‘ఆగ్రహం’తో అందిన న్యాయం | - | Sakshi
Sakshi News home page

‘ఆగ్రహం’తో అందిన న్యాయం

Aug 13 2026 12:15 AM | Updated on Aug 13 2026 12:15 AM

‘నన్నయ’ బోధనేతర సిబ్బంది దీక్షల విరమణ

రాజానగరం: ఉద్యోగ భద్రత కోరుతూ ఆదికవి నన్నయ యూనివర్సిటీ ముఖద్వారం వద్ద నిరసన చేపట్టిన బోధనేతర (ఔట్‌ సోర్సింగ్‌) సిబ్బంది బుధవారం రిలే దీక్షలు విరమించారు. ఆగస్టు ఒకటిన వర్సిటీ అధికారులు జారీ చేసిన టెండర్‌ నోటీసుతో ఉద్యమ బాట పట్టిన వారంతా తమను యూనివర్సిటీ ఉద్యోగులుగా గుర్తించిన తరువాతనే ఇతర నియామకాలకు అవసరమైన టెండరు నోటీసులు జారీ చేయాలని అధికారులకు అల్టిమేటమ్‌ ఇచ్చిన ఆందోళనకు దిగారు. ఇదే విషయాన్ని ‘అన్యాయంపై ఆగ్రహం’ శీర్షికతో బుధవారం సాక్షిలో వచ్చిన కథనంతో అటు అధికారులు, ఇటు పాలకులలో కూడా ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కలుగజేసుకుని ఇటు దీక్షలు చేస్తున్న వారితో, అటు వర్సిటీ అధికారులతో సంప్రదించి నూతన నియామకాల కోసం జారీ చేసిన టెండరు నోటీసును రద్దు చేసేందుకు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని వర్సిటీ ఉద్యోగులుగా గుర్తించేలా చర్యలు తీసుకునేందుకు వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్‌ ఆచార్య కేవీ స్వామి హమీ ఇచ్చారు. దీంతో తమ రిలే దీక్షలను విరమించినట్టుగా యూనియన్‌ అధ్యక్షుడు నాగారపు విజయ్‌బాబు తెలిపారు.

ఎయిర్‌పోర్టులో తనిఖీలు

కోరుకొండ: రాజమహేంద్రవరం విమానాశ్రయంలో బుధవారం పోలీసుల, ఎస్‌పీఎఫ్‌, బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ విస్తృత తనిఖీలు చేపట్టారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా రెడ్‌ అలర్ట్‌ విధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టెర్మినల్‌భవనం, ఏటీసీ భవన సముదాయాల్లో తనిఖీ చేశారు.

కడలిలోకి

1.43 లక్షల క్యూసెక్కులు

ధవళేశ్వరం: కాటన్‌ బ్యారేజీ నుంచి బుధవారం 1,43,250 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.59 మీటర్లు, పేరూరు 9.19, దుమ్ముగూడెం 6.68 మీటర్లు, భద్రాచలంలో 19.30 అడుగులు, కూనవరంలో 9.17 మీటర్లు, కుంట 4.53, పోలవరం 6.22, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 13.97 మీటర్లుగా గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి.

ఆర్ట్స్‌ కళాశాలకు

ఐఐఆర్‌ఎఫ్‌ గుర్తింపు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): 173 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల ప్రతిష్ఠాత్మక జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూషన్‌ ర్యాంకింగ్‌ ప్రేమ్‌వర్క్‌ (ఐఐఆర్‌ఎఫ్‌) 2026 నిర్వహించిన సర్వేలో 21వ ర్యాంకు సాధించింది. ఆ వివరాలను ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర ఆర్‌కే బుధవారం తెలిపారు. కళాశాల విద్యా ప్రమాణాలు, ఆధునిక బోధనా విధానాలు, విద్యార్థి కేంద్రీకృత కార్యక్రమాలు, పరిశ్రమలతో అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్‌కు అనుగుణమైన మేనేజ్‌మెంట్‌ విద్యను ప్రతిబింబిస్తోందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక విద్యా విధానాలను స్వీకరిస్తూ కళాశాల ముందుకు సాగుతోందని. బీబీఏ ప్రోగ్రామ్‌ను జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో వాణిజ్యశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ బీపీ నరసారెడ్డి నాయకత్వంలో కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం చేసిన కృషి అభినందనీయమన్నారు. నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ.అన్నపూర్ణ, విద్యా సంబంధ సమన్వయంలో అకాడమిక్‌ సెల్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ.రాజేశ్వరి, పరిపాలనా సహకారంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వసంతలక్ష్మి వహించిన పాత్ర అభినందనీయమన్నారు.

ఐదు రోజుల పనిదినాలు

అమలు చేయాలి

రాజమహేంద్రవరం సిటీ: ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సమక్షంలో బ్యాంకు ఉద్యోగులకు ఒప్పందం కుదిరిన తర్వాత కూడా తమ 5 రోజుల పని దినాలపై ప్రకటన వెలువడక పోవడం దారుణమని ఎస్‌బీఐ ఆపీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ టి.శేషుకుమార్‌ ధ్వజమెత్తారు. బుధవారం యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ పిలుపు మేరకు నగరంలో కంబాల చెరువు ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ఏడు బ్యాంక్‌ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు, బ్యాంక్‌ ఉద్యోగులు ధర్నా చేశారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ ఆపీసర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్‌ఎన్‌ రాజు, ఎన్‌సీబీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ డీఎస్‌ పేరిశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement