కూలి పనికి వచ్చి కాలువలో గల్లంతు | - | Sakshi
Sakshi News home page

కూలి పనికి వచ్చి కాలువలో గల్లంతు

Aug 19 2026 12:12 AM | Updated on Aug 19 2026 12:12 AM

పెరవలి: ముక్కామలలోని బాపన్న కాలువలో స్నానం చేస్తున్న వ్యవసాయ కూలీ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జిల్లా ఏలేశ్వరం గ్రామానికి చెందిన ఏడిద రవితేజ (41) మరికొందరితో కలిసి వ్యవసాయ పనుల కోసం గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ముగ్గురు కాలువలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ మునిగిపోబోయారు. గమనించిన స్థానికుడు వెంటనే కాలువలోకి దూకి ఇద్దరికి కాపాడాడు. కానీ రవితేజ మాత్రం నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు, పోలీసులు స్థానిక గజ ఈతగాళ్లతో కాలువలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తహసీల్దార్‌ కె.నిరంజన్‌ ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితి పరిశీలించారు. కాలువలో గాలింపునకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం కావాలని ఉన్నతాధికారులను కోరారు. వారు వచ్చిన వెంటనే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని ఆయన తెలిపారు.

రైలు ఢీకొని వృద్ధుడి మృతి

రాజమహేంద్రవరం సిటీ: గోదావరి రైల్వే స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని రైలు ఢీకొని సుమారు 65 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడని రాజమహేంద్రవం జీఆర్పీ స్టేషన్‌ ఎస్‌ఐ సతీష్‌ మంగళవారం తెలిపారు. అతడి ఎత్తు దాదాపు 5.2 అడుగులు ఉంటుందని, ఒంటిపై ఆకుపచ్చ రంగు లుంగీ ఉందన్నారు. మరే ఇతర ఆధారాలు లభ్యం కాలేదని, ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్‌ 94948 19898, 0883 244282కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఆర్టీసీ బస్సు చక్రం ఎక్కడంతో మహిళ కాలు ఛిద్రం

కడియం: మండలంలోని వేమగిరిలో బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ ఒక మహిళ జారిపడిపోయింది. అదే బస్సు చక్రం ఆమె ఎడమకాలి మీదుగా వెళ్లడంతో కాలిభాగం నుజ్జునుజ్జయిపోయింది. కడియం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమగిరి తోట ప్రాంతానికి చెందిన వాసంశెట్టి మంగ మంగళవారం బస్సు ఎక్కుతూ జారి పడింది. అప్పటికే బస్సు కదిలిపోవడంతో ఆమె కాలు మీదుగా బస్సు వెనుక చక్రం వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కడియం ఇన్‌స్పెక్టర్‌ అల్లు వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దాడి ఘటనలో వ్యక్తికి జైలు

తొండంగి: అక్రమంగా ఇంట్లోకి చొరబడి, వ్యక్తిని గాయపరిచిన కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ తుని అడిషనల్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వి.గోపాలకృష్ణ మంగళవారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 జనవరిలో తొండంగి మండలం బెండపూడి శివారు సుబ్బరాయపురం గ్రామానికి చెందిన ఈర్లు శ్రీనువాస్‌ ఇంట్లోకి అన్నవరం గ్రామానికి చెందిన మెరపల నాగ కన్నయ్య అక్రమంగా ప్రవేశించాడు. శ్రీనువాస్‌తో గొడవపడి అతడి దవడపై బలంగా కొట్టడంతో పాటు చంపుతానని బెదిరించాడు. ఈ ఘటనలో బాధితుడి చెవి నుంచి రక్తస్రావం జరిగింది. అతడి ఫిర్యాదు మేరకు అప్పట్లో తొండంగి ఎస్సై బి.కృష్ణమాచారి దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. విచారణలో నిందితుడిపై నమోదైన అభియోగాలు రుజువు కావడంతో ఏడాది సాధారణ జైలు, మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.ఆరు వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

తగాదాను

వారించబోయిన వ్యక్తి మృతి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తల్లీ కొడుకుల మధ్య జరుగుతున్న తగాదాను వారించబోయిన వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇందిరా నగర్‌లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరదా రవిశంకర్‌, అతడి తల్లి మూడు రోజుల క్రితం ఇందిరానగర్‌లోని వారి ఇంటి వద్ద ఘర్షణ పడుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన కొలగాని రాజు (55) వారిని వారించేందుకు వెళ్లాడు. దీంతో రాజు చెంపపై రవిశంకర్‌ బలంగా కొట్టాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రాజును ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సురక్షితంగా

కువైట్‌ నుంచి కోనసీమకు..

అమలాపురం రూరల్‌: కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళను మైగ్రేషన్‌ మేనేజ్మెంట్‌ సెంటర్‌(ఎంఎంసీ) సమన్వయంతో సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంకకు చెందిన పెట్టా అనంతలక్ష్మి కువైట్‌ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలిపింది. భర్త ఎంఎంసీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం, ఎంఎంసీ కలసి ఆమెను సురక్షితంగా కోనసీమకు తీసుకువచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement