సఖినేటిపల్లి: పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద శనివారం అర్ధరాత్రి కాలువలోకి కారు దూసుకువెళ్లిన ఘటనలో సఖినేటిపల్లి మండలం మోరికి చెందిన మూడో ఇంజినీరింగ్ విద్యార్థి చెరుకూరి రాజారామ్ మృతదేహం ఎట్టకేలకు మంగళవారం గుర్తించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, అగ్నిమాపక బృందాలు చేపట్టిన గాలింపు చర్యల్లో పెనుగొండ వద్ద కాలువలో రాజారామ్ మృత దేహాన్ని కనుగొన్నారు. సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, ఉయ్యూరువారి మెరక గ్రామాలకు చెందిన చెరుకూరి రాజారామ్ (17), పోతుల లక్ష్మీభానువికాస్ (18), నాగిరెడ్డి దుష్యంత్ (18)లు పై దుర్ఘటనలో ప్రమాదం బారిన పడ్డారు. ఈ మేరకు ఐతంపూడి వద్ద ఘటనలో నీటి ప్రవాహానికి గల్లంతైన ఐదుగురులో నలుగురి మృతదేహాలు ఆదివారం వెలికితీశారు. వీరిలో మండలానికి చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్, నాగిరెడ్డి దుష్యంత్ మృతదేహాలకు అదే రోజున పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే అప్పటి నుంచి రాజారామ్ ఆచూకీ దొరకలేదు. దీంతో తండ్రి ప్రసాద్, తల్లి సత్యకుమారి పడ్డ వేదన వర్ణనాతీతం. కాగా రాజారామ్ మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నారు.
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
రెండు రోజులుగా నీటిలోనే ఉండిపోవడంతో రాజారామ్ మృతదేహం ఉబ్బిపోయి, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కొడుకు కోసం నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పాల్గొన్న తండ్రి దుర్గాప్రసాద్ విగతజీవిగా మారిన కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. బంధువుల రోదనలతో పెనుగొండ–మార్టేరు రహదారిపై తీవ్ర విషాదం అలముకుంది. రాజారామ్ తండ్రి దుర్గాప్రసాద్ గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ, ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. రాజారామ్‌ను సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్‌లో చేర్పించారు. బుధవారం నుంచే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలోకి నెట్టింది.
ఆటోడ్రైవర్
మానవత్వం
మృతదేహం చెట్టుకొమ్మల్లో ఇరుక్కుపోయి, దుర్వాసన వస్తుండటంతో వెలుపలికి తీయడం పోలీసులకు సవాలుగా మారింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పెనుగొండకు చెందిన ఆటోడ్రైవర్ చిట్టిబాబు తన ఆటోను ఆపి సహాయంగా నిలిచారు. ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో అతడు ధైర్యంగా వెళ్లి, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. చిట్టిబాబు ప్రదర్శించిన మానవత్వానికి పోలీసులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు.
ఐతంపూడి వద్ద ఘటన


