‌ సాధించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆ పార్టీ మహిళ పెత్తనంతో మూతబడింది. వివరాల్లోకి వెళితే.. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉన్నత ఆశయంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయంలో నిడదవోలు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో మండల సమాఖ్య పరిధిలో వెలుగు మహిళా మార్ట్‌ను 2022 నవంబర్‌ 10న ప్రారంభించారు. 1700 గ్రూపుల పరిధిలోని ఒక్కొక్క సభ్యురాలు నుంచి రూ.220 చొప్పున మూలధన పెట్టుబడితో రూ.38.35 లక్షలతో దీన్ని ఏర్పాటు చేశారు. నాణ్యమైన సరుకులను బయట మార్కెట్‌ కంటే ఇక్కడి తక్కువ ధరలకే విక్రయించడంతో ప్రజల ఆదరణ పెరిగింది. తద్వారా స్టాక్‌ సేల్‌లో రాష్ట్రంలోని తొలి పది స్థానాల్లో ప్రతిరోజు నిలిచేది. రోజుకు రూ.లక్షకు పైగా వ్యాపారం చేయడంతో రూ.3 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

ఆమెదే పెత్తనం

మండల సమాఖ్య సభ్యుల పారదర్శక పర్యవేక్షణలో సాగాల్సిన మహిళా మార్ట్‌ నిర్వహణను టీడీపీ నియోజకవర్గ మహిళా నేత తన గుప్పెట్లోకి తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే 2024 డిసెంబర్‌లో మండల సమాఖ్య అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి, నిబంధనలకు విరుద్ధంగా ఆమె కుటుంబ సభ్యులు మార్ట్‌ రోజువారీ వ్యవహారాల్లో తలదూర్చారు. నగదు లావాదేవీల్లో వారి జోక్యం విపరీతంగా పెరిగింది. స్టాక్‌ రిజిస్టర్‌లో తప్పులు లెక్కలు చూపిస్తూ విక్రయాలు జరిపేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళా నేత భర్తతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ మార్ట్‌లోనే పనిచేస్తున్నట్లు జీతాలు తీసుకున్నారని డ్వాక్రా సభ్యులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వంలో మార్ట్‌ కార్యకలాపాల కోసం కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాన్ని సైతం ఆమె భర్త నడుపుతున్నారని తెలుస్తోంది.

చివరకు మూతపడి..

నిడదవోలులోని ఓ ప్రైవేటు భవనంలో మహిళా మార్ట్‌ను ఏర్పాటు చేసి, నెలకు రూ.21 వేల అద్దె చెల్లించేవారు. ఈ ఏడాది జనవరి 10న మూసివేసిన మార్ట్‌ తిరిగి తెరవలేదు. భవన యజమానికి 8 నెలలు అద్దె చెల్లించాల్సి ఉండటంతో ఆయన అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో జూన్‌లో మార్ట్‌ ఫర్నిచర్‌ను సూరాపురంలోని గ్రామ సమాఖ్య భవనానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement