● జీవితంలో ఫొటోలకు అత్యంత ప్రాధాన్యం
● జ్ఞాపకాలకు మధుర రూపం
● అనుబంధాలను తెలిపే అద్భుతం
● నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
కపిలేశ్వరపురం: మానవుడు ఎంత డబ్బు ఖర్చు చేసినా, ఎన్ని పరిశోధనలు చేసినా గతించిన కాలంలోని ఒక్క క్షణాన్ని వెనక్కి తీసుకురాలేడు. కానీ ఒక్క ఫొటో మాత్రం గత కాలపు ఆనందాన్ని, వేడుకలను, ఆహ్లాదకర సమయాలను గుర్తుకు తెస్తుంది. మన జీవితంలో ఫొటోకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ముత్తాతల రూపం, తాతయ్య ఉమ్మడి ఇల్లు, నాన్న చిన్నప్పటి అల్లరి, మన బుడిబుడి అడుగులు.. ఇలా ప్రతి క్షణాన్ని తన గుండెలో దాచుకుని, కొత్త తరానికి పంచుతుంది. ప్రకృతి అందాలను తనలో బంధించి, ఆనందాన్నిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి గలగలలు, సముద్ర తీరం, కొబ్బరి తోటలు, పచ్చిక మైదానాలు ఇవన్నీ ఫొటోగ్రఫీకి చాలా బాగుంటాయి.
నేపథ్యమిదే..
రాయడం, చిత్రించడమని అర్థం కలిగిన గ్రాఫోన్ అనే పదం నుంచి ఫొటోగ్రఫీ వచ్చింది. ఇది కమర్షియల్‌గా 1839 జనవరి తొమ్మిదిన ప్రపంచానికి పరిచయమైంది. మెటల్ ఆధారిత పరికరాలతో డాగ్యురియోటైప్ పద్ధతిలో ఫొటోగ్రఫీని లూయిస్ డాగ్యురీ, జోసఫ్ నైస్‌ఫోర్ రూపకల్పన చేశారు. 1839 ఆగస్టు 19న ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ద్వారా ఫ్రెంచ్ ప్రభుత్వం పేటెంట్ హక్కులను దక్కించుకుని ప్రపంచానికి ఫొటోగ్రఫీని అందించింది.
పెరిగిన సాంకేతికత
వ్యవసాయమే జీవనాధారం గల ఆ రోజుల్లో ఫొటోగ్రఫీ ఓ అద్భుతమైన కళగా మారింది. ఎవరికీ అంతుచిక్కని గొప్ప విచిత్రమైన వృత్తిగా ఉండేది. అధునాతనమైన నేటి రోజుల్లో అదే పెరిగిన సాంకేతికత ఫొటోగ్రాఫర్లను సుడిగుండంలోకి పడేసింది. డిజిటల్ పరికరాలు వచ్చాక వినియోగదారులే ఫొటో రూపకర్తలుగా మారడం వృత్తిదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. సెల్ ఫోన్లలో ఫొటోల నాణ్యతను అనేక రెట్లు పెంచిన నేపథ్యంలో ఈవెంట్ల సమయంలో తప్ప మిగిలిన ఏ సందర్భంలోనూ ప్రజలు స్టూడియోలకు వెళ్లడం లేదు. యాప్‌లు, వెబ్‌సైట్‌లలో డిజిటల్ అప్‌లోడ్స్ విధానం వచ్చాక ఫొటోప్రింట్ల అవసరం కూడా లేకుండా పోయింది. ఏఐ సహకారంతో ఫొటో, బ్యానర్, ఫ్లెక్సీల డిజైన్లు చేసేసుకుంటున్నారు.
కెమెరానే నమ్ముకున్న జీవితాలెన్నో..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు నాలుగు వేల స్టూడియోలున్నాయి. అధునాతన, ఖరీదైన ఫొటోగ్రఫీ పరికరాలతో నడుస్తున్న స్టూడియోలు సుమారు 25 వరకు ఉంటాయి. సామాజిక అంశాలపై స్పందించిన రాజమహేంద్రవరానికి చెందిన జీవీవీ ప్రసాద్, ఎస్‌బీ రాజేశ్వరరావు పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ గోదావరి బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డులు 2025 పొందారు. కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామానికి చెందిన మేరేటి సోమరాజు తాను క్లిక్ మనిపించిన చిత్రాలకు 2016, 2017, 2019లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన పద్మాలయా స్టూడియోను 1986 ఆగస్టు 16న ప్రారంభించారు. ముగ్గురు అన్నదమ్ములు కుటుంబ సభ్యుల సమేతంగా ఆ వృత్తిలో శ్రమిస్తున్నారు. 40 ఏళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కెమెరాను వదలకుండా ముందుకు సాగుతున్నామని చిక్కం నరసింహారావు, శ్రీనివాస్, కాశీ విశ్వనాథం చెబుతున్నారు. శ్రీనివాస్ తీసిన పలు ఫొటోలకు మండపేటలో జోనల్ స్థాయి ఫొటో టేకింగ్ పోటీల్లో ప్రథమ బహుమతులు దక్కాయి.
ఫొటో అంటే కేవలం ప్రకృతి అందాలు, కుటుంబాల ఆప్యాయతలను మాత్రమే చూపించదు. యుద్ధాల సమయంలో జరిగే దారుణాలకు నిదర్శనంగా నిలుస్తోంది. అక్కడి ప్రజలు పడే ఇబ్బందులను ప్రపంచానికి తెలియజేసే ఆయుధంగా మారుతోంది. వరదలు, కరవు కాటకాల సమయంలో జరిగిన నష్టానికి సాక్ష్యంగా కూడా నిలుస్తోంది. ఇలా సంతోషం, బాధ, కష్టాలు, కన్నీరు ఇలా అన్నింటికీ ఆధారమవుతోంది.
అన్నింటికీ ఆధారం


